కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల భారత ఆటో రంగంలో అమ్మకాలు నెమ్మదించాయి. ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లో సడలింపులను ఇస్తున్నాయి. దీంతో చాలా కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. ఆగస్టు నెలలో ఓలా తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో లాంచ్ చేయబోతుంది. దీంతో పాటు ఇంకా చాలా టూవీలర్స్ ఇండియన్ మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి.


మీరు టూవీలర్ కొనాలనుకుంటున్నారా? అయితే ఆగస్టులో రాబోతున్న బైక్స్, స్కూటర్ల వివరాలను తెలుసుకోండి.. 
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్..
ఓలా తమ సంస్థ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ రాబోతుందని ప్రకటించిన నాటి నుంచి వీటికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ స్కూటర్లను జూలై నెలాఖరుకు విడుదల చేస్తామని సంస్థ వెల్లడించినా... ఇప్పటివరకు తేదీపై ప్రకటన చేయలేదు. దీంతో ఓలా స్కూటర్‌ను ఆగస్టులోనే లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. ఓలా విడుదల తేదీకి సంబంధించి సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ సైతం ట్వీట్ చేశారు. దీని లాంచ్ డేట్ గురించి చర్చిస్తున్నామని.. త్వరలోనే తేదీని వెల్లడిస్తామని చెప్పారు. 





ఓలా వీటిని 10 కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయనుంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల అడ్వాన్ బుకింగ్స్ సరికొత్త రికార్డులను సృష్టించడంతో వీటిపై అంచనాలు పెరిగిపోయాయి. దీంతో వీటి విడుదలపై బజ్ ఏర్పడింది. దీనికి సంబంధించిన ప్రతి వార్తను భవిష్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. 


సింపుల్ వన్.. (Simple One)



బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ ఎనర్జీ.. తన కొత్త స్కూటర్‌ను ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. సింపుల్ వన్ అనే పేరుతో విడుదల కానున్న ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 103 కిలో మీటర్లుగా ఉంది. కేవలం 3.6 సెకన్లలోనే ఈ స్కూటర్ 0 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని కంపెనీ వెల్లడించింది. ఈ స్కూటర్‌లో 4.8 kWh లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది 9.4hp పవర్, 72 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ.1.1 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. 


బీఎండబ్ల్యూ సీ 400 జీటీ (BMW C 400 GT)



ప్రముఖ ఆటో కంపెనీ బీఎండబ్ల్యూ మోటరోరాడ్ తన కొత్త మ్యాక్సీ స్కూటర్ సీ 400 జీటీని ఆగస్టు నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలైంది. ఈ స్కూటర్ ధర సుమారు రూ .5 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. 
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350)
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన సరికొత్త బైక్ క్లాసిక్ 350ని ఆగస్టు నెలలో భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఇందులో ఇంజిన్, ఫ్రేమ్, టెక్నాలజీలను కొత్తగా తీసుకురానుంది. వీటితో పాటు అనేక అధునాతన ఫీచర్లు ఈ బైకులో ఉండనున్నాయి. 


హోండా హార్నెట్ 2.0 ఆధారిత ADV (Honda Hornet 2.0 based ADV)



హోండా ఇండియా తన కొత్త బైక్‌ను ఆగస్టులో విడుదల చేయనుంది. ఇందులో హార్నెట్ 2.0 కమ్యూటర్ ఉండనుంది. హార్నెట్ 2.0 ఆధారిత ADVని వచ్చే నెలలో మార్కెట్ లోకి ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. హోండా బైక్ ధర రూ.1.45 లక్షల నుండి 1.50 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని అంచనా.