ఒక్కరోజులో రూ.600 కోట్ల విలువైన ఈ-స్కూటర్లను విక్రయించినట్లు ఓలా ప్రకటించింది. బుధవారం వీటికి సంబంధించిన పర్చేజ్ విండోను ఓలా ఓపెన్ చేసింది. ప్రతి సెకనుకు నాలుగు స్కూటర్లను విక్రయించినట్లు ఓలా తెలిపింది. ఒకరోజులో అమ్ముడుపోయే మొత్తం ద్విచక్రవాహనాల కంటే ఇది ఎక్కువని, ఎలక్ట్రిక్ వాహనాల యుగం వచ్చేసిందని ఓలా ప్రకటనలో పేర్కొంది.


ఈ నెలలో జులైలో ప్రీ-బుకింగ్స్ ప్రారంభించిన 24 గంటల్లోనే లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయని, ప్రపంచంలోనే ఎక్కువ మంది ప్రీ-బుకింగ్ చేసుకున్న స్కూటర్ ఇదేనని కంపెనీ తెలిపింది. జులై 15వ తేదీన దీనికి సంబంధించిన రిజర్వేషన్లను కంపెనీ ఓపెన్ చేసింది. సరిగ్గా నెల తర్వాత ఓలా ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆగస్టు 15వ తేదీన లాంచ్ చేసింది.


దీన్ని కొనుగోలు చేయాలంటే మీరు ముందుగా మీకు కావాల్సిన కలర్, వేరియంట్‌ను ఎంచుకోవాలి. తర్వాత దీన్ని లోన్ ద్వారా కొనుగోలు చేస్తారో లేదా అడ్వాన్స్‌గానే నగదు చెల్లిస్తారో తెలపాలి. అనంతరం మీకు డెలివరీ డేట్ వస్తుంది. దీనికి సంబంధించిన డెలివరీలు అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నాయి.


వీటిలో ఓలా ఎస్1 ధరను రూ.99,999గా నిర్ణయించారు. ఎస్1 ప్రో మోడల్ ధర రూ.1,29,999గా ఉంది. ఇవి ఎక్స్-షోరూం ధరలే. వీటిపై పలు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీని కూడా అందించనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇది విప్లవాత్మకంగా నిలవనుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అద్భుతమైన వేగం, ఎక్కువ బూట్ స్పేస్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలతో వినియోగదారులు కొనుగోలు చేయాలనుకుంటున్న వాటిలో ఇది బెస్ట్‌గా నిలుస్తుంది.


ధర విషయంలో కాస్త అగ్రెసివ్‌గా ఉండటమే దీని సక్సెస్‌కు ప్రధాన కారణం అని ఓలా అభిప్రాయపడింది. మేడ్ ఇన్ ఇండియా ఫర్ ద వరల్డ్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ స్కూటర్ లాంచ్ అయింది. ప్రపంచంలోనే అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో లాంచ్ అయిన ఫ్యూచర్ ఫ్యాక్టరీలో దీన్ని రూపొందించనున్నారు.


ఓలా ఎస్1లో 2.98కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను, ఓలా ఎస్1 ప్రోలో 3.97కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అందించనున్నారు. ఓలా ఎస్1 పూర్తిగా చార్జ్ కావడానికి 4 గంటల 48 నిమిషాలు పట్టనుండగా, ఓలా ఎస్1 ప్రోకు 6 గంటల 30 నిమిషాలు పట్టనుంది. ఓలా ఎస్1 టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు కాగా, ఒక్కసారి చార్జ్ చేస్తే 121 కిలోమీటర్లు ట్రావెల్ చేయనుంది. ఓలా ఎస్1 ప్రో టాప్ స్పీడ్ గంటలకు 115 కిలోమీటర్లుగా ఉండగా, ఒక్కసారి చార్జ్ చేస్తే 181 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది.


Also Read: Affordable Cars: త‌క్కువ ధ‌ర‌లో కారు కొనాల‌నుకుంటున్నారా.. రూ.4 ల‌క్ష‌ల్లో టాప్-3 ఇవే!
Also Read: వావ్ అనిపించే లుక్ తో సూప‌ర్ ల‌గ్జ‌రీ కారు లాంచ్ చేసిన బీఎండ‌బ్ల్యూ.. ధ‌ర ఎంతంటే?
Also Read: Flipkart Big Billion Days 2021: వచ్చేస్తోంది బిగ్‌ బిలియన్‌ సేల్‌.. ఏ గ్యాడ్జెట్‌పై ఎంత డిస్కౌంట్‌ ఇస్తున్నారో తెలుసా!