చిట్టీల వ్యాపారం పేరుతో చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలను నమ్మించి, ఐపీ పెట్టిన వ్యవహరం చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో వెలుగు చూసింది. ఏకాంబరకుప్పం గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి చిట్టీల వ్యాపారం చేస్తూ స్థానికులను నమ్మించాడు. ఏళ్ల తరబడి గ్రామంలో నివాసం ఉండడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు లక్ష రూపాయల నుంచి పది లక్షల వరకూ చిట్టీలు కట్టారు. ముఖ్యంగా స్ధానికంగా ఉన్న మధ్యతరగతి చేనేత కార్మికులను నమ్మించి, చిన్న స్థాయి నుంచి పెద్ద స్ధాయి వరకూ అందరితో చిట్టీలు కట్టించాడు. తక్కువ మొత్తంలో చిట్టీలు వేసిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వడంతో అరుణ్ కుమార్ పై స్ధానికులకు మరింత నమ్మకం కుదిరింది. దీంతో అతని వద్ద పెద్ద మొత్తంలో చిట్టీలు వేసేందుకు స్థానికులు ముందుకు వచ్చారు. అరుణ్ కుమార్ వారి నుంచి నెల నెల డబ్బులు కట్టించుకునేవాడు. చిట్టీల గడువు పూర్తై డబ్బులు తిరిగి చెల్లించమని భాస్కర్ ను స్థానికులు కోరారు. ప్రస్తుతం తన దగ్గర నగదు లేదని కొంత కాలం గడువు కావాలని అరుణ్ కుమార్ కోరాడు. కానీ వారికి సొమ్ము తిరిగి చెల్లించలేదు.


సుమారు 400 మంది నుంచి చిట్టీలు కట్టించున్న అరుణ్... డబ్బు తిరిగి చెల్లించకుండా వాయిదాలు వేస్తూ వచ్చాడు. ఇలా కొన్నాళ్ళు పొడిగించిన ఆయన...కొవిడ్ కారణంగా చెప్తూ వాయిదాలు వేస్తూ వచ్చాడు. చివరికి ఖాతాదారుల ఒత్తిడి ఎక్కువ అవడంతో వారికి ఈ నెల 26వ తేదీ వరకూ గడువు కావాలని కోరి.. ఖాతాదారుల సొమ్ము మొత్తం చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. ఇచ్చిన గడువు ముగియడంతో ఖాతాదారులు ఏకాంబరకుప్పంలోని కామరాజు వీధులో నివాసం ఉన్న అరుణ్ కుమార్ వద్దకు బాధితులంతా కలిసి వెళ్లగా..అతని ఇంటికి తాళ్ళం వేసి ఉంది. అతనిని ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించగా...ఫోన్ స్విచ్ఛ్ ఆప్ అని రావడంతో చిట్టీలు కట్టిన వారంతా ఆందోళనకు గురయ్యారు. అరుణ్ కుమార్ గురించి విచారించగా గత వారం రోజులుగా అరుణ్ కుమార్, అతని కుటుంబ సభ్యులు ఎవరు కనిపించడంలేదని, ఇళ్లు ఖాళీ చేశారని స్థానికులు తెలిపారు. దీంతో దిక్కు తోచని స్థితిలో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మొత్తం 80 మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత రెండు సంవత్సరాలుగా చిట్టీల రూపంలో అరుణ్ కుమార్ వద్ద తాము దాచుకున్న డబ్బును తిరిగి ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరారు. దీనిపై నగరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 


Also Read: Andhra Pradesh: జాతీయ డిజిటల్ టూరిజం మిషన్ లో ఏపీ సభ్య రాష్ట్రం..పర్యాటక రంగంలో డిజిటలైజేషన్ పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన కేంద్రం..