విద్యుత్ కార్ల బ్రాండ్లలో ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా ఉన్న టెస్లా కంపెనీ ఇండియాలో తమ కార్లను లాంఛ్ చేయడానికి ముందువెనుకాడుతోంది. పన్నులు ఎక్కువగా ఉన్నాయని.. మరొకటని ఆ కంపెనీ చీఫ్ ఎలన్ మస్క్ కొన్ని రోజులుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతే కాదు ప్రభుత్వానికి కూడా పన్నులు తగ్గించాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆయన విజ్ఞప్తిని నిరభ్యంతరంగా తోసిపుచ్చింది. ఎలాంటి పన్నులు తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. భారత్‌లో తయారు చేస్తే సుంకాలు తక్కువగా ఉంటాయి. విదేశాల నుంచి దిగుమతిచేసుకుని విక్రయిస్తే అత్యధిక పన్నులు పడతాయి. అవి యాభై శాతానికంటే ఎక్కువగాఉంటాయి. అందుకే.. కనీసం నలభై శాతానికి తగ్గించాలని ఎలన్ మస్క్ ప్రభుత్వాన్నికోరారు. కానీ ప్రభుత్వం మాత్రం తోసి పుచ్చింది. 


టెస్లామోటార్స్ ను భారత్‌లో ఈ ఏడాది ప్రారంభంలోనే రిజిస్టర్ చేశారు. బెంగళూరులో టెస్లా మోటార్స్‌ అండ్‌ ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో నమోదు చేశారు. ఈ సంస్థకు మాతృ సంస్థగా  నెదర్లాండ్స్‌లోని టెస్లా మోటార్స్‌  ను పెట్టారు. ఇదంతా పన్నులు ఆదా చేసుకోవడానికే చేశారు. మామూలుగా అయితే టెస్లా ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. నెదర్లాండ్స్ నుంచి టెస్లా కార్లను ఇండియాకు తెచ్చి పన్ను లాభాలు పొందే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. ఇండియాలోనూ పన్ను మిహాయింపులు కావాలని ఎలన్ మస్క్ పట్టుబడుతున్నారు.  


భారత ప్రభుత్వం ఎలాంటి పన్ను మినహాయింపులు ఇవ్వకపోయినా ఇండియాలో టెస్లా కార్లను త్వరలో లాంచ్ చేసే అవకాశం ఉంది. టెస్లా కార్లలో మొత్తం నాలుగు మోడల్స్‌ను ఇండియాలో అమ్మకానికి పెట్టే చాన్సులు ఉన్నాయి. వాటి ఖరీదు అత్యధికంగా రూ. రెండు కోట్ల వరకూ ఉంటుందని ఆటోమోబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టెస్లా మోడల్ ఎక్స్. అద్భుతమైన ఇంటీరియర్ సౌకర్యాలు ఉంటాయి. నెంబర్ వన్ టెక్నాలజీ ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. కానీ ఇండియా రోడ్ల మీద అది ఎలా పనిచేస్తుందో ఇంత వరకూ టెస్ట్ చేయలేదు. అలాగే ఎస్ మోడల్ ధర కోటిన్నర రూపాయలు ఉంటుంది. రూ. అరవై లక్షలకు మోడల్ త్రీ టెస్లా కారు లభించవచ్చు. ఇక చివరిగా యాభై లక్షలకు కూడా వై మోడల్ కారు లభించే అవకాశం ఉంది. అయితే టెస్లా కారు ప్రయాణాన్ని ఆస్వాదించాలంటే ఖచ్చితంగా హై ఎండ్ కారు కొనుగోలు చేయాలని టెక్ నిపుణులు చెబుతున్నారు. 


టెస్లా కారును ఇండియాలో అధికారికంగా అమ్మడం లేదు కానీ.. ఇప్పటికే దేశంలోని కొంత మంది ధనవంతులు.. వంద శాతానికిపైగా పన్ను కట్టి కొన్ని కార్లు దిగుమతి చేసుకున్నారు. ముఖేష్ అంబానీ, బాలీవుడ్ యాక్టర్ రితేష్ దేశ్ ముఖ్, పారిశ్రామికవేత్త ప్రశాంత్ రుయా, నటి పూజా బాత్రా లాంటి వారి దగ్గర ఈ కార్లు ఉన్నాయి. అధికారికంగా టెస్లా కంపెనీ లాంచ్ చేస్తే.. మరింత మంది ధనవంతులు ఆ ఆ కార్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది.