రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అదరగొట్టింది. రెండో త్రైమాసిక ఫలితాల్లో భారీ లాభాలు నమోదు చేసింది. 46 శాతం వృద్ధితో నికర లాభం రూ.15,479 కోట్లు ఆర్జించింది. కొవిడ్‌ ముందు నాటికి చమురు, రసాయనాలకు గిరాకీ పెరగడంతో రాబడి 49 శాతం పెరిగి ఆదాయం రూ.1,91,532 కోట్లకు చేరుకుంది.


ఓ2సీ బిజినెస్‌ 58 శాతం వృద్ధి చెందడంతో ఆదాయం పెరిగింది. రూ.1,20,475 కోట్ల టర్నోవర్‌ చేసింది. దాంతో పన్నులు, వడ్డీలు చెల్లించక ముందు రూ.12,720 కోట్లు లాభం పొందింది. చమురు ధర పెరగడం, ఇతర ఉత్పత్తుల ధరల వల్ల ఈ సెగ్మెంట్లో లాభాల పంట పండింది.ఇక జియో, సంబంధిత వ్యాపారాలు నికర లాభానికి రూ.3,728 కోట్లు జత చేశాయి. రిలయన్స్‌ రిటైల్‌ రూ.1675 కోట్ల నికర లాభం నమోదు చేసింది.


జియో ప్లాట్‌ఫామ్స్‌ స్థూల రాబడి రూ.23,222 కోట్లుగా ఉంది. గతంతో పోలిస్తే 15.2 శాతం వృద్ధి నమోదైంది. ఈ క్వార్టర్లో జియో ఏఆర్‌పీయూ ఒక నెలకు ఒక కస్టమర్‌కు రూ.143.6గా ఉంది. గత క్వార్టర్‌తో పోలిస్తే 3.7 శాతం పెరగడం గమనార్హం. 2021, సెప్టెంబర్‌ 30కి జియో కస్టమర్లు 42.95 కోట్లుగా ఉన్నారు. ఏటా 2.38 కోట్ల మంది పెరుగుతున్నారు. దీపావళికి గూగుల్‌తో కలిసి జియోఫోన్‌ నెక్ట్స్‌ను కంపెనీ విడుదల చేయనుంది.


2021, సెప్టెంబర్ 30 నాటికి రిలయన్స్‌ చెల్లించాల్సిన రుణాల మొత్తం రూ.2,55,891 కోట్లుగా ఉంటే నగదు, ఆస్తుల విలువ రూ.2,59,476 కోట్లుగా ఉంది. అంటే రిలయన్స్‌ రుణ రహిత కంపెనీగా ఉందన్నమాట. ఫలితాలు విడుదల చేసిన తర్వాత రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మీడియాతో మాట్లాడారు.


'కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ 2022 ఆర్థిక ఏడాది రెండో క్వార్టర్లో రిలయన్స్‌ ఫలితాలు ఆనందం కలిగించాయి. మా వ్యాపార బలాన్ని, భారత, అంతర్జాతీయ మార్కెట్ల రికవరీని ఇది సూచిస్తోంది. మా వ్యాపారాలన్నీ కొవిడ్‌ ముందునాటి స్థితికి చేరుకున్నాయి. రిటైల్‌ సెగ్మెంట్‌, ఓ2సీ, డిజిటల్‌ సర్వీసెస్‌లో వృద్ధి నమోదైంది. చమురుకు గిరాకీ పెరగడంతో ఓ2సీ బిజినెస్‌ రికవరీ అయింది. ఫిజికల్‌ స్టోర్లు, డిజిటల్‌ ఆఫర్ల పెరుగుదలతో రిలయన్స్‌ రిటైల్‌ గ్రోత్‌ కనబరిచింది. ఇక మా డిజిటల్‌ సేవల రంగం సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తోంది' అని ముకేశ్ అంబానీ అన్నారు.


Also Read: భారీ ఐపీవోకు ముందు పేటీఎం కీలక నిర్ణయం.. ఏంటో తెలుసా?


Also Read: కస్టమర్లకు ఆఫర్లే ఆఫర్లు! దీపావళికి ఏ బ్యాంకు ఏ ఆఫర్‌ ఇస్తోందో తెలుసా?


Also Read: కేంద్ర ఉద్యోగులకు తీపికబురు! డీఏ, డీఆర్‌ పెంపునకు ప్రభుత్వ ఆమోదం


Also Read: కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. మరో 6 నెలలపాటు పాలసీ కొనసాగిస్తూ కీలక నిర్ణయం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి