" నా పెన్షన్ కూడా ఆలస్యమవుతోంది " అని ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు కొద్ది నెలల కిందట ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన ఆయన పోస్టుకు అప్పట్లో పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. రాజకీయ పరమైన పోస్ట్ అనుకున్నారు. కానీ ఆయన రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి కూడా. ఆయన పెన్షన్ ఇప్పటికీ ఆలస్యంగా వస్తోంది. ఇది ఆయన ఒక్కరి సమస్య కాదు. ఏపీ ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులందరిదీ. ఆ మాటకొస్తే ఏపీలో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులందరిదీ. కానీ మిగతా వారికి వేరే ఆప్షన్ లేదు.. రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులకు ఆ అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా, కేంద్రం నుంచి సైతం పెన్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు అందరూ కలిసి అదే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులు తమ పెన్షన్ ప్రతినెలా ఆలస్యం అవుతుండటంతో అసహనానికి గురవుతున్నారు. వారంతా తమ పెన్షన్‌ను కేంద్రమే ఇవ్వాలని పిటిషన్ పెట్టుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏపీ క్యాడర్ రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులకు ఓ వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో చాలా రోజులుగా పెన్షన్ల ఆలస్యంపై చర్చ జరుగుతోంది. ఏదో ఒకటి, రెండు నెలలు కాదని.. పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని... అందుకే తమ పెన్షన్లను కేంద్రమే ఇవ్వాలని ఆప్షన్ పెట్టుకోవాలన్న అభిప్రాయానికి ఇటీవల వచ్చారని చెబుతున్నారు. దీనిపై వారంతా ఒకటిరెండు రోజుల్లో డీవోపీటీని సంప్రదించే అవకాశం ఉంది.
సివిల్ సర్వీస్ అధికారులకు పెన్షన్లు కేంద్రమే ఇస్తుంది. అయితే ఏ రాష్ట్ర క్యాడర్ అధికారులకు ఆ రాష్ట్రం తరఫున చెల్లిస్తారు. కేంద్రం ఆ రాష్ట్రానికి పెన్షన్ నగదు ఇస్తుంది. అయితే రాష్ట్రం నుంచి తీసుకోవడానికి ఇష్టం లేకపోతే.. వారు నేరుగా కేంద్రం నుంచి తమకు పెన్షన్ ఇచ్చే ఏర్పాటు చేయాలని కోరవచ్చు. ఇప్పుడీ అవకాశాన్ని వినియోగించుకోవాలని రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా జీతభత్యాల విషయాన్ని ప్రభుత్వాలు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని చెల్లింపులు చేస్తాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రయారిటీని తీసుకోవడం లేదు. దీంతో ఉద్యోగులు.. పెన్షనర్లకు ఎప్పుడు తమ జీతాలు. పెన్షన్లు వస్తాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. తమకు అవకాశం ఉంది కనుక కేంద్రం నుంచే తమకు పెన్షన్ ఇవ్వాలని కోరేందుకు సివిల్ సర్వీస్ అధికారులు నిర్ణయించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఈ నెల కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇప్పటివరకూ పెన్షనర్లకు చెల్లింపులు చేయలేదు. కొంత మంది ఉద్యోగులకు వేతనాలు చెల్లించారు. అయితే ఆ మొత్తాన్ని ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) కింద తీసుకుని చెల్లించారు. ఈ మంగళవారం బాండ్ల వేలం ద్వారా రూ. రెండు వేల కోట్లను అప్పుగా తీసుకున్న ఏపీ.. ఆ మొత్తాన్ని ఓడీ కింద జమ చేసింది. ఇంకా కొంత మొత్తాన్ని కట్టాల్సి ఉంది. ఇప్పుడు... ఇంకా ఎక్కడైనా నిధులు దొరుకుతాయేమోనని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. దొరక్కపోతే... పన్నుల ఆదాయం.. కేంద్రం నుంచి ఏమైనా నిధులు వస్తే, వాటితో పెండింగ్‌లో ఉన్న జీతాలు, పెన్షన్లు చెల్లించాలని యోచిస్తోంది. ఇలాంటి తరుణంలో సివిల్ సర్వీస్ అధికారులు కూడా తమకు ఏపీ ప్రభుత్వం నుంచి వద్దని కేంద్రం నుంచి పెన్షన్ ఇవ్వాలని దరఖాస్తు పెట్టుకుంటే అది ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను సూచించే అవకాశం కనిపిస్తోంది.