తెలంగాణ డ్రగ్స్ వ్యవహారంలో జరుగుతున్న వైట్ ఛాలెంజ్ రగడ నేపథ్యంలో అధికార విపక్షాల అగ్ర నేతల మధ్య పరస్ఫర ట్వీట్ల యుద్ధం జరుగుతోంది. తనపై వదంతులు, లేనిపోని అసత్యాలను ప్రచారం చేస్తూ తనను అప్రతిష్ఠపాలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సంబంధిత వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ‘‘ఉద్దేశపూర్వకంగా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. చట్టపరమైన చర్యలకు హైకోర్టును నేను ఆశ్రయిస్తున్నా. కోర్టులో పరువునష్టం దావా వేశా. దుష్ప్రచారం చేస్తున్న వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని అనుకుంటున్నా’’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.






రేవంత్-కేటీఆర్ మధ్య సాగుతున్న ట్విటర్ వార్ నేపథ్యంలో వైట్ ఛాలెంజ్ కోసం రేవంత్ రెడ్డి ఇప్పటికే సిద్ధమయ్యారు. రేవంత్ కేటీఆర్‌కు విసిరిన చాలెంజ్‌ నేపథ్యంలోనే రేవంత్ గన్‌పార్క్‌కు బయలుదేరారు. ఇప్పటికే కొండా విశ్వేశ్వర్ రెడ్డి గన్‌పార్క్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో కేటీఆర్ విసిరిన సవాల్‌కు రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతోందనే అంశంపై ఉత్కంఠ నెలకొని ఉంది.


మంత్రి కేటీఆర్‌ రక్త పరీక్షలు చేయించుకోవాలని, ఆయనతో డ్రగ్స్‌కు సంబంధం ఉందని రేవంత్ రెడ్డి తొలుత ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దమ్ముంటే ఆయన పరీక్షలు చేయించుకోవాలని వైట్ ఛాలెంజ్ పేరుతో సవాలు విసిరారు. దానిపై స్పందించిన కేటీఆర్ తాను సిద్ధమే అని, రాహుల్ గాంధీని కూడా తనతో వచ్చి ఢిల్లీ ఎయిమ్స్‌లో పరీక్షలు చేయించుకుందామని సవాలు విసిరారు. ఒకవేళ తనకు క్లీన్ చిట్ వస్తే రేవంత్ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పాలని, తన పదవులన్నింటినీ వదులుకోవాలని నిబంధన పెట్టారు. అంతేకాక, ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం కావాలని అన్నారు.


దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి తాను లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమేనని అన్నారు. అయితే, తనతో పాటు కేసీఆర్ కూడా రావాలని ఆయన తన సహారా కుంభకోణం, ఈఎస్ఐ కుంభకోణాల గురించి లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకోవాలని సవాలు విసిరారు. చివరికి ఈ వైట్ ఛాలెంజ్ వివాదం ఎక్కడికి దారి తీస్తుందోననే ఉత్కంఠ నెలకొంది.