1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా కూడా ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మాత్రం రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయనని స్పష్టమైన ప్రకటన చేశారు. భారత ప్రభుత్వం తప్పని పరిస్థితులలో నిజాం రాజ్యంపై పోలీసులు చర్య చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయం ఒకటుంది. హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వం ప్రత్యేక దేశంగా గుర్తించలేదు. గుర్తిస్తే.. సైనిక చర్యగా భావించాల్సి వచ్చేది. కానీ భారత ప్రభుత్వం చేసింది పోలీస్ చర్య. అప్పట్లో నిజాం సంస్థానం చాలా పెద్దది. తెలంగాణతోపాటూ.. మహారాష్ట్రలో 5 జిల్లాలు, కర్ణాటకలో 3 జిల్లాలు కూడా అందులో కలిసి ఉండేవి.
చరిత్రలో ఆ ఐదు రోజులు కీలకం
అప్పుడు దేశవ్యాప్తంగా 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటీష్ పాలకులు స్వాతంత్ర్యం ఇస్తూనే... సంస్థానాలు ఇండియాలో కలవాలో లేదో నిర్ణయించుకునే ఛాన్స్ వాటికే ఇచ్చారు. ఫలితంగా మూడు సంస్థానాలు ఇండియాలో కలవలేదు. అవి కశ్మీర్, జునాఘడ్, హైదరాబాద్ (నిజాం). ఆ పరిస్థితుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్.. ప్రత్యేకశ్రద్ధ పెట్టి జునాఘడ్ సంస్థానాన్ని భారత్‌లో కలిసేలా చేశారు. ఆ తర్వత హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేసేందుకు ప్రణాళికలు చేశారు. చరిత్రలో ఆ ఐదు రోజులు మాత్రమే కీలకం. ఇంతకీ అప్పుడు ఏం జరిగింది.
ఆపరేషన్ పోలో
భారత ప్రభుత్వం 1948లో జూలై చివరి వారంలో హైదరాబాద్ రాజ్యంపై దాడి చేయడానికి సిద్ధమైంది. కానీ ఆ సమయంలో ఋతుపవనాలు అధికంగా ఉన్నాయి. మరోవైపు కశ్మీర్ సమస్య అధికంగా ఉండటంతో దాడి వాయిదా పడింది. హైదరాబాద్ రాజ్యాంపై సైనిక చర్య నిర్వహిస్తున్నప్పటికి దానికి పోలీస్ చర్య అని నామకరణం చేశారు. ఎందుకంటే ఒక స్వతంత్ర్య రాజ్యం మరో స్వతంత్య్ర రాజ్యంపై సైనిక చర్య నిర్వహించడం ఐక్యరాజ్య సమితి ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. దీనినే ఆపరేషన్ పోలో అని కూడా అంటారు. నిజాం రాజ్యంలో పోలో గ్రౌండ్లు ఎక్కువగా ఉంటాయి. దీన్నే ఆపరేషన్ కాటర్ పిల్లర్ అని కూడా పిలుస్తారు.
రెండు గంటల్లోనే 25 ఫాండర్ల ఫిరంగులు
నిజాం రాష్ట్రంపై పోలీసు చర్య 1948 సెప్టెంబర్ 13వ తేదీ ఉదయ 4 గంటలకే మెుదలైంది. ఉత్తరంలో ఔరంగాబాద్, పశ్చిమాన షోలాపూర్, దక్షిణాన కర్నూలు, వాయువ్యంలో ఆదిలాబాద్, ఆగ్నేయంలో విజయవాడ, నైఋతిలో రాయచూరు నుంచి ఒకేసారి ఆపరేషన్ పోలో మెుదలైంది. అప్పడే హైదరాబాద్ సంస్థాన్ విలీనమవుతుందనే.. సంకేతాలు మెల్లమెల్లగా బలపడ్డాయి. దక్షిణ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మహారాజాసింగ్ జి.ఓ.సి పర్యవేక్షణలో భారత సైనిక దళాలు నలువైపుల నుంచి నిజాం రాష్ట్రాన్ని ముట్టడించాయి. అయితే విజయవాడ, షోలాపూర్ నుంచే అసలైన ప్రణాళికలు వేస్తూ.. దాడులు ఎక్కువగా జరిగాయి. సెప్టెంబర్ 13న మెుదటగా నల్ దుర్గ్ పట్టణం దగ్గర ఉన్న ఎత్తయిన ప్రదేశాన్ని భారత సైన్యం ఆక్రమించింది. రెండు గంటల్లోనే 25 ఫాండర్ల ఫిరంగులు యూనియన్ సైనికుల హస్తగతమైంది. ఇలా ఒక్కోరోజు భారత సైన్యం ముందుక కదులుతూనే ఉంది.
బాంబుల వర్షం
మేజర్ జనరల్ వి.వి రుద్ర విజయవాడ నుంచి సైన్యంతో బయలుదేరి.. పాలేరు నదిని దాటి నల్లబండ గూడెం వైపు నుంచి ముందుకు వచ్చారు. హైదరాబాద్, విజయవాడకు ఓన్లీ ట్రంక్ టెలిఫోన్ సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. మిగతా సంబంధాలన్నీ తెలిపోయాయి. యూనియన్ సైన్యాన్ని నిజాం మిలటరీ ఎదురించలేకపోయింది. అయితే సూర్యాపేట దగ్గరలోని దురాజ్ పల్లి క్యాంపు చాలా పెద్దది. నిజాం సైనికులు, రజాకార్లు ఎంతగానో పోరాడినా.. ఇక్కడ ఫలితం లేకుండా పోయింది. ఉండ్రుగొండ కోటలో స్థావరం ఏర్పాటు చేసుకున్న నిజాం మిలటరీ, రజాకారు, పోలీస్ శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి భారత యుద్ధ విమానాలు.
నిజాం ప్రభువు రేడియో ప్రకటన
ఇక సెప్టెంబర్ 17 రానే వచ్చింది. యూనియన్ సైన్యం పటాన్ చెరువు ప్రాంతానికి వచ్చింది. ఈ విషయం తెలిసిన నిజాం ప్రభువు. తనకు అపజయం తప్పదని అనుకున్నాడు. సీజ్ ఫైర్ ఆజ్ఞలను జారీ చేశాడు. యూనియన్ సైన్యం రావచ్చునని ప్రకటించాడు. యూనియన్ సైన్యానికి ప్రజలు జయజయధ్వానాలు పలుకుతు స్వాగతం చెప్పారని చరిత్రకారులు చెబుతారు. అయితే అంతకుముందు.. నిజాం సైనికులు, రజాకార్లు.. యూనియన్ సైన్యాన్ని నిరోధించడానికి టేకుమట్ల దగ్గర ఉన్న మూసీ వంతెనను పేల్చాయి. ఈ కారణంగా భారత సైన్యం ఒక రోజు ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకుంది. సూర్యపేట తర్వాత ట్రంకురోడ్డుపై ఒకటి రెండు.. మాత్రమే.. చిన్న చిన్న ఘటనలు జరిగాయి. సెప్టెంబర్ 17న సాయంత్రం 5 గంటలు అవుతుంది. భారత సైన్యం సికింద్రాబాద్ కి చేరింది. ఆ తర్వాత లాయఖ్ అలీ మంత్రి వర్గం రాజీనామా చేసింది. వెంటనే ప్రభుత్వ పగ్గాలను నిజాంకు అప్పగించారు. సెప్టెంబర్ 17న సాయంత్రం నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ దక్కన్ రేడియో నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
'నా ప్రియమైన ప్రజలారా.. భారతదేశపు గవర్నర్ జనరల్ హిజ్ ఎక్స్ లెన్సీ రాజగోపాలా చారి పేర ఈ సందేశాన్ని తెలపడానికి సంతోషిస్తున్నాను. నా ప్రభుత్వం రాజీనామా చేసింది. ఈ చర్య ఇంతకు పూర్వమే తీసుకోనందును విచారపడుతున్నాను. ఇప్పుడు చాలా ఆలస్యమైంది. ఈ సున్నితమైన సమయంలో నేనేమి చేయలేకుండా ఉన్నాను. నా సైన్యాన్ని యుద్ధ విరమణ చేయాల్సిందిగా ఆదేశించానని గవర్నర్ జనరల్ గారికి తెలియజేస్తున్నాను. భారత సైన్యం బొల్లారం, సికింద్రాబాద్ లోని సైనిక స్థావరాల్లో ఉండటానికి అనుమతిస్తున్నాను. కొత్త మంత్రి వర్గం ఏర్పడే వరకు.. కొత్త ప్రధానమంత్రిని నియమించబడేంత వరకూ దైనందిన పరిపాలన వ్యవహారాల్లో నాకు సహాయపడటానికి ఒక కమిటీని నియమించాను.'
భారత్ లో విలీనం
1948 సెప్టెంబర్ నిజాం సైన్యాధిపతి ఎల్ డ్రూస్.. మేజర్ జనరల్ చౌదరి ముందు లొంగిపోయారు. జయంత్ నాథ్ చౌదరి పాలనా బాధ్యతలు స్వీకరించారు. అయితే చట్టరీత్యా రాజ్యాధినేతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కొనసాగారు. లాయఖ్ అలీని గృహ నిర్బంధంలో ఉంచడం, ఖాశీం రజ్వీని తిరుమలగిరిలోని సైనిక కారాగారంలో నిర్బంధించడం జరిగింది. పోలీస్ చర్యా తర్వాత హైదరాబాద్ సంస్థానానికి వచ్చిన సర్దార్ వల్లాభాయ్ పటేల్కు బేగంపేట విమానాశ్రయం దగ్గ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఘనస్వాగతం పలికారు. అలా హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైంది.