ఊర్లో అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన పెద్దాయన తన దుర్బుద్ధి చాటుకున్నాడు. ఓ మహిళా డాక్టర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి పరువు తీసుకున్నాడు. అంతేకాక, డాక్టర్ తరపు బంధువులు కొడతారేమో అనే భయంతో ఇంటి నుంచి సైతం పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై నిర్భయ కేసుతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.
మొయినాబాద్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దళిత మహిళ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్‌ఎంపీ)గా స్థానికంగా ఓ చిన్న క్లినిక్ నడుపుతున్నారు. జ్వరం, జలుబు వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఆమె చికిత్స అందిస్తుంటుంది. అయితే, అదే గ్రామానికి చెందిన పాటి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వారం రోజుల క్రితం ఆరోగ్య సమస్య ఉందనే నెపంతో ఆమె క్లినిక్‌కు చికిత్స తీసుకున్నాడు. అనంతరం సందేహాలు ఉంటే ఫోన్ చేస్తానని ఆమె సెల్ ఫోన్ నెంబరు కూడా తీసుకుని కాల్ చేయడం, వాట్సప్‌లో సందేశాలు పంపడం ప్రారంభించాడు.
Also Read: ‘50 కోట్లతో ఆ సీటు కొన్నవ్.. దగుల్బాజీ, ఆడోళ్లు చీపుర్లు తిరగేస్తరు..’ మళ్లీ రెచ్చిపోయిన మంత్రి
ఆమె నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆయన ఈ నెల 17న మధ్యాహ్నం సమయంలో నేరుగా క్లినిక్‌కే వెళ్లాడు. ఆమెతో నేరుగా ‘నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను ప్రేమిస్తున్నా..’ అని నేరుగా చెప్పేశాడు. అంతటితో ఆగకుండా ఒక్క ముద్దిస్తే రూ.25 వేలు డబ్బులు ఇస్తానంటూ ఆశ పెట్టాడు. 5 నెలలపాటు క్లినిక్ షెట్టర్ అద్దె కూడా కడతానని చెప్పాడు. ఇంకా అసభ్యకరంగా మాట్లాడుతూ డాక్టర్‌ను వేధించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతణ్ని వదిలించుకున్న ఆమె ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది.
ఆమె అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులకు చెప్పగా వారు ఆగ్రహంతో అతని ఇంటికి నిలదీసేందుకు వెళ్లారు. కానీ, అప్పటికే అతను పరారయ్యాడు. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ప్రసాద్ రెడ్డిపై నిర్భయ కేసుతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, పట్టుకోవడానికి రెండు పోలీసు టీమ్‌ను ఏర్పాటు చేశామని స్థానిక పోలీసులు తెలిపారు.
Also Read: KTR: కేటీఆర్‌కి అరుదైన ఆహ్వానం, ఈ ఛాన్స్ అందరికీ రాదట..! థ్యాంక్స్ చెప్పిన మంత్రి