దీపావళి పండుగకు మరికొన్ని రోజులే ఉంది. ఈ పండుగ వేళ సన్నిహితులు, బంధువులు, ప్రియమైనవారు బహుమతులు ఇవ్వడం, పొందడం కామన్! కొందరు నగదు రూపంలో ఇస్తే మరికొందరు స్థిరాస్తి , ట్రిప్‌లు, నగల రూపంలో ఇస్తుంటారు. పైగా కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్‌లు, క్యాష్ ఇన్సెంటివ్‌లు ఇస్తుంటాయి. వీటిలో వేటిపై పన్ను పడుతుంది? వేటికి మినహాయింపు ఉంటుంది? నిబంధనలు ఎలా ఉన్నాయో చూద్దాం!!
నిబంధనలు ఏంటి?
నగదు నుంచి వెండి, బంగారు నాణేల వరకు ఖరీదైన బహుతులపై పన్ను వర్తిస్తుంది. చాలామందికి గిఫ్టులపై టాక్స్ వేస్తారని తెలియదు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 56(2) ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకొనే గిఫ్టులపై పన్ను విధిస్తారు. ఇవి 'ఇతర వనరుల ద్వారా ఆదాయం' (Income from other sources) కిందకు వస్తుంది. పరిమితి మించి బహుమతి విలువ ఉంటే పన్ను వర్తిస్తుంది. చట్టానికి సంబంధించి ఎవరు ఇస్తున్నారో ముఖ్యం కాదు. ఎవరు తీసుకుంటున్నారన్నదే ముఖ్యం.
వీటిపై పన్ను వేస్తారు?
ఒక సంవత్సరంలో ఎవరైనా ఎన్నైనా బహుమతులు అందుకోవచ్చు. కానీ వాటి మొత్తం విలువ రూ.50వేలు దాటకూడదు. ఆ లోపు విలువ ఎంతున్నా పన్ను వర్తించదు. ఒకవేళ ఆ యాభైవేలపై ఒక్క రూపాయి ఎక్కువైనా పన్ను భారం తప్పదు. అయితే ఇక్కడొక నిబంధన కీలకంగా మారుతుంది. బహుమతిని పొందిన వ్యక్తి తన పద్దు పుస్తకాల్లో దానికి 'బహుమతిగా పొందాను' అని చూపించాలి.
ఒకవేళ ఇష్టానిష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా స్థిరాస్తిని పొందితే.. స్టాంప్ డ్యూటీపై పన్ను వర్తిస్తుంది. ఇక నగలు, షేర్లను బహుమతిగా పొందితే మార్కెట్ విలువపై పన్ను విధిస్తారు.
మినహాయింపులు ఉన్నాయా?
అత్యంత సన్నిహితులు, రక్త సంబంధీకుల నుంచి బహుమతి పొందితే అది పన్ను పరిధిలోకి రాదు. జీవిత భాగస్వామి, సోదరుడు, సోదరి, తల్లిదండ్రులు, అత్తమామలు, జీవితభాగస్వామి సోదరి, సోదరుడు, వారసత్వంగా వచ్చిన బహుమతులపై పన్ను వర్తించదు. సమయం, సందర్భం, గిఫ్ట్ నేచర్‌తో సంబంధం లేదు. అయితే స్నేహితుల నుంచి పొందే బహుమతులపై మాత్రం మినహాయింపు ఉండదు.
మరి ప్రొఫెషనల్ గిఫ్టులపై?
ఇక దీపావళి వంటి పండుగల సమయంలో ఉద్యోగులకు కార్పొరేట్ కంపెనీలు బహుమతులు ఇస్తుంటాయి. కారు లేదా విదేశాల్లో పర్యటన, కొన్నిసార్లు స్థిరాస్తి వంటివి ఇస్తాయి. ఇవన్నీ ఉద్యోగుల సంక్షేమం కొందకు వస్తాయి కాబట్టి పన్ను పరిధిలోకి రావు. ఇక కస్టమర్లకు బహుమతులు ఇస్తే అవి సేల్స్ ప్రమోషన్ కిందకు వస్తాయి. వాటిపైనా టాక్స్ ఉండదు. కానీ.. వీటిని గిఫ్టులుగా భావించి పద్దు పుస్తకాల్లో రాస్తే మాత్రం రూ.50వేల విలువను మించితే పన్ను భారం తప్పదు.
Also Read: Diwali Bank Offers: కస్టమర్లకు ఆఫర్లే ఆఫర్లు! దీపావళికి ఏ బ్యాంకు ఏ ఆఫర్ ఇస్తోందో తెలుసా?
Also Read: Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్!