కరోనా నుంచి రక్షణకు వ్యాక్సిన్ ఒక్కటే మన ముందున్న మార్గం. ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను టార్గెట్ చేసుకున్నారు సైబర్ మోసగాళ్లు. వ్యాక్సిన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని కృష్ణా జిల్లా ఉయ్యూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ముక్తేశ్వరరావు కేసు వివరాలు శనివారం వెల్లడించారు. కృష్ణా జిల్లా తోట్ల వల్లూరు మండలం దేవరపల్లికి చెందిన దేవరపల్లి అశోక్, కంకిపాడు మండలం కోలవెన్నుకి చెందిన కొడాలి విజయసాగర్‌లు తోట్లవల్లూరుకి చెందిన ఓ మహిళకు రుణం వస్తుందని మాయమాటలు చెప్పి ఆమెతో బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయించారు. ఆమె పాస్‌బుక్, ఏటీఎం కార్డు వీరి వద్దే ఉంచుకుని ఆ బ్యాంక్ ఖాతాను ర్యాపీ పే యాప్‌కు లింక్ చేశారు.
Also Read: YSR Death Anniversary: వైఎస్ కేబినేట్ మంత్రులకు విజయమ్మ ఆహ్వానం!... పిలుపుపై రాజకీయవర్గాల్లో చర్చ
మరో మహిళ ఖాతాకు బదిలీ
రెండు డోసుల కోవిడ్ టీకా తీసుకున్న వారికి ప్రభుత్వం నెలకు రూ.900ను బ్యాంక్ ఖాతాలో వేస్తుందని నమ్మబలికి తోట్లవల్లూరు, పమిడిముక్కల, నూజివీడు, ఉయ్యూరు మండలాల్లోని పలువురి ఆధార్ కార్డు నంబర్‌లు సేకరించారు. వారి వేలిముద్రలను తీసుకున్నారు. ఈ ఆధార్ నంబర్లను ర్యాపీ పే యాప్‌లో యాడ్ చేసి వాటి అనుసంధానమైన బ్యాంకు అకౌంట్‌లలో ఉన్న నగదు సదరు మహిళ అకౌంట్ కు బదిలీ చేశారు. ఇప్పటివరకు రూ.73 వేలు మహిళ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేశారు.
Also Read: Hindupuram Road Accident: పెళ్లింట విషాదం.. నాలుగు రోజుల్లో వివాహం... ఇంతలో ఘోరప్రమాదం
అకౌంట్లో నగదు మాయం
తన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు ఓ మహిళకు ఫోన్ కు మెసేజ్ వచ్చింది. లావాదేవీలు జరపకుండా తన అకౌంట్ నుంచి నగదు బదిలీ అవ్వడంతో అనుమానం వచ్చిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే విధంగా రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు దేవరపల్లి, కలవపాములలో ఇద్దరు చొప్పున, నూజివీడులో ఒకరు, పమిడిముక్కలలో నలుగురు మోసపోయినట్లు విచారణలో గుర్తించారు. సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వీరిని పమిడిముక్కలలో శనివారం అరెస్ట్ చేశారు. నిందితులు ఇద్దరూ గతంలో ఇదే తరహా నగదు మోసాలకు పాల్పడినట్లు సీఐ పేర్కొన్నారు.
Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్... ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు