ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌లో స్కాం జరిగిందని దానికి బాధ్యుడంటూ సీఐడీ అరెస్ట్ చేసిన ఐఆర్‌టీఎస్ అధికారి కోగంటి సాంబశివరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్‌తో పాటు సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టేయాలని ఆదివారం సాంబశివరావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రైల్వే శాఖ ఉద్యోగిగా ఉన్న తనను కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే అరెస్ట్ చేశారని.. అదీ కూడా కుట్రపూరితంగా తనను సస్పెండ్ చేయాలన్న ఉద్దేశంతో అరెస్ట్ చేశారని సాంబశిరావు తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు.


Also Read : పరిషత్ ఎన్నికల్లో గెలుపుతో బాధ్యత మరింత పెరిగింది : జగన్


48గంటల్లో బెయిల్‌ తెచ్చుకోకపోతే తనను సస్పెండ్ చేస్తారని ఈ ఉద్దేశంతోనే సాక్ష్యాలు లేకపోయినా తనను అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విన్న ఉన్నత న్యాయస్థానం సాంబశివరావుకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌కు సంబంధించిన తొలి దశ టెండర్లను గత ప్రభుత్వ హయాంలో టెరా సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అక్రమంగా కట్టబెట్టారని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో కేసులు నమోదు చేసి మూడు రోజుల పాటు ఆయనను ప్రశ్నించి సీఐడీ శనివారం అరెస్ట్ చేసింది. 


Also Read : కేసీఆర్‌ గుడిని అమ్మేస్తున్న భక్తుడు ! దేవుడు కరుణించలేదా? పూజారి కనికరించ లేదా?


1997-బ్యాచ్‌ ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌కు చెందిన సాంబశివరావు 2015 జనవరి 28 నుంచి 2018 డిసెంబరు 10 వరకు డిప్యుటేషన్‌పై ఏపీ ప్రభుత్వంలో పనిచేశారు. 2015 జనవరి 29 నుంచి 2016 మార్చి 4 వరకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌కు వైస్‌ చైర్మన్‌, ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ పదవిని నిర్వహిస్తున్న సమయంలో  టెరాసాఫ్ట్‌ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు కట్టబెట్టడంలో సాంబశివరావు కీలకంగా వ్యవహరించారని సీఐడీ ఆరోపించింది. టెరాసాఫ్ట్‌ బిడ్‌ దాఖలు చేసేందుకే టెండర్ల గడువును పొడిగించారని.. టెరాసాఫ్ట్‌  సమర్పించిన ఫేక్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ను ఆయన ఆమోదించారని సీఐడీ తెలిపింది. ఆ ఫేక్‌ సర్టిఫికెట్‌ సరైందేనని ఒప్పుకోమని సిగ్నం డిజిటల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఒత్తిడి తెచ్చినట్టు ఆధారాలు సేకరించినట్లుగా సీఐడీ తెలిపింది. 


Also Read : డ్రగ్స్ కేసుల చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు ! వైట్ చాలెంజ్‌లో గెలుపెవరిది?
 
అయితే సీఐడీ ఆరోపణల్ని సాంబశివరావు తన క్వాష్ పిటిషన్‌లో నిజం కాదనిచెప్పారు. టెండర్‌ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం వివిధ స్థాయిల్లో కమిటీలను నియమించిందని.. ఉన్నతస్థాయి టెండర్‌ అప్రూవల్‌ కమిటీ ఆమోదంతోనే ప్రాజెక్టు అప్పగించామని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  టెండర్ల మదింపు విధానం పారద్శకంగా జరిగిందని .. అవినీతికి పాల్పడ్డామనే ఆధారాలు లేవన్నారు. 


Also Read : గుజరాత్ లో రూ.9వేల కోట్ల హెరాయిన్ పట్టివేత.. ఆ ముఠాకు విజయవాడతో సంబంధాలు