ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. యూట్యూబ్ ఛానల్ ద్వారా వార్తలు అందిస్తున్న తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. రాత్రి 8 గంటల సమయంలో క్యూ న్యూస్ ఆఫీసుకు పోలీసులు వచ్చారు. ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారంటూ.. పోలీసులు సోదాలు చేశారని తెలుస్తోంది. ఎలాంటి నోటీలుసు లేకుండానే ఆఫీసులో చొరబడ్డారని క్యూ న్యూస్ ఉద్యోగులు చెబుతున్నారు. లోకల్ పోలీసులతోపాటుగా మూడు ప్రత్యేక వాహనాల్లో క్యూ న్యూస్ ఆఫీస్ వద్దకు పోలీసులు భారీగా వచ్చారు. ప్రభుత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నిస్తూ.. వచ్చే తీన్మార్ మల్లన్న ఆఫీసులో తనిఖీలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఓ యువతి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. పని చేస్తున్న తీన్మార్ మల్లన్న ఆఫీసులో తనిఖీలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 


క్యూ న్యూస్ ఛీఫ్ బ్యూరో.. తిన్మార్ మల్లన్న టీం స్పోక్స్ పర్సన్, జర్నలిస్టు చిలుగా ప్రవీణ్ మల్లన్నపై ఇటీవలే ఆరోపణలు చేశారు. దళితులు, బీసీలను నమ్మించి వంచిస్తున్నాడని.. విమర్శించారు. వందల కోట్లు సంపాదించేందుకు పక్కా ప్రణాళిక వేసుకున్నాడని వ్యాఖ్యలు చేశారు. సాయం కోసం ఆశ్రయించిన మహిళలను సైతం అసభ్యకర పదజాలంతో కించపరుస్తాడని, మల్లన్న వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిందని ప్రవీణ్ ఆరోపించారు.


క్యూ న్యూస్ ఆఫీస్‌లో రెండు కోట్ల రూపాయలు ఉన్నాయని వాటిని చూసి తాను ప్రశ్నించడంతో ఘర్షణ జరిగిందని ప్రవీణ్ చెప్పుకొచ్చారు. క్యూ న్యూస్ ఆఫీస్, తీన్మార్ మల్లన్న ఇంట్లో ఇప్పటికిప్పుడు సోదాలు చేసినా నగదు బయటపడుతుందంటూ ప్రవీణ్ మెున్ననే ఆరోపణలు చేశారు. ప్రవీణ్ ఆరోపణలు చేసిన కొద్ది రోజుల్లోనే.. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్‌లో తనిఖీలు జరిగాయి.


2019లో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. ఉపఎన్నికలలో గెలిచేంత ఆర్థిక స్థోమత లేని కారణంగా.. విరాళాలు అడుగుతున్నట్లు ఆయన యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్పుడు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 


తర్వాత జరిగిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో తీన్మార్ మల్లన్న బరిలో నిలిచారు. అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీనిచ్చారు. ఓ దశలో తీన్మార్ మల్లన్న గెలుస్తాడా అనేంత ఆ ఎన్నిక ఉత్కంఠ రేపింది. పోరాటి ఓడినా ప్రజాభిమానం సొంతం చేసుకున్నారనే భావన కలిగింది. 


కరోనా పరిస్థితులు సద్దుమణిగితే.. ఆగస్టు 29 నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తాని కూడా తీన్మార్  మల్లన్న ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు సంవత్సరాల పాటు ఇంటికి వెళ్లకుండా ప్రజల్లోనే ఉంటానని ఆ సమయంలో చెప్పుకొచ్చారు. పాదయాత్రకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తామని కూడా చెప్పారు.