జీవితంలో అనిశ్చితి సహజం! ఆస్తులు ఉన్నప్పటికీ కొన్నిసార్లు నగదు లభ్యత కొరవడుతుంది. అర్జెంట్‌గా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. వ్యక్తులను అడుగుదామంటే వారి వద్దా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు సురక్షితమైన రుణ సాధనాలను ఎంచుకుంటే మంచిదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
బంగారమే బంగారం!
కరోనా సంక్షోభం ఎదురైనప్పుడు చాలామందిని ఆదుకున్నది బంగారమే! అందుకే డబ్బులు అత్యవసరమైనప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవడం బెటరని ఆర్థిక నిపుణుల అభిప్రాయం. సరైన ఉద్యోగం, క్రెడిట్ స్కోర్ లేనప్పుడు గోల్డ్ లోన్ ద్వారా సులభంగా డబ్బు పొందొచ్చు. ఇది సురక్షితమైన రుణ సాధనం కాబట్టి పర్సనల్ లోన్ కన్నా తక్కువ వడ్డీనే ఉంటుంది.
సాధారణంగా గోల్డ్ లోన్లను స్వల్ప, మధ్యకాలానికి తీసుకుంటారు. అంటే ఏడాది లేదా రెండేళ్ల కాలపరిమితికే ప్రాధాన్యం ఇస్తారు. కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ రోజులు తీసుకోవచ్చు. ఆర్‌బీఐ తాజా మార్గనిర్దేశాల ప్రకారం ఇప్పుడు బంగారం విలువలో 90 శాతం వరకు రుణం పొందొచ్చు. కరోనా లాక్‌డౌన్‌లో ఇది 75 శాతం వరకే ఉండేది.
గోల్డ్ లోన్ వల్ల మరో ఉపయోగం ఏంటంటే ఫ్లెక్సిబుల్ రీపేమెంట్ సౌకర్యం. ఎక్కువగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈఎంఐ, గోల్డ్ లోన్‌పై ఓవర్‌డ్రాఫ్ట్ పద్ధతిని అనుసరిస్తున్నాయి. కొన్ని సంస్థలైతే ఈఎంఐలతో పనిలేకుండా ఏడాది చివర్లో వడ్డీ కట్టించుకొని మరో ఏడాదికి రుణాన్ని రెనివల్ చేస్తున్నాయి. గోల్డ్ లోన్లపై వడ్డీ రేట్లు సంస్థలను బట్టి 7 నుంచి 12 శాతం వరకు ఉంటున్నాయి.
ప్రాపర్టీపై లోన్
బంగారం తర్వాత ఎక్కువ తీసుకొనేది రియల్ ఎస్టేట్‌పై రుణాలే. ప్రాపర్టీని తనఖా పెట్టినప్పుడు మార్కెట్ విలువలో 70 శాతం వరకు రుణం పొందొచ్చు. ఇక రీపేమెంట్ కాల పరిమితి 15-20 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ తరహా అప్పులపై వడ్డీ రేటు 8 నుంచి 15 శాతం మధ్య ఉంటుంది.
సెక్యూరిటీలపై రుణాలు
బాండ్లు, షేర్లు, ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్లు, ఎన్‌ఎస్‌సీ, జీవిత బీమా పాలసీలు, కేవీపీ వంటి సెక్యూరిటీ సాధనాలపై బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలు ఇస్తాయి. వీటిని తనఖా పెట్టినా అప్పు తీసుకున్నవారికి వాటిపై రాబడి వస్తూనే ఉంటుంది. పెట్టిన సెక్యూరిటీల్లో నష్టభయాన్ని అనుసరించి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇస్తారు.
సెక్యూరిటీల విలువలో 50 శాతానికి మించి రుణం ఇవ్వరు. మ్యూచువల్ ఫండ్లను కొలాట్రల్‌గా పెడితే ఇంకా ఎక్కువ ఆలోచిస్తారు. అందుకే రూ.5 లక్షలు కావాలంటే రూ.10 లక్షల విలువైన షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్లు తనఖా పెట్టాలి. ఎన్‌ఎస్‌సీ, కేవీపీ, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు వంటి డెట్ ఇన్స్ట్రుమెంట్లపై 70 శాతం వరకు ఇస్తారు. ఇక జీవిత బీమా, డెట్ ఫండ్ యూనిట్లపై 80 శాతం వరకు లోన్ ఇస్తారు. సెక్యూరిటీ లోన్లపై ఎస్‌బీఐ 9.25 నుంచి 11.90 వరకు వడ్డీ రేటు అమలు చేస్తోంది.
Also Read: కస్టమర్లకు ఆఫర్లే ఆఫర్లు! దీపావళికి ఏ బ్యాంకు ఏ ఆఫర్ ఇస్తోందో తెలుసా?
Also Read: DA Hike: కేంద్ర ఉద్యోగులకు తీపికబురు! డీఏ, డీఆర్ పెంపునకు ప్రభుత్వ ఆమోదం
Also Read: Top 10 Richest Cities 2021: దేశంలోనే ధనిక నగరాల జాబితాలో హైదరాబాద్.. ఫస్ట్ ర్యాంక్ ఆ నగరానికే!