భారత క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. చిరకాల ప్రత్యర్థులు భారత్ X పాకిస్థాన్ మధ్య మరో ఆసక్తికరమైన పోరుకు డేట్ ఫిక్సయింది. అది కూడా ప్రపంచకప్‌లో పోరుకి. T20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్ X పాకిస్థాన్ జట్లు అక్టోబర్ 24న తలపడతాయి. దుబాయ్‌ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. 
ఈ ఏడాది T20ప్రపంచకప్ టోర్నీ భారత్‌లో జరగాల్సి ఉంది. కానీ, కరోనా పరిస్థితుల కారణంగా BCCIతో చర్చించిన ICC...T20 ప్రపంచకప్ టోర్నీ UAE,ఒమన్‌లో నిర్వహిస్తున్నట్లు ICC ప్రకటించింది. టోర్నీని మాత్రం BCCI నిర్వహిస్తోంది. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు T20 ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటి వరకు భారత్ X పాకిస్థాన్ జట్లు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఏడు సార్లు తలపడ్డాయి. ఈ ఏడింట్లోనూ భారత్‌దే విజయం. కోహ్లీ కెప్టెన్సీలో చివరి‌సారి ICC ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. 
ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ సూప‌ర్ 12లో గ్రూప్ 2లో ఉన్నాయి. దీంతో ఈ దాయాదుల పోరు ఖాయ‌మ‌ని అప్పుడే తేలినా.. తాజాగా ఈ మ్యాచ్ తేదీ కూడా ఖ‌రారైంది. మార్చి 20, 2021 నాటికి టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఐసీసీ జ‌ట్ల‌ను గ్రూపులుగా విభ‌జించింది. గ్రూప్ - 1లో డిఫెండింగ్ చాంపియ‌న్స్ వెస్టిండీస్‌తో పాటు ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఇక గ్రూప్ - 2లో ఇండియాతోపాటు పాకిస్థాన్, న్యూజిలాండ్‌, ఆఫ్ఘ‌నిస్థాన్ త‌ల‌ప‌డ‌తాయి. మ‌రో నాలుగు టీమ్స్ క్వాలిఫ‌య‌ర్స్ నుంచి సూప‌ర్ 12కు అర్హ‌త సాధిస్తాయి. దుబాయ్, అబుదాబి, షార్జా, ఒమన్ వేదికలగా మ్యాచ్లు జరుగుతాయి. 


వాస్తవానికి ఈ ప్రపంచకప్ గత ఏడాది భారత్‌లో జరగాల్సి ఉంది. కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాదికి మార్చారు. ఐసీసీ టోర్నమెంట్లలో తప్ప ఈ రెండు జట్లు బయట ఏ టోర్నీలోనూ తలపడవు. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ రెండు జట్లు తలపడేందుకు ముహూర్తం కుదిరింది. 
ప్రస్తుతం భారత్... ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. పర్యటనలో భాగంగా భారత్... ఆతిథ్య ఇంగ్లాండ్‌తో 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఆగస్టు 4న ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత కరోనా కారణంగా నిలిచిపోయిన IPL మ్యాచ్‌లు జరుగుతాయి. IPL కూడా దుబాయ్‌లోనే జరగనుంది. ఆ తర్వాత టీమిండియా T20 ప్రపంచకప్ ఆడనుంది. IPL కోసం టీమిండియా క్రికెటర్లు ముందుగానే దుబాయ్ చేరుకుంటారు. ప్రపంచకప్ లాంటి టోర్నీకి ముందే టీమిండియా దుబాయ్‌లో పర్యటించడం కాస్త కలిసొచ్చే అంశమే. మరి ఏం జరుగుతుందో చూద్దాం.