చిత్తూరు, తిరుపతిలో ఉన్న రెండు అమరరాజా యూనిట్లూ ప్రమాదకరమే అని తేల్చిచెప్పారు కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌. పర్యావరణాన్ని తిరిగి పునరుద్ధరించలేని స్థాయిలో కాలుష్యాన్ని విడుదల చేస్తున్న అమరరాజా బ్యాటరీస్‌ తిరుపతి యూనిట్‌ను ప్రస్తుతం ఉన్నచోట కొనసాగించడానికి వీల్లేదని తామే చెప్పామన్నారు. ఈ ప్లాంట్‌ వల్ల పరిసర ప్రాంతాల్లో ప్రమాదకరమైన రీతిలో వాతావరణం దెబ్బతినడమేకాక అక్కడి చెరువులు ప్రమాదకరంగా మారాయని, మనుషుల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనిపై హైకోర్టులో తాము పిటిషన్‌ వేశామన్నారు. ప్లాంట్‌ను తరలించాలని తాము చెప్పగా.. ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ పరిశ్రమ వేరే ప్రాంతానికి తరలిపోతోందంటూ కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాశాయన్న విజయ్ కుమార్…. ఆయా పత్రికలకు లీగల్ నోటీసులు ఇస్తామన్నారు.




రెండు నెలలు సమయం ఇచ్చిచూశాం…


రెడ్‌ కేటగిరీ పరిశ్రమల్లో కాలుష్యం ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు ప్రతినెలా చేస్తున్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా 54 పరిశ్రమల్లో తనిఖీలు చేశాం. వాటిలో కాలుష్యం ఎక్కువగా వస్తుందని గమనించి షోకాజ్‌ నోటీసులు ఇచ్చాం అన్నారు విజయ్‌కుమార్‌.  సరిచేసుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని యాజమాన్యాలు కోరాయి. అమరరాజా బ్యాటరీస్‌  కి కూడా 2 నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత ఉల్లంఘనలు ఎంతవరకు సరయ్యాయో తెలుసుకునేందుకు మళ్లీ తనిఖీ చేశాం. అప్పుడు కూడా సరికాకపోవడంతో మళ్లీ నోటీసు ఇచ్చాం. దీనిపై రెండుసార్లు లీగల్‌ హియరింగ్‌కు అవకాశం ఇచ్చాం అని విజయ్‌కుమార్‌ చెప్పారు.


అమరరాజా బ్యాటరీస్‌ చిత్తూరు, తిరుపతి యూనిట్ల నుంచి వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించకపోతే అందులో పనిచేసే కార్మికులు, చుట్టుపక్కల గ్రామాల్లో కాలుష్యం మరింత పెరిగి, అక్కడి వారి ఆరోగ్యం దెబ్బతింటుందని గుర్తించామన్నారు.  ఏలూరులో ఇలాంటి పరిస్థితిలోనే లెడ్, నికెల్‌ లెవెల్స్‌ ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందుల్లో పడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాం. అలాంటి వైపరీత్యాలు వస్తున్నందున కాలుష్యాన్ని నియంత్రిస్తే తప్ప పరిశ్రమను నడిపించడానికి వీల్లేదని క్లోజర్‌ ఆర్డర్‌ ఇచ్చాం. ఇదొక్కటే కాదు ఈ ఏడాది 64 పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపి వేయాలని, 50 పరిశ్రమలను మూసివేయాలని క్లోజర్‌ ఆర్డర్స్‌ ఇచ్చాం అని చెప్పారు విజయ్ కుమార్. కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకునే వరకు మూసివేసి, నియంత్రణ చర్యలు తీసుకున్నాక ఉత్పత్తి చేసుకోవాలని చెప్పాం. క్లోజర్‌ ఆర్డర్‌ ఇచ్చాక అమరరాజా బ్యాటరీస్‌ కోర్టును ఆశ్రయించింది. కోర్టు 4 వారాలపాటు స్టే ఇచ్చింది. ఈలోపు ఓ బృందాన్ని నియమించి పూర్తిస్థాయి తనిఖీలు చేసి ఆ వివరాలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో ఒక సాంకేతిక టీమ్‌ని నియమించి అక్కడికి పంపి హైకోర్టుకు నివేదిక సమర్పించాం.




ఉద్యోగుల రక్తంలోనూ సీసం చేరింది: విజయ్ కుమార్
అమరరాజా ప్లాంట్‌ వద్ద వాడే నీటిని పూర్తిస్థాయిలో ట్రీట్‌మెంట్‌ చేసి బయటకు పంపించాలి. కానీ లెడ్‌ (సీసం)తో కలిసిన నీటిని నేరుగా మొక్కలు, ఇతర అవసరాలకు వాడుతున్నారు. ఏవిధమైన ఏటీపీ (ఎఫిలియెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌) చేయకుండా నేరుగా లెడ్‌ కలిసిన నీటిని ఎస్‌టీపీకి వదిలేశారు. ఆ నీరు మల్లెమడుగు, గొల్లపల్లి, నాయుడు చెరువుల్లో కలిసింది. కొండపక్కనే ఉండటం వల్ల ఈ నీటితోపాటు వర్షం వచ్చినప్పుడు ప్లాంట్‌ నీరు చెరువుల్లో కలిసింది. ఈ నీరు తాగిన జంతువుల్లోకి లెడ్‌ వెళుతోంది. ఈ నీటి ద్వారా పండిన కూరగాయలతో మనుషుల శరీంలోకి లెడ్‌ వెళుతోంది. సాధారణంగా ఒక పరిశ్రమలో కాలుష్యం వస్తే అందులో పనిచేసే ఉద్యోగులు, లోపల, పరిసరాల్లో మాత్రమే కాలుష్యం ఉంటుంది. కానీ ఇక్కడ 4, 5 కిలోమీటర్ల భూమి, నీటిలో లెడ్‌ ప్రవేశించిందని చెప్పారు విజయ్ కుమార్.


ప్రతిచోటా రెండు చొప్పున శాంపిల్స్‌ని సేకరించి ఒకటి పీసీబీ లేబొరేటరీలో, మరొక శాంపిల్‌ని హైదరాబాద్‌లో ఉన్న స్వతంత్య్ర సంస్థ ఈపీటీఆర్‌ఐ (ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌)కి పంపించాం. ఈ రెండు నివేదికలను హైకోర్టుకు సమర్పించాం. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల బ్లడ్‌ శాంపిల్స్‌ను బెంగళూరులోని ఒక లేబొరేటరీకి పంపించాం. 12 శాతం శాంపిల్స్‌లో బ్లడ్‌ లెవెల్స్‌ డెసిలేటర్‌కి 42 మైక్రో గ్రాములు ఉంది. ఇది అత్యధికంగా 10 మైక్రో గ్రాములు మాత్రమే ఉండాలి. 450 మంది ఉద్యోగుల శరీరంలో పరిమితిని దాటిపోయి లెడ్‌ ఉంది. ఈ ఉద్యోగులను లెడ్‌ రాని ఏరియాలో పనిచేయించాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు పూర్తిస్థాయి అధ్యయనం చేయమని చెప్పడంతో మద్రాస్‌ ఐఐటీ నిపుణులను తనిఖీలకు పంపాం. వాళ్లతోపాటు పీసీబీ సిబ్బందిని యాజమాన్యం లోనికి అనుమతించలేదు. దీంతో పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేశాఅన్నారు పీసీబీ సభ్యకార్యదర్శి విజయ్ కుమార్.


జరిగిన ఉల్లంఘనల్ని సరిచేసే వరకు ఆ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయాలని చెప్పాం అన్నారు పీసీపీ సభ్యకార్యదర్శి విజయ్ కుమార్. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలని ఇవన్నీ వాతావరణాన్ని పరిరక్షిస్తూ చేయాలని ఐక్యరాజ్యసమితి చెబుతోందన్నారు. అయితే అమరరాజా పరిశ్రమను మూసివేయడం ప్రభుత్వం ఉద్దేశం కాదన్న పీసీపీ సభ్యకాదర్శి విజయ్ కుమార్…. పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.