మనం కోరుకున్న లక్ష్యం సిద్ధించాలంటే కేవలం కోరిక, పట్టుదల ఉంటే సరిపోదు. సరైన అలవాట్లు అవసరం. ఎందుకంటే అలవాట్లే మనుషులను రూపొందిస్తాయి. వారెన్‌ బఫెట్‌ సంపద సృష్టించినా.. కొందరు తక్కువ జీతాలతోనే ఎక్కువ సేవింగ్స్‌ చేస్తున్నా.. డబ్బు సంపాదనలో విజయం సాధిస్తున్నా అలవాట్లే కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆర్థికంగా స్థిరత్వం సాధించేందుకు, లాభాలు గడించేందుకు మంచి ఆర్థిక అలవాట్లు అవసరం.


బడ్జెటింగ్‌ అలవాటు
ప్రతి వ్యక్తి అన్నిటికన్నా ముందుగా నేర్చుకోవాల్సిన అలవాటు 'బడ్జెటింగ్‌'. మన ఇంటి అవసరాలు ఏంటో? దేనికి ఎంత ఖర్చవుతుందో? కచ్చితంగా తెలియాలి. నెలవారీ, క్వార్టర్‌, హాఫ్‌ ఇయర్లీ, ఇయర్లీ బడ్జెట్‌ వేసుకోవడం ముఖ్యం. చేతికందిన జీతం మొత్తం ఖర్చు చేస్తుంటే ఆదా చేసేందుకు ఏమీ మిగలదు. అందుకే ఇంటి ఖర్చులు, పెట్టుబడులు, సేవింగ్స్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే పొదుపుగా ఖర్చు చేసుకోవచ్చు.


పెట్టుబడులపై అవగాహన
మీ కుటుంబ అత్యవసర నిధి, ఆరోగ్య బీమా, జీవిత బీమా ఏర్పాటు చేసుకున్నా పెట్టుబడులపై అవగాహన పెంచుకోవాలి. సంపాదించిన డబ్బు కేవలం బ్యాంకుల్లో దాచుకుంటే వచ్చేదేమీ ఉండదు. మీవద్ద ఉన్న డబ్బును అలాగే ఐడిల్‌గా ఉంచకూడదు. ఆ సొమ్మును పనిచేయించాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌, స్టాక్‌ మార్కెట్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి పెట్టాలి. ముందు నష్టభయం తెలుసుకోవాలి.


అప్పులకు దూరంగా
వీలైనంత వరకు అప్పులు చేయకపోవడం ఉత్తమమైన అలవాటు. కానీ కొన్నిసార్లు అప్పు చేయక తప్పని పరిస్థితులు తలెత్తుతాయి. అలాంటప్పుడు మంచి అవసరాలకు రుణాలు తీసుకోవాలి. అంటే స్టార్టప్‌ మొదలు పెట్టేందుకు బిజినెస్‌ లోన్‌, చదువుకొనేందుకు ఎడ్యుకేషన్‌ లోన్‌ వంటివి మంచి రుణాలు. ఇంట్లో విలాసవంతమైన వస్తువులు, ఊరికే ఖర్చు చేసేందుకు తీసుకొనే క్రెడిట్‌ కార్డు లోన్లు చెడ్డ రుణాల కిందకు వస్తాయి.


దాచిన తర్వాతే ఖర్చులు
చాలామంది చేసే పొరపాటు ఒకటుంది. అదే సంపాదన చేతికి అందగానే ఖర్చు చేయడం. ఆ తర్వాత మిగిలింది దాచుకోవడం. ఇదో చెడ్డ అలవాటు. మీరు సంపద సృష్టించాలంటే, ఆస్తులు కూడబెట్టాలంటే మొదట చేయాల్సింది జీతం అందగానే మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా దాచుకోవడం. ఆ తర్వాత మిగిలిందే ఖర్చు చేసుకోవాలి. ఈ విషయం తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు.


నాణ్యమైనవే కొనండి
సంపద సృష్టించాలన్నా, ఆర్థికంగా ఎదగాలంటే ఖర్చులేమీ చేయకూడదని, విలువైన వస్తువులు కొనకూడదని అనుకుంటారు. అలా చేయాల్సిన అవసరం లేదు. మీ సంపదను వృద్ధి చేసే అవసరాల కోసం ఎంతైనా ఖర్చు చేయొచ్చు. ఉదాహరణకు మీ స్టార్టప్‌కు ఓ వెబ్‌సైట్‌ అవసరం అనుకుందాం. నాణ్యమైన వెబ్‌సైట్‌ రూపొందించేందుకు కాస్త ఎక్కువే అవసరమైతే ఖర్చు చేయొచ్చు. మీ వ్యాపార ఉత్పత్తులు తరలించేందుకు ఓ వాహనం కొంటే అది ఖర్చు కిందకు రాదు. పెట్టుబడిగానే భావించాలి.


'నో' చెప్పడం నేర్చుకోండి
ఇక 'నో' చెప్పడం నేర్చుకోవడం ఓ మంచి అలవాటు! మీ పిల్లలకూ ఇది నేర్పించండి. ఉదాహరణకు ఓ వీకెండ్‌లో భారీ పార్టీ చేసుకొని ఎంజాయ్‌ చేద్దామంటే మోహమాటం లేకుండా నో చెప్పేయండి. పార్టీల వల్ల ఖర్చు తప్పితే లాభమేమీ ఉండదు. పైగా మీ విలువైన సమయమూ వృథా అవుతుంది. మీ లక్ష్యాలకు మీ స్నేహితులు అడ్డుపడితే, ఈ రెండు రోజుల్లో కోట్లు నష్టపోతాడని ఆటపట్టిస్తుంటే వారికి సారీ చెప్పేసి తప్పించుకోండి.


Also Read: Godrej Group Split: గోద్రేజ్‌ గ్రూప్‌ విభజన: రెండుగా విభజించేందుకు సోదరుల కసరత్తు!!


Also Read: Dhanteras 2021: ఈ దంతేరాస్‌కి గోల్డ్ కాయిన్ రూ.1 కే కొనొచ్చు.. ఎలాగో తెలుసా, చాలా సింపుల్


Also Read: Aadhar Card Updates: ఆధార్‌ మిస్‌యూజ్‌ అవుతోందని డౌటా? ఫోన్‌కు ఓటీపీ రావడం లేదా? ఇలా తెలుసుకోండి!


Also Read: EPF Interest: కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం.. ఈపీఎఫ్ ఖాతాల్లోకి నగదు జమ అయ్యేది ఎప్పుడంటే..!


Also Read: JioPhone Next: జియో స్మార్ట్‌ఫోన్ ధర ప్రకటించిన కంపెనీ.. రూ.1,999కే కొనేయచ్చు.. రీచార్జ్ ప్లాన్లు ఇవే!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి