మనదేశంలో ప్రధానమైన ఆహారం బియ్యం. దీన్ని వండడం కూడా చాలా సులువు. మితంగా తింటే ఎంతో ఆరోగ్యం. కానీ సరిగా వండని అన్నం తినడం మాత్రం చాలా ప్రమాదకరమని కొత్త అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. కొంతమంది తక్కువ నీటితో అన్నాన్ని ఉడికిస్తారు. సరిగా ఉడక్కుండా మెతుకులు గట్టిగా అవుతాయి. అయినా సరే ఆ అన్నాన్ని తినేస్తారు. అలాగే కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అన్నం పొడిగా వచ్చేందుకు వాటిని పూర్తిగా ఉడకనివ్వరు. ఇలాంటి సరిగా వండని అన్నాన్ని తినడం వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువని ఓ అధ్యయనం చెబుతోంద.
మనం తినే ఆహారాలన్నీ దాదాపు రసాయనాలతో మిళితమైనవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పంటలకు చీడా పీడా పట్టకుండా క్రిమిసంహారక మందులు వాడుతూనే ఉన్నారు. ఆ మందులు మొక్కలపైనే కాదు, మట్టిపైన కూడా పడి, ఆ మట్టిలో రసాయనాలు కలిసిపోయాయి. ఇలా కొన్నేళ్ల నుంచి జరుగుతుంటే మట్టి నుంచి రసాయనాలు మొక్కల ద్వారా, పంట పై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇంగ్లాండ్ లోని క్వీన్స్ యూనివర్సిటీ వారి అధ్యయనం ప్రకారం మట్టిలోకి పరిశ్రమల వ్యర్థాల వల్ల చేరిన రసాయనాలు, పురుగుల మందుల నుంచి చేరిన రసాయనాలు కలిపి వరి పంటని ప్రమాదకరంగా మారుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇది ఆర్సెనిక్ అనే విషతుల్యమైన రసాయనంగా మారుతుందని అధ్యయనం చెబుతోంది.
కేవలం ఇదొక్క అధ్యయనమే కాదు పలు పరిశోధనలు అన్నం క్యాన్సర్ కారకమని పేర్కొంటున్నాయి. కాలిఫోర్నియా టీచర్స్ స్టడీ పేరుతో 90వ దశకంలో మరొక అధ్యయనం ప్రారంభించారు. వేల మంది ఈ అధ్యయనంలో భాగస్వాములయ్యారు. వారిలో 9,400 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. వారిలో ఎక్కవ మందికి రొమ్ము క్యాన్సర్ లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది.
ఆర్సెనిక్ అంటే...
వివిధ ఖనిజాలలో ఉండే రసాయనం ఇది. పారిశ్రామిక పురుగుమందుల తయారీలో దీన్ని వాడుతారు. ఆహారం లేదా నీటి ద్వారా దీర్ఘకాలం ఆర్సెనిక్ ను మనం స్వీకరిస్తే అది విషంగా మారుతుంది. వాంతులు, కడుపునొప్పి, విరేచనాలతో పాటూ క్యాన్సర్ కారకం అవుతుంది. అధ్యయనం ప్రకారం బియ్యం అధికస్థాయిలో ఆర్సెనిక్ ను కలిగి ఉంది. అందుకే బియ్యాన్ని బాగా ఉడికించి తినాలి. లేకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవు.
ఎలా వండితే మంచిది?
1. ఒక కప్పు బియ్యానికి అయిదు కప్పుల నీటిని జోడించాలి. అన్నం బాగా ఉడికాక, అదనపు నీరుని వడకట్టేయాలి. ఇలా పూర్వకాలంలో వండేవారు. ఇలా వండితే ఆర్సెనిక్ స్థాయి సగానికి తగ్గిపోతుంది.
2. బియ్యాన్ని కొన్ని గంటల పాటూ నానబెట్టి తరువాత వండితే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. నాన బెట్టిన నీటిని బయట పడేయాలి. ఇలా చేస్తే 80 శాతం ఆర్సెనిక్ ప్రభావం తగ్గిపోతుందని చెబుతున్నారు. ఆ పద్దతితో బియ్యం బాగా నానిపోతాయి, కనుక అన్నం ముద్దవుతుంది.