మరికొద్ది రోజుల్లో దీపావళి.. ఈ పండుగ శుభవేళ కస్టమర్లను ఆకట్టుకునేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. వివిధ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీరేటును తగ్గించాయి. ఇప్పుడు డెబిట్‌, క్రెడిట్‌ కార్డు లావాదేవీలు, కారు, ఇతర రుణాలపై మరికొన్ని ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రైవేటుతో ప్రభుత్వ రంగ బ్యాంకులూ పోటీ పడుతున్నాయి. ఇంతకీ ఏ బ్యాంకు ఎలాంటి ఆఫర్లు ప్రకటించిందో చూద్దాం!!


ఎస్‌బీఐ (State Bank of India)
ఈ దీపావళికి యోనో యాప్‌ ద్వారా ఎవరైనా కస్టమర్‌ కారు లోన్‌ తీసుకుంటే వారికి వడ్డీరేటులో 0.5 శాతం వరకు రాయితీ ఇస్తోంది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. పైగా ప్రాసెసింగ్‌ ఫీజూ రద్దు చేసింది. సాధారణంగా ఎస్‌బీఐ కారు లోన్‌కు వడ్డీ రేటు 7.25 నుంచి 8.75 శాతం మధ్య ఉంటుంది. ఇప్పుడు వడ్డీ కోతతో పాటు సత్వరమే రుణాన్ని మంజూరు చేస్తోంది. ఇంకా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో కొనుగోలు చేస్తే రూ.2500 వరకు క్యాష్‌ బ్యాక్‌ ఇస్తోంది. ఇప్పటికే ఇంటి రుణంపై ఎలాంటి ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా 6.7 శాతం వడ్డీకే ఇస్తున్న సంగతి తెలిసిందే.


బీవోఐ (Bank Of India)
ఆఫర్లలో ఎస్‌బీఐతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పోటీ  పడుతోంది. గృహ రుణాల వడ్డీపై 35 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. వాహణ రుణాలపై వడ్డీరేటును 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. ఒకప్పుడు గృహరుణాలపై వడ్డీ 6.85 శాతం, వాహన రుణాలపై 7.35 శాతం ఉండగా ఇప్పుడు 6.50 శాతం, 6.85 శాతంగా ఉన్నాయి.  కొత్త రుణాలు, బదిలీ చేసుకుంటున్న రుణాలపై 2021 అక్టోబర్‌ 18 నుంచి డిసెంబర్‌ 31 వరకే ఆ ప్రత్యేక ఆఫర్‌ ఉంటుంది. 2022 వరకు ప్రాసెసింగ్‌ ఫీజును రద్దు చేసింది.


బీవోబీ (Bank of Baroda)
బరోడా బ్యాంకు ఇంటి రుణాలపై వడ్డీ రేటును తగ్గించింది. ఇంతకు ముందు 7 శాతంగా ఉన్న వడ్డీ రేటును 6.5 శాతానికి తగ్గించింది. ఇంటి, వాహన రుణాలపై ప్రాసెసింగ్‌ ఫీజును రద్దు చేసింది.


యాక్సిస్‌ బ్యాంక్‌ (Axis Bank)
పండుగ సందర్భంగా ఎంపిక చేసిన గృహ రుణ సాధనాలపై యాక్సిస్‌ బ్యాంకు 12 ఈఎంఐలను రద్దు చేసింది. ద్విచక్ర వాహనాలపై ప్రాసెసింగ్‌ ఫీజు తీసేసింది. ఇక దేశవ్యాప్తంగా 50 నగరాల్లో 2500కు పైగా స్థానిక స్టోర్లతో యాక్సిస్‌ ఒప్పందం చేసుకుంది. ఇక్కడ కొనుగోలు చేసిన కస్టమర్లకు 20 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో కొంటే అదనంగా మరో పదిశాతం డిస్కౌంట్‌ వస్తుంది.


ఐసీఐసీఐ (ICICI Bank)
ఐసీఐసీఐ బ్యాంకు 'ఫెస్టివ్‌ బొనాంజా' ప్రకటించింది. చాలా ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు ఇస్తోంది. అమెజాన్‌, మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌, జియోమార్ట్‌, రిలియన్స్‌ డిజిటల్‌ సహా ఇతర ఈ-కామర్స్‌ వేదికల్లో కొనుగోలు చేస్తే 20 శాతం క్యాష్‌ బ్యాకుతో పాటు డిస్కౌంట్‌ అందిస్తోంది. ఇంకా గృహ రుణాలు, కారు లోన్లు, ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాలపై వడ్డీ రేట్లను తగ్గించింది.


హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank)
దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు బ్యాంకైన హెచ్‌డీఎఫ్‌సీ 100 ప్రాంతాల్లో పదివేలకు పైగా మర్చంట్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీపావళి సమయంలో అవసరమైన వస్తువుల కొనుగోలుపై డిస్కౌంట్లు ఇస్తోంది. ప్రీమియం మొబైల్‌ ఫోన్లు, ఇతర వస్తువులపై నోకాస్ట్‌ ఈఎంఐ, క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులతో అమెజాన్‌లో కొనుగోలు చేసే ఎలక్ట్రానిక్స్‌, కన్జూమర్‌ గూడ్స్‌పై 22.5 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌, నోకాస్ట్‌ ఈఎంఐ సౌకర్యాలు కల్పించింది. వ్యక్తిగత రుణాలను 10.25% వడ్డీరేటుకు ఇస్తోంది. కారు లోన్‌ను 7.50శాతం వడ్డీ, ద్విచక్ర వాహనాలకు 4 శాతం కన్నా తక్కువ వడ్డీకి ఇస్తోంది.


Also Read: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం


Also Read: దేశంలోనే ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్‌.. ఫస్ట్ ర్యాంక్ ఆ నగరానికే!


Also Read: మోడీ ప్రభుత్వం అందిస్తున్న ఈ 5 పథకాల గురించి మీకు తెలుసా? వాటి ప్రయోజనాలు తెలుసుకోండి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి