ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బైక్‌లు, కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. కరోనా కారణంగా మందగించిన విక్రయాలు ఒక్కసారిగా పెరిగాయి. 2020 మొదటి త్రైమాసికంతో (క్వార్టర్ 1) పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు జరిగాయి. ఏపీలో 2021 మొదటి త్రైమాసికంలో 1,60,626 బైకులు, 18,999 కార్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే సమయంలో (2020 Q 1) జరిగిన అమ్మకాలతో పోలిస్తే.. ఈసారి భారీ పెరుగుదల కనిపిస్తోంది.
300 శాతానికి పైగా పెరుగుదల..
ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం.. 2020 మొదటి త్రైమాసికంలో కేవలం 4,712 కార్లు మాత్రమే విక్రయించబడగా.. 2021లో ఈ సంఖ్య 18,999కి పెరిగింది. అంటే దాదాపు 300 శాతానికి పైగా పెరుగుదల కనిపిస్తోంది. ఇక 2020 మొదటి త్రైమాసికంలో 1.09 లక్షల ద్విచక్ర వాహనాల విక్రయాలు జరిగాయి. ఈ సంఖ్య 2021 నాటికి 1.60 లక్షలకు పెరిగింది. అంటే ఈసారి దాదాపు 47.09 శాతం అధికంగా వాహనాల కొనుగోలు జరిగింది.
Also Read: Bikes Scooter Launch in August: ఆగస్టులో విడుదల కానున్న బైక్స్ ఇవే..
అమ్మో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్..
ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పటికీ అమ్మకాలు పెరిగాయి. కరోనా సమయంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కంటే వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించడానికే ప్రజలు మొగ్గుచూపుతున్నారని.. అందుకే అమ్మకాలు జోరందుకున్నాయనే వాదన వినిపిస్తోంది. అలాగే లోన్ల రూపంలో డబ్బులను వాయిదాలలో చెల్లించే ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో చాలా మంది వ్యక్తిగత వాహనాలను ఎంచుకుంటున్నారని ఆటో ఫైనాన్షియర్లు చెబుతున్నారు. లోన్ చెల్లించే కాలపరిమితిని రెండు నుంచి నాలుగు సంవత్సరాల పాటు ఎంచుకుంటున్నారని అంటున్నారు.
భవిష్యత్తులో కూడా కోవిడ్ ఉంటుందేమో..
ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత భవిష్యత్తులో కూడా కోవిడ్ ప్రభావం కొనసాగుతుందని అంచనాలు ఉన్న నేపథ్యంలో చాలా మంది వ్యక్తిగత వాహనాలు కొనేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేకపోవడంతో అత్యవసర పరిస్థితులలో ఎక్కడికైనా వెళ్లాలంటే సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భవిష్యత్తులో కూడా కరోనాతో కలిసి ఉండాల్సిందేననే భావనతో చాలా మంది సొంత వాహనాలు కొనుగోలు వైపు ఆసక్తి చూపారు.
651 కోట్ల ఆదాయం..
గతేడాది మొదటి త్రైమాసికంలో ఆదాయం రూ .367.13 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది ఇది రూ. 651.68 కోట్లకు పెరిగిందని అధికారులు చెప్పారు. రాబోయే రోజుల్లో వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్లు మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉందన్నది అధికారుల అంచనా.
Also Read: Tata Tiago NRG Launch Date: భారత మార్కెట్లోకి రానున్న టాటా టియాగో ఎన్ఆర్‌జీ.. ఫీచర్లు మీకోసం..