గుంటూరు మున్సిపల్ కమిషనర్ చల్లా అనురాధ మాంసం దుకాణాలకు సంబంధించి ఓ ఆఫర్ ప్రకటించారు. మాంసం దుకాణాలకు వెళ్లే ముందు వినియోగదారులు.. సొంత జూట్ బ్యాగ్ లేదా క్లాత్ బ్యాగ్ తీసుకువెళ్తే.. మాంసం దుకాణంలో డిస్కౌంట్ ఉంటుందని ప్రకటించారు. ఈ రకంగానైనా.. ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ఆమె చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె మాంసం దుకాణ యాజమానులతో మాట్లాడారు.
గుంటూరులో పర్యావరణాన్ని కాపాడేందుకు ఇప్పటికే కమిషనర్ చల్లా అనురాధ అనేక చర్యలు తీసుకున్నారు. గుంటూరు పరిసరాల పరిశుభ్రం, పర్యావరణ పరిరక్షణ అంశాలపై పోటీలు కూడా నిర్వహించారు. నగరంలో ఇప్పటికే తడి పొడి చెత్త విభజన, హోం కంపోస్ట్ తయారీ కిచెన్, టెర్రస్ గార్డెన్స్ వంటి అంశాల్లో పలు చర్యలు తీసుకున్నారు.
మన గుంటూరు-స్వచ్చ గుంటూరు నినాదంలో భాగంగా.. ప్రజలకు అవగాహన కల్పించేదుకు పాటల పోటీలను కూడా నిర్వహించారు. నగరాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దటం, పరిశుభ్రత వల్ల ఉపయోగాలపై ఆమె అవగాహన కల్పిస్తున్నారు.
Also Read: AP Covid Cases: ఏపీలో కోవిడ్‌తో 18 మంది మృతి.. కొత్తగా 1,557 పాజిటివ్ కేసులు..
గుంటూరు నగరానికి సరఫరా అయ్యే తాగు నీటి విషయంలో కూడా ఆమె అత్యంత జాగత్త్రలు తీసుకుంటున్నారు. ల్యాబ్ లో సిబ్బంది ఎప్పటికప్పుడు విధుల్లో ఉండేలా చూడాలని, ఇతరులు ప్రాంగణంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఫిల్టర్ బెడ్స్ ని నిర్ధేశిత పద్ధతిలో శుభ్రం చేస్తుండాలని. ప్రతి రోజు కృష్ణా నది నుంచి వచ్చే నీరు, శుద్ధి చేసి నగరంలోని రిజర్వాయర్ లకు పంపింగ్ చేసే నీటి పరిమాణం, శుద్ధికి వినియోగించిన ఆలం, క్లోరిన్ వివరాలు కూడా క్రమపద్ధతిలో రిజిస్టర్ లో నమోదు చేయాలని గతంలోనే చెప్పారు.
అయితే ప్లాస్టిక్ తో పర్యావరణానికి కలుగుతున్న హాని కారణంగా తాజాగా.. మాంసం దుకాణాలకు జూట్ లేదా క్లాత్ బ్యాగ్ లాంటిది తీసుకెళ్తే డిస్కౌంట్ ఇస్తామని ప్రకటించారు.