తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ.. ఇవాళ భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చింది. నిర్మల్ లో రాంజీ గోండు పోరాట స్మృతులను గుర్తు చేసుకుంటూ ఎల్లపల్లిలో భారీ సభను నిర్వహించనుంది. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. ఈ సభలో పాల్గొనేందుకు ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు అమిత్ షా హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నిర్మల్ కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారు. బత్తిస్ఘడ్ ప్రాంతంలో అధికారులు హెలిప్యాడ్ ను ఏర్పాటు చేశారు. అమిత్ షా నిర్మల్ లో పర్యటన నేపథ్యంలో ఎల్లపల్లి బహిరంగ సభాస్థలితో పాటు వేయి ఉరుల మర్రి, రాంజీ గోండు స్మారక స్తూపం ఏరియా కురన్న పేట, బత్తిస్ఘడ్ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 535 మంది పోలీసు బలగాలతో, నలుగురు ఎస్పీలు, ఎనిమిది మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. కేంద్ర భద్రత బలగాలు, ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసులు అమిత్ షా టూర్ ను పర్యవేక్షిస్తున్నాయి.
Also Read: Telangana Liberation Day: హైదరాబాద్ విలీనానికి ముందు జరిగిందేంటి? విమోచనంపై ఇన్ని వాదనలెందుకు?
అమిత్ షా ప్రసంగంపై ఉత్కంఠ
శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యే అమిత్ షా సభకు అన్ని ఏర్పాట్లు చేశారు బీజేపీ శ్రేణులు. ఈ సభకు భారీ ఎత్తున జనం హాజరయ్యేలా చర్యలు చేపట్టారు. కార్యకర్తలు, ఆదివాసీ గిరిజన అభిమానులతోనే సభాస్థలి నింపేందుకు ఏర్పాట్లుచేశారు. 8 ఎకరాల స్థలంలో 25 వేల సీటింగ్‌తో పాటు 70 వేల మందికి పైగా హాజరయ్యేలా సభాస్థలిని నిర్మించారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్ కు చేరుకోనున్న అమిత్ షా ప్రత్యేక వాహనంలో రాంజీ గోండు స్మారక స్తూపాన్ని దర్శించుకుని నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి బత్తిస్ఘడ్ రోడ్డు మార్గం ద్వారా ఎల్లపల్లి సభాస్థలికి వెళ్తారు. ఈ సభ సాయంత్రం 5 గంటల వరకు సభ కొనసాగనుంది. అమిత్ షా ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తారా?...రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ప్రకటనలు చేస్తారని బీజేపీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఆదివాసీ ఓటు బ్యాంకు
అమిత్ షా పర్యటనపై బీజేపీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆదివాసీలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. తొలి స్వతంత్ర సగ్రామంలో అమరులైన వీరుల త్యాగాలను ఈ సభ ద్వారా తెలిపేందుకు, నిర్మల్ లో ఆదివాసీ అమర వీరుల చరిత్రకు సాక్ష్యంగా ఉన్న వెయి ఉరుల మర్రి, రాంజీ గోండు పోరాటాన్ని తెలియజేయడం, తెలంగాణ విమోచన పోరాటంలో అమరులైన వీరులను స్మరించుకోవడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని బీజేపీ చెబుతోంది.
Also Read: Telangana Liberation Day: ఆపరేషన్ పోలో అంటే ఏంటి? హైదరాబాద్ విలీనానికి ముందు 5 రోజులు ఏం జరిగింది?