ఐపీఎల్ రెండో అంచె ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. ముంబై ఇండియన్స్‌పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ రుతురాజ్ గైక్వాడ్(88: 58 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అద్భుత ఇన్సింగ్స్‌కు, రవీంద్ర జడేజా, బ్రేవోలు తోడవ్వడంతో చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 156 పరుగులు సాధించింది. ఓమోస్తరు లక్ష్యంతోనే బరిలోకి దిగిన ముంబై ఏదశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. చెన్నై బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ.. ఎక్కడా ముంబైని కోలుకోనివ్వలేదు. సౌరవ్ తివారీ(50: 40  బంతుల్లో, ఐదు ఫోర్లు) మినహా.. మిగతా ఏ బ్యాట్స్‌మెన్ రాణించకపోవడం జట్టుపై తీవ్రప్రభావం చూపింది. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 136 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఈ విజయంలో చెన్నై పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరింది.


ప్రారంభం పేలవంగా.. ముగింపు భీకరంగా..
చెన్నై ఇండియన్స్ తన ఇన్నింగ్స్‌ను అత్యంత పేలవంగా ప్రారంభించింది. మొదటి మూడు ఓవర్లలోనే డుఫ్లెసిస్(0), మొయిన్ అలీ(0), సురేష్ రైనా(4)ల వికెట్లను కోల్పోయిన చెన్నై, ఆరో ఓవర్లో ధోని(3) కూడా అవుట్ కావడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడింది. అప్పటికి జట్టు స్కోరు 24 పరుగులు మాత్రమే.


ఈ దశలో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(88: 58 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు), ఫాంలో ఉన్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(26, 33 బంతుల్లో, ఒక ఫోర్) జట్టును ముందుండి నడిపించారు. వీరు ఐదో వికెట్‌కు 81 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. అనంతరం క్రీజులోకి వచ్చిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ బ్రేవో(23, 8 బంతుల్లో, 3 సిక్సర్లు) వేగంగా ఆడాడు. దీంతోపాటు రుతురాజ్ గైక్వాడ్ కూడా గేర్ మార్చడంతో చివరి ఐదు ఓవర్లలో ఏకంగా 69 పరుగులు వచ్చాయి. ఒకదశలో 100 పరుగులు దాటుతుందా అన్న స్కోరు 20 ఓవర్లు దాటేసరికి 156-6కు చేరింది.  ముంబై బౌలర్లలో బౌల్ట్, మిల్నే, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు.


పరిస్థితులకు తగ్గట్లు రుతురాజ్ గైక్వాడ్ ఆడిన తీరు అద్భుతమనే చెప్పాలి. వికెట్లు పడే సమయంలో జాగ్రత్తగా ఆడుతూ, చివరికి వచ్చేసరికి విధ్వంసకారిగా మారిపోయాడు. 30 బంతులు దాటాక రుతురాజ్ గైక్వాడ్ స్ట్రైక్ రేట్ 210కు పైగా ఉండగా, 40 బంతులు దాటాక 228ని దాటేసింది. ఈ ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున యూఏఈలో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాట్స్‌మన్‌గా రుతురాజ్ నిలిచాడు.


ఒక్క మెరుపూ లేదు..
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మూడు బౌండరీలు కొట్టి టచ్‌లో కనిపించిన ఓపెనర్ డికాక్‌ను(17: 12 బంతుల్లో, మూడు ఫోర్లు) ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే దీపక్ చాహర్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతోపాటు అనంతరం మరో ఓపెనర్ అన్‌మోల్ ప్రీత్ సింగ్ (16: 14 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), సూర్యకుమార్ యాదవ్‌(3, 7 బంతుల్లో)లను కూడా వరుస ఓవర్లలో అవుట్ చేసి దీపక్, శార్దూల్ ముంబైని కష్టాల్లోకి నెట్టారు. వీరు అవుటయ్యే సరికి ముంబై స్కోరు 5.4 ఓవర్లకు 37 పరుగులు మాత్రమే.


అక్కడ నుంచి ముంబై ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. వరుస విరామాల్లో చెన్నై బౌలర్లు వికెట్లు తీస్తూ బ్యాట్స్‌మెన్‌ను అసలు కుదురుకోనివ్వలేదు. ఇషాన్ కిషన్ (11: 10 బంతుల్లో, ఒక ఫోర్)ను బ్రేవో, కీరన్ పొలార్డ్‌ను(15: 14 బంతుల్లో, ఒక ఫోర్, ఒక ఫోర్) హజిల్‌వుడ్ అవుట్ చేసి చెన్నై శిబిరంలో ఆనందం నింపారు. సమన్వయ లోపం కారణంగా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా(4: 5 బంతుల్లో) రనౌట్ అయ్యాడు. ఒక ఎండ్‌లో సౌరవ్ తివారీ(50: 40  బంతుల్లో, ఐదు ఫోర్లు)  బంతుల్లో, ఫోర్లు, సిక్సర్లు) స్థిరంగా ఆడుతున్నా.. అతనికి సహకారం అందించే వారే కరువయ్యారు. చెన్నై బౌలర్లలో బ్రేవో(25/3), దీపక్ చాహర్ (19/2) రాణించగా మిగతా వారు వీరికి చక్కటి సహకారం అందించారు.