సహజీవనం చేస్తున్న ఓ జంట కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై పైశాచికత్వానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమెను నమ్మించి అత్యాచారం చేసిన యువకుడు, తర్వాత కర్రతో కొట్టి దారుణంగా హతమార్చాడు. అనంతరం ఆమె ఒంటిపై ఆభరణాలతో జంట పరారైంది. ఈ కేసులో ఆ జంటను అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేస్తుండగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. సహజీవనం చేస్తున్న జంట కురువ స్వామి అలియాస్‌ రవి, మసనమొల్ల నర్సమ్మ విచారణ జరపగా.. నర్సమ్మ తన భాగస్వామి గురించి నిజాలను బయటపెట్టింది. ఆమె మాటలు విని పోలీసులు అవాక్కయ్యారు.


అతనికి అమ్మాయిల పిచ్చి ఉందని మహిళ నర్సమ్మ వెల్లడించింది. తనతో రోజూ ‘నువ్వొక్కదానివి సరిపోవు. రోజుకో అమ్మాయి కావాలి. తీసుకొస్తే తీసుకురా. లేదంటే నిన్ను వదిలేస్తా’ అంటూ తనను బెదిరించేవాడని ఆమె వెల్లడించింది. అందుకే అతను చేసే అఘాయిత్యాలకు తాను సహకరించేదాన్నని ఒప్పుకుంది. తాను ఒప్పుకుంటే లైంగిక దాడి చేసేవాడని, నిరాకరిస్తే నరకం చూపేవాడని వెల్లడించింది. పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలిస్తే అలాంటి వారిని చంపేసేవాడని పేర్కొంది.


ఆమె కూడా అతని బాధితురాలే..: పోలీసులు
నిందితుడు స్వామి ఏ పనీ చేయడని, నేరాలే లక్ష్యంగా ఆయన జీవనం సాగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ‘‘లేబర్‌ అడ్డాలు, మార్కెట్ల దగ్గర అందంగా.. ఆభరణాలు వేసుకొని కనిపించే మహిళలను నమ్మించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడు. ఆ తర్వాత ఆభరణాలతో ఉడాయించేవాడు. తొమ్మిదేళ్ల క్రితం కూడా నర్సమ్మపైనా ఇలాగే అఘాయిత్యం చేశాడు. అంతకుముందే ఆమెకు పెళ్లయి ఇద్దరు పిల్లలున్నారు. భర్త, పిల్లల్ని వదిలేసి స్వామితో కొన్నాళ్లు సహజీవనం చేసిన ఆమె తర్వాత అతణ్నే పెళ్లి చేసుకుంది. కొట్టేసిన ఆభరణాలను తాకట్టు పెట్టి ఆ డబ్బులు అయిపోయేవరకూ జల్సాలకు పాల్పడుతుంటాడు. కొంతకాలం తరువాత మళ్లీ మరో మహిళపై దారుణానికి ఒడిగడుతుంటాడు. ఎవరికీ అనుమానం రాకుండా రెండు నెలలకోసారి ఈ జంట మకాం మార్చేది. అందుకే ఇంట్లో పెద్దగా సామాన్లు కూడా పెట్టుకునేవారు కాదు. వీరి చేతికి చిక్కిన చాలామంది బాధితులు పరువు పోతుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయలేదు.’’ అని పోలీసులు వెల్లడించారు.


జులై 25న దుండిగల్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో 37 ఏళ్ల మహిళ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ఐడీఏ బొల్లారం వైఎస్సార్‌ కాలనీలో ఉంటున్న కురువ స్వామి అలియాస్‌ రవి(32), మసనమొల్ల నర్సమ్మ(30)ను పోలీసులు నిందితులుగా తేల్చి విచారణ జరుపుతున్నారు.