భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళాడుతున్నాయి. 'బుల్' కొత్త శిఖరాలు అధిరోహించేందుకు రంకెలేస్తోంది. అన్నీ సానుకూలతలే ఉండటంతో బీఎస్‌ఈ సెనెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీలు సరికొత్త గరిష్ఠాలను తాకుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ చూడనంత వేగంగా మదుపర్లకు సంపదను సమకూర్చి పెడుతున్నాయి. సూచీలు గురువారం నాటి జోరునే శుక్రవారమూ కొనసాగిస్తున్నాయి.
గురువారం 59,141 వద్ద ముగిసిన సెనెక్స్ శుక్రవారం ప్రి ఓపెన్లో 269 పాయింట్లు లాభంతో మొదలైంది. 59,410 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. మరికాసేపటికే పుంజుకొని 338 పాయిట్లు పెరిగి 59,527 వద్ద కొనసాగించింది. ఉదయం 11 గంటల సమయంలో 59,721 వద్ద ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని అందుకొంది. అయితే మదుపర్లు విక్రయాలకు దిగడం 12 గంటలకు ముందు 59,483 వద్ద కొనసాగుతోంది. మార్కెట్లు ముగిసే సమయానికి సెనెక్స్ సరికొత్త రికార్డు నెలకొల్పుతుందనే అంచనాలు ఉన్నాయి.
నిఫ్టీ సైతం సెన్సెక్స్ బాటలోనే నడుస్తోంది. గురువారం 17,630 వద్ద ముగిసిన సూచీ గురువారం ప్రి ఓపెన్లో 50 పాయింట్లు లాభపడి 17,700 వద్ద ఆరంభమైంది. ఉదయం 11 గంటల సమయంలో ఇంట్రాడేలో సరికొత్త గరిష్ఠమైన 17,787ను తాకింది. శుక్రవారం కావడం, వారంలో చివరి రోజు కావడంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో 12 గంటలకు ముందు 17,682 వద్ద కొనసాగుతోంది.
ఎన్‌ఎస్‌ఈలో బజాబ్ ఫిన్‌సర్వ్ షేరు అత్యధికంగా 3.6 శాతం లాభపడింది. కొటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టైటాన్, మారుతి లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, కోల్ ఇండియా 3 శాతానికి పైగా నష్టపోయాయి. ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, యూపీఎల్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
నోట్: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు నష్టభయంతో కూడుకున్నవి. షేర్లలో పెట్టుబడి పెట్టేటప్పుడు నిపుణులు సలహాలు తీసుకోవడం అవసరం! ఏబీపీ అందిస్తోన్న మార్కెట్ల సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఫలానా స్టాక్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏబీపీ చెప్పడం లేదు.