అసంఘటిత రంగంలో పని చేసే కార్మికుల ప్రయోజనం కోసం మోదీ ప్రభుత్వం ఇటీవల ఈ-శ్రమ్ (e-SHRAM) పేరుతో ఓ పోర్టల్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.2 లక్షల మేర యాక్సిడెంటర్ ఇన్సూరెన్స్ ప్రయోజనం కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ పోర్టల్‌ను ఆవిష్కరించిన నాలుగు వారాల్లోనే ఏకంగా కోటి మంది అసంఘటిత రంగ కార్మికులు ఇందులో నమోదు చేసుకోవడం విశేషం. ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన కింద ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ప్రయోజనం కవర్ కానుంది. 


ఈ ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్టర్ కావడం ద్వారా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించిన తొలి సంవత్సరం ప్రీమియంను కేంద్ర కార్మిక శాఖ చెల్లించనుంది. ఈ పథకం కింద ప్రీమియం చెల్లింపు ద్వారా ఏడాది పాటు ఆకస్మాత్తుగా మరణం సంభవించడం లేదా ఊహించని విధంగా అంగవైకల్యం రావడం వంటి పరిణామాలు ఎదురైతే రూ.2 లక్షల ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రీమియంను రెన్యువల్ చేసుకోవడం ద్వారా పథకాన్ని కొనసాగించవచ్చు. 


అంతేకాక, ఈ ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మూడు ప్రయోజనాలు వర్తించనున్నాయి. బీమా చేయించుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీగా పేర్కొన్న వ్యక్తికి రూ.2 లక్షలు రానున్నాయి. ఒకవేళ బీమా చేయించుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదంలో చేతులు లేదా కాళ్లు కోల్పోవడం లేదా కళ్లు పోవడం వంటి పరిణామాలు ఎదురైన పక్షంలో కూడా రూ.2 లక్షలు ఆ వ్యక్తికి అందుతాయి. ఒక వేళ ఒక కాలు లేదా ఒక చేయి లేదా ఒక కన్ను కోల్పోవడం వంటివి జరిగిన పక్షంలో రూ.లక్ష బీమా ప్రయోజనం పొందొచ్చు.


ప్రీమియం ఎంతంటే..
ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యాక ఈ పథకంలో భాగంగా చెల్లించాల్సిన ప్రీమియం ఏడాదికి రూ.12 మాత్రమే. ఈ పథకం ప్రతి సంవత్సరం ఆటోమెటిగ్గా రెన్యూ అవుతుంటుంది. ఈ పథకంలో చేరేందుకు కనీస వయసు పరిమితి 18 ఏళ్లు కాగా.. గరిష్ఠ పరిమితి 70 ఏళ్లుగా నిర్ణయించారు.


దేశ వ్యాప్తంగా 38 కోట్ల మంది..
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. దేశ వ్యాప్తంగా దాదాపు 38 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వీరందరినీ ఈ ఈ-శ్రమ్ పథకంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాక, అసంఘటిత రంగ కార్మికులను పథకంలో చేర్పించడం ద్వారా వాటి డేటా బేస్ కూడా ఏర్పడినట్లవుతుందని భావిస్తోంది. అసంఘటిత రంగ కార్మికులు ఈ ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు కావడం పూర్తిగా ఉచితం. ఏదైనా ఆన్‌లైన్ సేవల కేంద్రంలో గానీ, లేదా రాష్ట్ర కార్మిక శాఖ స్థానిక కార్యాలయాల్లో గానీ ఈ పోర్టల్‌ ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. అసంఘటిత రంగంలో పని చేసే ఏ కార్మికుడైనా ఈ పథకంలో చేరేందుకు అర్హులేనని ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో రిజిస్టర్ అయ్యే వ్యక్తి రాబడికి సంబంధించి కూడా ఎలాంటి పరిమితులు విధించలేదు. కానీ, ఇన్‌కం ట్యాక్స్‌లు చెల్లించే వ్యక్తి మాత్రం ఈ పథకానికి అర్హులు కారు.


ఇలా రిజిస్టర్ అవ్వొచ్చు
ఈ పోర్టల్‌లో చేరాలనుకున్న అసంఘటిత రంగ కార్మికులు ఎవరైనా eshram.gov.in వెబ్ సైట్‌లోకి లాగిన్ అయ్యి సులభంగా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇందులోనే బ్యాంకు ఖాతా వివరాలను కూడా పొందుపర్చాల్సి ఉంటుంది. ఎప్పుడైనా అవసరం ఉన్న సందర్భంలో లబ్ధిదారులకు నేరుగా నగదు ప్రయోజనాలు బదిలీ చేసే ఉద్దేశంతో బ్యాంకు ఖాతాలను కూడా జత చేస్తున్నారు.