ఖమ్మం జిల్లాలో డబుల్‌ రిజిస్ట్రేషన్‌ మాయాజాలం కొనసాగుతోంది. ఒకే స్థలానికి రెండుసార్లు రిజిస్ట్రేషన్‌ చేయడం వివాదాలకు కారణమవుతోంది. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ తరహా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. ఎక్కువగా ఖమ్మం, కూసుమంచి, ఖమ్మంరూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో డబుల్‌ రిజిస్ట్రేషన్లతో అనేకమంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వెంచర్లలో ఒకే ప్లాట్‌ ఇద్దరికి రిజిస్ట్రేషన్‌ చేసిన సంఘటనలు కోకొల్లలు. ఇవే ఆరోపణలపై గతంలో ఖమ్మం రూరల్‌ ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌పై వేటుపడింది.
ఒకే స్థలానికి రెండుసార్లు..
జిల్లావ్యాప్తంగా ఒకే స్థలానికి రెండుసార్లు రిజిస్ట్రేషన్లు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. వెంచర్లకు సంబంధించి ఇటువంటి సంఘటనలు తరచుగా జరుగుతుండటంతో కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే వ్యవసాయ భూములకు సంబంధించి కూడా కొన్నిసార్లు డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. ఒక స్థలాన్ని తండ్రి ఓ వ్యక్తికి అమ్మి రిజిస్ట్రేషన్‌ చేస్తారు. పది, ఇరవై ఏళ్ల తర్వాత అదే స్థలాన్ని కుమారుడు మరో వ్యక్తికి విక్రయించి రిజిస్ట్రేషన్‌ చేయించడం వల్ల డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. అలాగే వెంచర్లకు సంబంధించి ఒకేసారి ఒకరికి అమ్మిన తర్వాత.. అదే ప్లాట్‌ను నెంబర్లు మార్చి అమ్మడం వల్ల డబుల్‌ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
జిల్లావ్యాప్తంగా ఫిర్యాదులు..
డబుల్‌ రిజిస్ట్రేషన్లపై  జిల్లావ్యాప్తంగా పలు ఫిర్యాదులు ఉన్నాయి. తాజాగా దాదాపు 50 వరకు ఇలాంటి వివాదాలు ఉన్నట్లు సమాచారం. ఒక్క కూసుమంచి సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో డబుల్‌ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఎక్కువ సంఘటనలు చోటు చేసుకున్నాయి. రఘునాథపాలెం రెవెన్యూ పరిధిలోనే 30 నుంచి 40 వరకు డబుల్‌ రిజిస్ట్రేషన్లు అయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బల్లేపల్లి సమీపంలోని వెంచర్లలో ఒకే ప్లాట్‌ను ఇద్దరికి అమ్మి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. డబుల్‌ రిజిస్ట్రేషన్లతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటోంది. రూ. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన భూమి డబుల్‌ రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు తెలియడంతో బాధితులు పోలీస్‌ స్టేషన్ల చుట్లూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 
డబుల్‌ రిజిస్ట్రేషన్లపై పట్టింపేది..
జిల్లావ్యాప్తంగా డబుల్‌ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కార్యాలయాల్లో ఆస్తులు, వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌ చేసే క్రమంలో ఈ భూమి గతంలో ఎవరికైనా రిజిస్టర్‌ అయిందా..? అనే అంశాలను పరిశీలించడం లేదు. అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నాయా..? లేవా..? చూసి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. దీంతో గతంలో రిజిస్ట్రేషన్‌ చేసిన ఆస్తులకు కూడా మళ్లీ రిజిస్ట్రేషన్‌ అయ్యే అవకాశం ఉంటోంది.  స్థలాలు కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఆస్తులకు రిజిస్ట్రేషన్‌ చేయించుకుని వదిలేస్తున్నారు. అయితే రెవెన్యూ కార్యాలయాల్లో, మున్సిపాలిటీల్లో ఆస్తుల బదలాయింపు చేయించుకోకపోవడంతో అక్కడ పేరు మార్పు జరగడం లేదు. దీంతో వారసులు ఆ భూమిని మళ్లీ అమ్మేందుకు వీలు కలుగుతోంది.  రిజిస్ట్రేషన్‌ జరిగినా పాత ఓనర్ పేరుతోనే ఆస్తులు ఉండటంతో వాటిని మళ్లీ అమ్మకాలు చేస్తుండడం గమనార్హం.
ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్‌ చేసి..
రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో పలు అక్రమాలకు పాల్పడిన ఖమ్మంరూరల్‌ ఇన్‌చార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ కరుణ సస్పెన్షన్‌కు గురైంది.  గతంలో ఖమ్మం రూరల్‌ మండలం ఏదులాపురం రెవెన్యూలోని 142 సర్వేనెంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రై వేట్‌ వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. అలాగే నిబంధనలకు విరుద్ధంగా లింక్‌ డాక్యుమెంట్లు లేకున్నా పలు స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆమెపై ఫిర్యాదులు వచ్చాయి. 113 డాక్యుమెంట్లను లింక్‌ డాక్యుమెంట్లు లేకుండానే రిజిస్ట్రేషన్‌ చేసినట్లు గుర్తించారు. ప్రైవేట్‌ వ్యక్తులను ఏర్పాటు చేసుకున్న ఆమె ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. 


 Also Read: MP Raghurama: ఎంపీ రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు.. Hydలోని ఇంటి ఎదుట హడావుడి


Also Read: Viral News: మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా? ఉప్పే కాదు అంతకుమించి! ఈ షాకింగ్ విషయాలు చూడండి! 


Also Read: Horoscope Today 12th January 2022: ఈ రాశుల వారికి ఈ రోజంతా శుభసమయమే... మీ రాశి ఫలితం


Also Read: OMICRON: ఒమిక్రాన్ వేరియంట్‌ను అణిచేయాలంటే బూస్టర్ డోస్ అవసరం... చెబుతున్న కొత్త పరిశోధన


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి