డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్‌ను మరోసారి దురదృష్టం వెంటాడింది! ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచులో వరుసగా రెండో మ్యాచులోనూ ఓటమి పాలైంది. ఆ జట్టు నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా సునాయాసంగా ఛేదించింది. అయిడెన్ మార్‌క్రమ్ (51*: 26 బంతుల్లో 2x4, 4x6) దుమ్మురేపాడు. అతడికి రసివాన్‌డర్ డుసెన్ (43*: 51 బంతుల్లో 3x4, 0x6) తోడుగా నిలిచాడు. అంతకు ముందు వెస్టిండీస్‌లో ఓపెనర్ ఎవిన్ లూయిస్ (56; 35 బంతుల్లో 3x4, 6x6), కీరన్ పొలార్డ్ (26; 20 బంతుల్లో 2x4,1x6) రాణించారు
మార్‌క్రమ్ దంచేశాడు
ఛేదించాల్సిన లక్ష్యం తక్కువగానే ఉండటం, డ్యూ ఫ్యాక్టర్ లేకపోవడంతో దక్షిణాఫ్రికా ఛేదన సులభంగానే సాగింది. ఓపెనర్ తెంబా బవుమా (2) మరోసారి విఫలమయ్యాడు. డుసెన్ సహకారంతో హెండ్రిక్స్ (39) రాణించాడు. రెండో వికెట్‌కు 57 పరుగుల కీలక భాగస్వామ్యం అందించాడు. వీరిద్దరూ వెస్టిండీస్ బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నారు. కుదిరినప్పుడల్లా బౌండరీలు బాదేశాడు. జట్టు స్కోరు 61 వద్ద అతడిని హొసెన్ ఔట్ చేసినా సఫారీలు భయపడలేదు. పైగా మార్‌క్రమ్ వచ్చాక వేగం పెరిగింది. అతడు సిక్సర్లు, బౌండరీలతోనే డీల్ చేశాడు. మూడో వికెట్‌కు 54 బంతుల్లోనే 83 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించి గెలుపు బావుటా ఎగరేశాడు.
లూయిస్ ఒక్కడే
ఈ పోరులో సఫారీలనే టాస్ వరించడంతో కరీబియన్లను మొదట బ్యాటింగ్‌కు పంపించారు. గత మ్యాచు చెత్త ప్రదర్శనను దృష్టిలో పెట్టుకున్న విండీస్ ఈసారి జాగ్రత్తగా ఆడింది. అనవసర షాట్లు ఆడకుండా ఓపెనర్లు లూయిస్, సిమన్స్ (16: 35 బంతుల్లో) ఓపిక పట్టారు. పది ఓవర్ల వరకు వికెట్టే ఇవ్వలేదు. దాంతో 73 పరుగుల భాగస్వామ్యం లభించింది. కుదురుకున్నాక లూయిస్ సిక్సర్లు, బౌండరీలతో రెచ్చిపోయాడు. 10.3వ బంతికి అతడిని మహరాజ్ ఔట్ చేశాక విండీస్ వరుసగా వికెట్లు చేజార్చుకుంది. కాసేపు పొలార్డ్ అలరించినా.. ఆఖర్లో సఫారీలు కట్టుదిట్టంగా బంతులేసి కరీబియన్లను 143కే పరిమితం చేశారు.
Also Read: T20 WC, SA vs WI preview: ఓడిన జట్ల పట్టుదల..! కరీబియన్లపై సఫారీల పోరులో విజయం ఎవరిదో?
Also Read: Hardik Pandya Health: హార్దిక్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది.. న్యూజిలాండ్ మ్యాచ్ ఆడగలడా? లేదా?
Also Read: IPL New Teams: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే.. చేజిక్కించుకున్న కంపెనీలు ఏవంటే?
Also Read: Ind Vs Pak: పాక్ పైచేయి సాధించింది అక్కడే.. కాస్త జాగ్రత్త పడి ఉంటే?