ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లకు సంబంధించిన బిడ్డింగ్ ప్రాసెస్ ముగిసింది. అహ్మదాబాద్, లక్నో నగరాల నుంచి ఐపీఎల్‌లో కొత్త జట్లు బరిలోకి దిగనున్నాయి. వీటిలో అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్, లక్నో జట్టును ఆర్పీఎస్‌జీ దక్కించుకున్నాయి. సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ లక్నో ఫ్రాంచైజీని రూ.7,090 కోట్లకు దక్కించుకోగా, సీవీసీ క్యాపిటల్ పార్ట్‌నర్స్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ.5,166 కోట్లకు చేజిక్కించుకుంది. మొత్తం 22 కంపెనీలు రూ.10 లక్షల విలువైన టెండర్ డాక్యుమెంట్‌ను దక్కించుకున్నాయి. అయితే వీటిలో కేవలం 10 కంపెనీలు మాత్రమే సీరియస్‌గా బిడ్డింగ్‌కు దిగాయి.


ప్రముఖ ఫుట్‌బాల్ ఫ్రాంచైజీ మాంచెస్టర్ యునైటెడ్ యజమానులు కూడా ఐపీఎల్‌లో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి చూపించారు. అందుకేనేమో కొత్త ఐపీఎల్ టీంలకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించడానికి చివరి తేదీని అక్టోబర్ 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బీసీసీఐ పొడిగించింది.


ఐపీఎల్ 2022లో మొత్తం 10 జట్లు పోటీపడనున్నాయి. దీంతో కాంపిటీషన్ మరింత తీవ్రతరం కానుంది. అహ్మదాబాద్, లక్నో, ఇండోర్, గువాహటి, పుణే, ధర్మశాల, కటక్ నగరాలు కొత్త ఐపీఎల్ జట్ల కోసం పోటీ పడగా.. అహ్మదాబాద్, లక్నో నగరాలకు ఆ అవకాశం దక్కింది.


ఒక ఐపీఎల్ జట్టును దక్కించుకోవడానికి రూ.2,000 కోట్లు లేదా ఆ పైన మొత్తాన్ని బిడ్డింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే రూ.2 వేల కోట్ల కంటే తక్కువ మొత్తాన్ని బిడ్ చేయకూడదన్న మాట. బిడ్డింగ్‌కు మినిమం మొత్తం ఇదే. మనదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏ కంపెనీ అయినా(అది విదేశీ కంపెనీ అయినా సరే) బిడ్డింగ్ చేయవచ్చు. అయితే ఆ కంపెనీ వార్షిక టర్నోవర్ కనీసం రూ.3,000 కోట్లు అయి ఉండాలి.


అయితే మూడు కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడి కూడా ఈ బిడ్డింగ్ చేయవచ్చు. అలాంటి సందర్భంలో ప్రతి కంపెనీకి రూ.2,500 కోట్ల వార్షిక నెట్ వర్త్ ఉండాల్సిందే. మొత్తం 22 కంపెనీలు ఈ బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. అదానీ గ్రూప్, ఆర్పీ సంజీవ్ గోయెంకా, కోటక్, టోరంట్ ఫార్మా, అరబిందో ఫార్మా, లాన్సర్ క్యాపిటల్, నవీన్ జిందాల్, హిందూస్తాన్ టైమ్స్ మీడియా గ్రూప్ వంటి కంపెనీలు ఈ బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి.


ఈ బిడ్డింగ్‌లో బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకోనే, రణ్‌వీర్ సింగ్ కూడా కన్సార్షియం ద్వారా పాల్గొంటారని వార్తలు వచ్చాయి. అయితే బిడ్డింగ్‌లో మాత్రం వారి పేర్లు వినిపించలేదు. వారు కొత్త ఫ్రాంచైజీలకు మైనారిటీ స్టేక్ హోల్డర్లు లేదా బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండే అవకాశం ఉంది.






Also Read: నలుగురు కెప్టెన్లు.. నానా చర్చలు.. 18 ఓవర్‌ ముందు యాంటీ క్లైమాక్స్‌! 'నా మాటే శాసనం' అని ఎవరన్నారో?


Also Read: పాక్‌ విజయానికి 'పంచ సూత్రాలు'.. కోహ్లీసేన పరాభవానికి కారణాలు! మిస్టేక్ అయింది ఇక్కడే..!


Also Read: India Vs Pakistan: నిన్న వెస్టిండీస్.. నేడు టీమిండియా.. ‘6’ సెంటిమెంట్ వెక్కిరించిందా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి