ఏపీలో ఉక్కపోత


ఆంధ్రప్రదేశ్‌లో వానాకాలంలోనూ ఎప్పడూ లేనంతగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖలో 37.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా.. ఉక్కపోతతో అల్లాడిపోయారు. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఆగస్టు రెండో వారం నుంచి వాతావరణంలో మార్పులు వచ్చి వర్షాలు పడే సూచనలున్నట్లు తెలిపారు. కోస్తా తీరం వెంబడి రానున్న 3 రోజుల్లో ఉపరితల ద్రోణి ఏర్పడనుందని..దీనికి అనుబంధంగా ఈ నెల 7న మచిలీపట్నం సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఉభయగోదావరి జిల్లాల మీదుగా కదులుతూ తెలంగాణ వైపు ప్రయాణించనుందని దీని ప్రభావంతో ఈ నెల 11 నుంచి 22 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో విస్తారంగానూ, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొన్నారు.  


రెండు రోజుల పాటు వర్ష సూచనలు 
ఏపీలో పడమర, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వీటి ఫలితంగా రాగల 2 రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే సూచన ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో బుధ, గురువారాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.




తెలంగాణలో వడగాడ్పులు


తెలంగాణలోనూ పలుచోట్ల వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర భారతం నుంచి రాష్ట్రంపైకి వేడిగాలులు, పొడిగాలులు వస్తున్నాయని, ముఖ్యంగా రాజస్తాన్‌ నుంచి ఈ గాలులు వస్తుండటంతో తెలంగాణలో తీవ్రమైన ఎండలు, వడగాడ్పులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది. 


సోమ, మంగళవారాల్లో ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని  వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగనున్నట్లు పేర్కొంది. ఆ ద్రోణి వస్తే తేమ గాలులు వస్తాయని, అప్పుడు కాస్తంత వేడి తగ్గుతుందని తెలిపింది.


ఎండ వేడికి తోడు ఉత్తరాది నుంచి వీస్తున్న వడగాడ్పులతో  ఆదివారం వివిధ జిల్లాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌ జిల్లా జైనద్‌లో 46.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. అదే విధంగా మంచిర్యాల, కామారెడ్డి, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల్లోనూ 46 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత రికార్డయింది. నిజామాబాద్ 44.9, నల్లగొండ 44.5, మెదక్ 44.3, రామగుండం 44.2, మహబూబ్ నగర్ 43.2, ఖమ్మం 42.6, హన్మకొండ 42.5, హైదరాబాద్ 42.4, భద్రాచలం లో 41.2 డిగ్రీల  సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది.