కాలం మారే కొద్దీ విలువ ఒకవైపు నుంచి మరోవైపు ప్రయాణిస్తుంది! ఒకప్పుడు కంపెనీలు పెట్టాలంటే కోట్లాది రూపాయాల మూలధనం అవసరం. భారీ యాంత్రాలు అవసరం అయ్యేవి. ఇప్పుడలా కాదు! ఇంటర్నెట్, కంప్యూటర్లు, చిన్న గది ఉంటే చాలు! చిన్న స్టార్టప్‌ను బిలియన్ డాలర్ల యూనికార్న్‌గా మార్చేయొచ్చు.
యంత్రాల నుంచి టెక్నాలజీ వైపు ప్రయాణిస్తున్న ఈ విలువను పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ అందిపుచ్చుకున్నారు. డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎంను స్థాపించారు. నేడది ఐపీవోకు రావడంతో ఒకప్పుడు పదివేలకే పనిచేసిన ఆయన ఇప్పుడు బిలియనీర్‌గా అవతరించారు.
పెళ్లి కష్టాలు
ఒక ఆంత్రప్రెన్యూర్ ఎన్ని కష్టాలను అనుభవిస్తారో పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ అవన్నీ అనుభవించారు. కేవలం పదివేల రూపాయాలు ఆర్జిస్తున్న అతడిని చూసి పెళ్లిచేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు! పెళ్లిచూపులకు వచ్చాక అతడి సంపాదన తెలుసుకొని ఇంటికెళ్లి మళ్లీ ఫోన్ చేసేవారు కాదు. మొత్తంగా కుటుంబంలో అర్హత లేని బ్యాచిలర్‌గా భావించేవారు. 27 ఏళ్ల వయసులో ఆయన పడ్డ అవమానాలు ఇవీ.
వ్యాపారమే ఇష్టం
మొదటి నుంచీ విజయ్‌కు వ్యాపారమంటేనే ఇష్టం. మొదట్లో ఆయన టెక్నాలజీకి సంబంధించిన చిన్న కంపెనీ నడుపుతుండేవారు. మొబైల్ కంటెంట్‌ను విక్రయించేవారు. పెద్దగా సంపాదనేమీ ఉండేది కాదు. దాంతో అతడి తండ్రి వ్యాపారాన్ని మూసేయాలని మందలించేవారు. కనీసం రూ.30వేలిచ్చే ఉద్యోగమైనా చేయమని ఒత్తిడి చేసేశారు.
నోట్ల రద్దుతో ఊపు
ఇబ్బందులను ఎదుర్కొంటూనే విజయ్ 2010లో డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎంను స్థాపించారు. ఆదిలో అన్నీ అవాంతరాలే. యూజర్లు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఎప్పుడైతే ఉబెర్ అందులో పెట్టుబడులు పెట్టిందో రాత మారిపోయింది. వినూత్నంగా ప్రజల్లోకి సంస్థను తీసుకెళ్లారు. మెరుగైన ఆఫర్లు ఇచ్చేవారు. 2016లో పెద్దనోట్లు రద్దు చేయడంతో పేటీఎంకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. యూజర్ బేస్ అమాంతం పెరిగిపోయింది. దాంతో సాఫ్ట్‌బ్యాంక్, బెర్క్‌షైర్ హాత్‌వే పెట్టుబడులు పెట్టాయి.
పేటీఎం సేవలెన్నో
పెట్టుబడులు పెరగడంతో డిజిటల్ చెల్లింపుల నుంచి మరిన్ని సేవలను పేటీఎం అందించడం మొదలు పెట్టింది. పేటీఎం మాల్, సినిమా టికెట్లు, ఇతర షోలు, క్రికెట్ మ్యాచుల టికెట్లు, కరెంటు బిల్లులు, క్రెడిట్ కార్డు బిల్లులు, బంగారం, పేటీఎం మనీ వంటి సేవలను విస్తరించింది. ఇప్పుడు గూగుల్, అమెజాన్, వాట్సాప్, ఫోన్‌పే వంటి సంస్థల నుంచి తీవ్ర పోటీ ఉన్నా మార్కెట్లో మాత్రం పేటీఎం లీడర్. మొత్తంగా 2025, మార్చి నాటికి డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ విలువ 95.29 ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం నేపథ్యంలో పేటీఎం ఐపీవోకు వచ్చింది. రూ.లక్ష కోట్ల మార్కెట్ విలువతో స్టాక్ మార్కెట్లో నమోదైంది.
నిజంగానే అంత డబ్బుందా?
చాన్నాళ్లు విజయ్ ఏం చేస్తున్నాడో? అతడి వ్యాపారం ఏంటో తల్లిదండ్రులకు తెలియదు. 2015లో యాంట్ గ్రూప్ పేటీఎంలో పెట్టుబడి పెట్టింది. ఓ హిందీ పేపర్‌లో విజయ్ నెట్‌వర్త్ గురించి చదివిన అతడి తల్లి 'విజయ్ నిజంగా ఆ పేపర్లో రాసినట్టుగా నీ దగ్గర అంత డబ్బుందా' అని అడిగిందట. ప్రస్తుతం అతడి మొత్తం సంపద విలువ రూ.240 కోట్ల డాలర్లుగా ఉంది.
కల ఇదే
విజయ్ ఇప్పుడింత ఎదిగినా ఎంతో ఉదారంగా, సింపుల్‌గా ఉంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో ఆయన జన్మించారు. అతడి తండ్రి ఉపాధ్యాయుడు. 2017లో భారత యువ సంపన్నుడిగా ఎదిగిన విజయ్ ఇప్పటికీ రోడ్డు పక్కన ఛాయ్ తాగడాన్ని ఇష్టపడతారు. ఉదయం బయటకు వెళ్లి పాలు కొనుక్కొస్తుంటారు. 2017లో పేటీఎం కెనాడలో అడుగుపెట్టింది. సాన్ ఫ్రాన్సిస్‌కో, న్యూయార్క్, లండన్, హాంగ్‌కాంగ్, టోక్యోకు పేటీఎంను విస్తరించాలన్నది విజయ్ కల. 'మీకు తెలుసా.. ఇది ఇండియా కంపెనీ' అని వారితో అనిపించాలని అతడి పట్టుదల!
Also Read: Government Deposit Scheme: నెలకు రూ.12,500 పెట్టుబడి పెడితే రూ.కోటి మీ సొంతం.. ఏంటా పథకం?
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: EPFO Equity Investment: స్టాక్‌మార్కెట్లో ఈపీఎఫ్‌వో లాభాల పంట.. రూ.40,000 కోట్ల రాబడి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి