క్రిప్టో కరెన్సీపై కేంద్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది! మధ్యే మార్గాన్ని అవలంబించాలని నిర్ణయించుకుంది. పూర్తిగా నిషేధించకుండా ఒక అసెట్ క్లాస్‌గా పరిగణనలోకి తీసుకోవాలని అనుకుంటోంది. ప్రస్తుత కరెన్సీ, ఆర్థిక వ్యవస్థకు చేటు చేయకుండా కఠిన నియంత్రణను అమలు చేయనుంది. లావాదేవీలకు చట్టబద్ధత ఉండకుండా పార్లమెంటులో బిల్లు పెట్టాలని భావిస్తోంది.
కొన్ని రోజులుగా క్రిప్టో కరెన్సీలపై కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ చర్చలు జరుపుతోన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా అభివృద్ధి చెందుతున్న ఈ కొత్త సాంకేతికతపై ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల సలహాలను తీసుకుంది. సరైన రీతిలో నియంత్రించకపోతే మనీ లాండరింగ్, ఉగ్రవాద కలాపాలకు దారితీసే అవకాశం ఉందని గ్రహించింది. ప్రధాని నరేంద్రమోదీ ఇదే విషయాన్ని ఉటంకించారు. ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అటు ఇన్వెస్టర్లు, స్టేక్‌హోల్డర్లు ఇటు ప్రభుత్వం, ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందుల్లేకుండా మధ్యే మార్గం వైపు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
క్రిప్టో కరెన్సీ చట్టబద్ధత వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లు తుదిదశకు చేరుకుంది. క్రిప్టో అసెట్‌ను ట్రేడింగ్ చేసుకొనేలా అదే సమయంలో చెల్లింపులు, లావాదేవీల వినియోగాన్ని నిషేధిస్తూ నియంత్రణ చట్టాన్ని తీసుకురానుంది. రాబోయే రెండు, మూడు వారాల్లో కేబినెట్ కమిటీ దీనిని పరిశీలించనుంది.
మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీనే క్రిప్టో కరెన్సీ నియంత్రణ సంస్థగా ఉండనుంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. క్రిప్టో అసెట్స్‌పై పన్నుల విధింపుపై ప్రభుత్వం కూలంకషంగా చర్చిస్తోంది. శీతకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలని అనుకుంటోంది.
ఆర్థిక అంశాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ స్థాయి సంఘం క్రిప్టో పరిశ్రమలోని ప్రతినిధులను కలిసింది. పూర్తిగా నిషేధం విధించకుండా నియంత్రణలోకి తీసుకురావడంపైనే వారు మొగ్గు చూపారని తెలిసింది. అయితే క్రిప్టో కరెన్సీలు ఆర్థిక వ్యవస్థకు చేటు తెస్తాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్న సంగతి తెలిసిందే. క్రిప్టోలపై కేంద్రానికి సమాచారం ఇస్తూనే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా క్రిప్టో ట్రేడింగ్ ఖాతాల సంఖ్యను అతిచేసి చెప్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేయడం గమనార్హం.
Also Read: LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవోలో మరో ముందడుగు.. తాజా అప్‌డేట్ ఇదే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి