కరోనా మహమ్మారి వల్ల మనం ఎన్నడూ ఊహించని కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాం. మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్సింగ్ వంటి వాటిని మన రొటీన్ లైఫ్‌లో భాగం చేసుకున్నాం. ఏడాదిన్నరగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి కొత్త రూపులు మార్చుకుంటూ మానవావళికి సవాళ్లను విసురుతూనే ఉంది. కరోనా సోకడం కంటే కూడా అది వస్తుందనే భయంతోనే చాలా మంది కుంగిపోతున్నారు. మానసిక ఆందోళనకులోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాలు కూడా మనం చూస్తునే ఉన్నాం.
కరోనా చికిత్సలో శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధిని నయం చేయడానికి ఎన్ని మందులు వాడినా.. మానసికంగా ధైర్యంగా లేకపోతే అవి పనిచేయవని చెబుతున్నారు. మానసిక ఒత్తిడితో రోగనిరోధక శక్తి క్షీణించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. మన ఆరోగ్యంతోపాటు కుటుంబాన్ని కాపాడుకోవాలంటే మానసికంగా స్టాంగ్‌గా ఉండాలని సూచిస్తున్నారు.
కోవిడ్ సమయంలో మానసిక ఆరోగ్యానికి సంబంధించి ప్రముఖ మానసికవేత్త, జిందాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిహేవియరల్ సైన్సెస్ (JIBS) డైరెక్టర్ డాక్టర్ సంజీవ్ పి.సాహ్ని పలు విషయాలను పంచుకున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు. ఆ వివరాలు మీకోసం..
రెగ్యులర్ వ్యాయామం..
కోవిడ్ మహమ్మారి మన రోగనిరోధక వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపుతుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ స్టాంగ్‌గా ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ప్రస్తుత సమయంలో జిమ్‌లకు వెళ్లడం కష్టం. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే వ్యాయామాలు చేయాలి. శ్వాసకు సంబంధించిన బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్, యోగా వంటి వాటిని చేస్తుండాలి. కేవలం కోవిడ్ వచ్చినప్పుడు మాత్రమే కాకుండా, రోజువారీ జీవితంలో వీటిని భాగం చేసుకోవాలి. వీటి ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది.
సరైన నిద్ర..
కోవిడ్ కారణంగా విద్య, ఉద్యోగాలు అన్నీ ఇంటి నుంచే చేస్తున్నారు. ఆన్ లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోంలతో హడావుడిగా సమయాన్ని గడిపేస్తున్నారు. స్క్రీన్లతో గడిపే సమయం పెరగడంతో నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ఇది కూడా మానసిక అనారోగ్యానికి కారణం అవుతుంది. సరైన నిద్రతో మెదడు, శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. నిద్ర లేమి వల్ల మానసిక చికాకులు, ఆందోళన కలుగుతాయి. 14 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు రోజుకు కనీసం 8 గంటలు, 14 ఏళ్ల పైబడిన వారు కనీసం 7 గంటలు నిద్రపోవాలి.
ఆలోచనలను పంచుకోండి..
దాదాపు ఏడాదిన్నర కాలంగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. మనుషులతో కూడా వర్చువల్ గానే కనెక్ట్ అవుతున్నారు. ఆడియో, వీడియో కాల్స్ వంటి వాటి ద్వారా మనుషులతో కనెక్ట్ అవుతున్నా.. అన్ని విషయాలను పంచుకోలేకపోతున్నారు. మీకు ఒత్తిడిగా అనిపిస్తే కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆలోచనలను పంచుకోవాలి. మీకు ఇంకా ఒత్తిడిగానే అనిపిస్తే మానసిక వైద్యుల సహకారం తీసుకోవాలి.
సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడండి..
సోషల్ మీడియాలో సమాచారాన్ని చూసి కూడా చాలా మంది మానసికి ఒత్తిడికి లోనవుతున్నారు. ఏది నిజమో, ఏది అబద్దమో తెలియకుండానే వార్తలు వస్తుండటంతో అవి నిజమేనని అనుకుంటున్నారు. ఇలాంటి వాటి వల్ల డిప్రెషన్‌కు లోనవుతారు. వీటి బారిన పడకుండా ఉండాలంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు, నిపుణులు అందించే వీడియోలను చూడాలి. అలాగే భావోద్వేగ నియంత్రణకు సంబంధించిన వీడియోలు, కథనాలు, బ్లాగ్‌లను చదవాలి. సాధ్యమైనంత వరకు నెగిటివ్ వార్తలకు, వీడియోలకు దూరంగా ఉండాలి. ఇలాంటి చిట్కాలను పాటిస్తే మానసికంగా ధైర్యంగా ఉండగలుగుతారు.