1947 ఆగస్టు 15 బ్రిటిష్ పాలన అంతమై.. భారతదేశం స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంది. అయితే దేశం నడి మధ్యలో ఉన్న హైదరాబాద్ మాత్రం నిజాం పాలనలోనే ఉంది. హైదరాబాద్ సంస్థానం స్వేచ్ఛ వాయువు పీల్చుకోవడానికి.. ఏడాదికి పైగా సమయం పట్టింది. వెళ్తూ.. వెళ్తూ.. బ్రిటిష్ వారు పెట్టిన మెలికే ఇందుకు కారణమైంది. సంస్థానాలు.. భారత యూనియన్‌లో ఇష్టమైతే కలవొచ్చు అని వారు చెప్పిన మాటే.. నిజాం రాజుకు అవకాశంగా మారింది. హైదరాబాద్ స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించుకున్నాడు ఏడో నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్.
మరోవైపు హైదరాబాద్‌లోని ప్రజలు స్వాతంత్య్ర భారతంలో కలిసిపోవాలని.. కలలు కన్నారు. తనకు సొంత సైన్యం, కరెన్సీ ఉన్నందున తానే పరిపాలించాలనుకున్నాడు నిజాం. హైదరాబాద్ అటు ఇండియాలో.. ఇటు పాకిస్థాన్‌లో కలవదని.. ప్రకటించాడు. ఈ సమయంలోనే తన రాజ్యం చేయి జారిపోతుందనే ఆలోచనతో పాకిస్థాన్ సాయం కోరాడు. మరోవైపు ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు. దీనిని సహించని.. భారత ప్రభుత్వం హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో కలుపుకోవాలనుకుంది. అప్పటి కేంద్రం హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ హైదరాబాద్ రాజ్యంపై పోలీస్ చర్యకు దిగాలని నిర్ణయించారు.
1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చింది. అప్పటికీ స్వేచ్ఛ వాయువు అందని.. నిజాం రాజ్యంలోని ప్రజలు.. కొన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఎగరవేయాలని నిర్ణయించారు. వాటిని అణగదొక్కేందుకు నిజాం ప్రత్యేక సైన్యమైన ఖాసీం రజ్వి నేతృత్వంలోని రజాకార్లు ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో తెలంగాణవ్యాప్తంగా వందల మంది వీరులు ప్రాణాలు కోల్పోయారు.
1947 సెప్టెంబర్ 2న వరంగల్ జిల్లాలోని పరకాలలో జాతీయ పతాకం ఎగురవేయలని నిర్ణయించారు. కానీ, వారిపై రజాకార్లు కాల్పులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో అక్కడ 22 మంది అమరులయ్యారు.
ప్రస్తుత సిద్ధిపేట జిల్లాలోని వీర బైరాన్‌పల్లి యోధులు.. రజాకార్ల దురగతాలకు వ్యతిరేకంగా పోరు చేశారు. బైరాన్‌పల్లి గ్రామ రక్షకదళం.. రజాకార్లపై ఎదురొడ్డి ప్రతిదాడులు చేశారు. 1948 ఆగస్టు 27వ తేదీన వేకువ జామున 4 గంటల ప్రాంతంలో ఖాసీం రజ్వి సైనికులు (రజాకార్లు) తమకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునేందుకు బైరాన్‌పల్లి గ్రామంపైకి దాడికి వచ్చారు. సుమారు 12 వందల మంది గ్రామాన్ని చుట్టుముట్టారు. ఈ దాడిలో 25 మంది రజాకార్లు 118 మంది గ్రామస్తులు మృతి చెందారు. ఇలా స్వాతంత్య్ర భారతంలో కలిసి స్వేచ్ఛా వాయువు పీల్చుకోవాలనుకున్న గ్రామాల్లో రజాకార్లు దాడులు చేసి హింసించేవారు.
రజకార్ల ఆగడాలు ఎలా ఉండేవి అంటే..
రైతులు పండించిన పంటలకు కూడా వారికి దక్కనిచ్చేవారు కాదు. మహిళలపై అత్యాచారాలు చేసేవారు. మహిళలతో నగ్నంగా బతుకమ్మ ఆడించేవారు. నిజాం పాలకులు ఉద్యమాలను ఆపడానికి ఉద్యమకారులను చిత్రహింసలకు గురిచేసేవారు. గోళ్ల కింద గుండు సూదులు, బ్లేడ్లతో శరీరంపై కోసి గాయాలపై కారం పోసేవారు. సిగరెట్లతో కాల్చేవారు. బొటనవేళ్లకు తాళ్లు కట్టి తలకిందులుగా వేలాడదీసేవారు.
సాయుధ పోరాటం..
ఆ సమయంలోనే మరోవైపు కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారు. గ్రామీణ సమాజంలో కింది కులాల వారిని వెట్టి చాకిరి చేయించేవాళ్లు. గడీలలో సంబురాలు జరిగితే అన్ని కులాల వాళ్లు ఉచితంగా సేవలు చేయాల్సి ఉండేది. కమ్యూనిస్టులు గ్రామీణ ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడంతో వాళ్లకు ప్రజల్లో ఆదరణ లభించింది. నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడింది. దొరల నుంచి, రజాకార్ల నుంచి దాడులు పెరిగాయి. ఆ సమయంలోనే కాల్పుల్లో దొడ్డి కొమురయ్య అమరుడయ్యాడు. ఆ తర్వాత ఉద్యమం మలుపు తిరిగింది. నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఉద్యమం వేడెక్కింది.
బ్రిటన్ ప్రధానికి లేఖ..
హైదరాబాద్ సంస్థానాన్ని.. భారత యూనియన్‌లో కలిపేయకుండా ఉండేందుకు నిజాం రాజు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నిజాం పెద్ద ఎత్తున ఆయుధాల్ని సమకూర్చుకోవడాన్ని భారత ప్రభుత్వం తప్పుబట్టింది. భారత యూనియన్‌కు తన సంస్థానానికి వచ్చిన వివాదంపై ఐక్యరాజ్య సమితికి తెలియజేశాడు నిజాం. వివాదంలో జోక్యం చేసుకోవాలంటూ.. బ్రిటన్ ప్రధానికి లేఖ రాశాడు. కానీ... భారత ప్రభుత్వంతో పరిష్కారానికి రావాలని ఆయన సూచించారు.
ఆపరేషన్ పోలో పేరుతో..
వీటన్నింటిని చూసి.. చూసి ఉన్న భారత ప్రభుత్వం.. సమయం కోసం వెయిట్ చేసింది. హైదరాబాద్ రాజ్యానికి పెద్ద మద్దతుదారుడైన మహ్మద్ అలీ జిన్నా 1948 సెప్టెంబర్ 12న మరణించాడు. ఇదే అదునుగా ఐక్యరాజ్య సమితిలో హైదరాబాద్ అంశం చర్చకు రాదని అనుకున్న భారత ప్రభుత్వం.. పోలీస్ చర్యకు దిగింది. దానికి 'ఆపరేషన్ పోలో' అని పేరు పెట్టింది. సైనిక చర్యకు బదులుగా పోలీస్ చర్యగా నామకరణం చేసి.. హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసేందుకు రంగంలోకి దిగారు అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్. 1948 సెప్టెంబర్ 13న ఉదయం 4 గంటలకు పోలీస్ చర్య ప్రారంభమైంది. సెప్టెంబర్ 17 వరకు భారత సైన్యం హైదరాబాద్ చేరుకుంది. ఇక అపజయం తప్పదనుకున్న నిజాం రాజు.. భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైంది.
విమోచనం.. కాదు విలీనం..
అయితే ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. విమోచన దినంగా ప్రకటించాలని కొంతమంది నేతలు అంటుంటే.. విలీన దినోత్సవం అని మరికొందరు అంటున్నారు. ఇంకొందరు విద్రోహ దినోత్సవంగా చెప్పుకుంటారు.
మజ్లిస్‌కు భయపడే సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేస్తోంది. సెప్టెంబర్ 17ను తెలంగాణకు విద్రోహ దినమా? విలీన దినమా? విమోచన దినమా? దాన్ని ఏ విధంగా పరిగణించాలి అనే చర్చ మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న కాలంలో ప్రారంభమైంది. అంతముందు ఈ చర్చ అంతగా లేదు.
అతివాద వామపక్ష భావవాదులు సెప్టెంబరు 17ను విద్రోహ దినంగా పరిగణించాలని వ్యాఖ్యానిస్తే మితవాదులు దాన్ని విమోచన దినంగా పాటించాలనడం మధ్యేయవాదులు దాన్ని విలీన దినంగా పరిగణించాలనడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సెప్టెంబరు 17కు సమాధానాలు చెబుతున్నారు.
Also Read: Telangana Liberation Day: ఆపరేషన్ పోలో అంటే ఏంటి? హైదరాబాద్ విలీనానికి ముందు 5 రోజులు ఏం జరిగింది?