సొంత ఇల్లు.. సగటు భారతీయుడి కల! దాదాపుగా ప్రతి ఒక్కరి జీవితంలోని అతి పెద్ద నిర్ణయాల్లో ఇదీ ఒకటి. చాలామంది తమ తొలి ఇంటిని కొనుగోలు చేసేందుకు బ్యాంకు రుణాన్నే నమ్ముకుంటారు. డౌన్ పేమెంట్ కోసం దాచుకున్న సొమ్మునంతా ఉపయోగిస్తారు. అయితే ఇదే వారి ఆర్థిక పరిస్థితులను తలకిందులు చేయగలదు! ఇల్లు కొనుగోలు చేసేముందు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా అంశాలను పరిణనలోకి తీసుకోవాలి. అందుకే ప్రాపర్టీపై పెట్టుబడి పెట్టేటప్పుడు ఆర్థికంగా నష్టపోకుండా చూసుకోవాలి.
అసలు విలువ తెలుసుకోకపోవడం
ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు చాలామంది చేసే మొదటి పొరపాటు ఒకటుంది. ప్రకటనలో ఇచ్చిందే తుదిరేటుగా భావిస్తారు. ఈ ఫైనల్ రేట్‌లో కొన్ని ఖర్చులు కలిసే ఉండొచ్చు. రుణం తీసుకొని కొంటే అందులో ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఖర్చులు, లీగల్ ఫీజు, వాల్యుయేషన్ ఫీజు, ఎంవోడీ రుసుము ఉంటాయి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజూ చెల్లించాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ కోసం బిల్డర్ వార్షిక రుసుము తీసుకోవచ్చు. ఇవన్నీ కలిసి పెద్ద మొత్తమే అవుతుంది. దాంతో డీల్ కుదరక మీ సొంతింటి కల మరింత ఆలస్యం కావచ్చు. లేదా నెరవేరకపోవచ్చు!
లోన్ ఎలిజిబులిటీ తెలుసుకోకపోవడం
ఇంకొంత మంది బ్యాంకు రుణానికి అర్హత ఉందో లేదో తెలుసుకోకుండానే ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేస్తుంటారు. ఉదాహరణకు కోటి రూపాయాల ఇంటికి మీరు 20 శాతం డౌన్ పేమెంట్ ఇచ్చారనుకుందాం. మిగతా 20 శాతం బ్యాంకు ఇస్తుందని అనుకున్నారు. అయితే బ్యాంకు మీ ఆర్థిక స్థోమత, రీపేమెంట్ సామర్థ్యం పరిశీలించి రూ.60 లక్షలే ఆమోదించింది. అంటే మరో 20 లక్షలు తగ్గుతాయి. ఇది బయట నుంచి సర్దుకోవాల్సి వస్తుంది. అందుకే ముందే బ్యాంకును సంప్రదిస్తే మేలు.
క్రెడిట్ లిమిట్‌ను మించి..
ఎక్కువ రుణానికి అర్హత ఉందని తెలియగానే చాలామంది ఎగిరిగంతేస్తుంటారు. తమ క్రెడిట్ లిమిట్‌ను మించి ఇంటిని కొంటారు. ఉదాహరణకు మీ క్రెడిట్ లిమిట్ రూ.30వేలు అనుకుంటే నెలకు రూ.30వేల ఈఎంఐ కట్టేంత లోన్ తీసుకుంటే ఇబ్బంది పడతారు. అదనపు కొనుగోలు శక్తిని కోల్పోవడంతో మున్ముందు లోన్ అవసరమైనప్పుడు ఇబ్బంది పడతారు. అందుకే లోన్ సామర్థ్యం కన్నా కాస్త తక్కువగానే తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఉండవు.
అనవసర సౌకర్యాలు ఎంచుకోవడం
సూపర్ బిల్టప్ ఏరియాలో.. కార్పెట్ ఏరియా, గోడ నిర్మాణం, టెరాస్, బాల్కనీలు, లిఫ్ట్, స్టెయిర్స్, జిమ్, క్లబ్‌హజ్, స్విమ్మింగ్ పూల్, పార్క్ వంటి కామన్ ఏరియాలు ఉంటాయని తెలుసా? ఎక్కువ సౌకర్యాలను కోరుకుంటే ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. చాలామంది స్విమ్మింగ్ ఫూల్, జిమ్ అవసరం ఉండకపోవచ్చు. నిరంతరం విద్యుత్ బ్యాకప్, నీరు, కమ్యూనిటీ హాల్ వంటి అత్యవసరమైన సౌకర్యాలు మాత్రమే ఎంచుకొని ఇల్లు కొనుగోలు చేసుకుంటే కాస్త తక్కువకే ఇల్లు సొంతం చేసుకోవచ్చు.
మున్ముందు ఖర్చులు అంచనా వేయకపోవడం
ఇల్లు కొనగానే ఈఎంఐలు మాత్రం కట్టుకుంటే సరిపోదు. భవిష్యత్తులో కొన్ని ఫిక్స్‌డ్, వేరియబుల్ ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. నీరు, గ్యాస్ కనెక్షన్ ఛార్జీలు ఉంటాయి. ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాలు, దొంగతనాల నుంచి రక్షణగా బీమా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటీరియర్స్‌కు ఖర్చులు ఉంటాయి. అంటే హోమ్‌లోన్ ఈఎంఐకి మించి ఖర్చులు ఉంటాయి.
Also Read: Maruti Celerio 2021: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!
Also Read: Financial Tips: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!
Also Read: LIC Jeevan Labh Policy: నెలకు రూ.233 చెల్లిస్తే రూ.17 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవే!