పోలీసుల రిటైర్మంట్ ఫంక్షన్ మాదిరిగానే.. పోలీసు జాగిలాలకు కూడా పదవీ విరమణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నెల్లూరు జిల్లా పోలీస్ శాఖలో ఉన్న లక్కీ, సింధు అనే రెండు పోలీస్ జాగిలాల పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పదవీ విరమణ చేసిన అధికారులను ఎలా సన్మానిస్తారో.. అలాగే లక్కీ, సింధుని కూడా జిల్లా ఎస్పీ విజయరావు ఘనంగా సన్మానించారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు అవి చేసిన సేవలను కొనియాడారు. పోలీసు శాఖలో జాగిలాల సేవలు చిరస్మరణీయమని అన్నారు. 

Continues below advertisement


2012 నుంచి సేవలు.. 
"లక్కీ, సింధు అనే ఈ రెండు పోలీస్ జాగిలాలు 2012 నుండి డిపార్ట్‌మెంట్‌తో కలసి పనిచేస్తున్నాయి. జిల్లాకు ప్రముఖులు వచ్చిన సందర్భంలో, ఇతర బందోబస్తు డ్యూటీలు, నేరాల విచారణ సందర్భంలో వీటి సేవలను వినియోగించుకుంటారు. ప్రస్తుతం వయసు, నిపుణుల సూచనల రీత్యా వీటికి పదవీ విరమణ ఇస్తున్నాం" అని పోలీసులు తెలిపారు.  



Also Read: ఏపీలో స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. 4,097 వాహనాల ద్వారా చెత్త సేకరణ..


పేలుడు పదార్థాలను గుర్తించడంలో ఎక్స్‌పర్ట్..
"సింధు అనే జాగిలం 2011 జూలై 27న పోలీస్ శాఖతో కలసి ప్రయాణం మొదలు పెట్టింది. 10 సంవత్సరాల 5 నెలలు ఇది నెల్లూరు జిల్లా పోలీస్ విభాగంలో సేవలు అందించింది. పేలుడు పదార్ధాలను గుర్తించడంలో సింధు ఎక్స్‌పర్ట్. 2013లో నిర్వహించిన రిఫ్రెష్‌మెంట్ కోర్సులో సింధు రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. వీఐపీల పర్యటనల సమయంలో, అసెంబ్లీ సమావేశాల సమయాల్లో, టీటీడీ బ్రహ్మోత్సవాలు, కృష్ణా, గోదావరి పుష్కరాల సమయంలో కూడా సింధు విధుల్లో పాల్గొంది" అని పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లాలోని తడ వద్ద 3 నెలల క్రితం ఐఈడీలను సింధు కనుగొన్నదని ఎస్పీ విజయరావు వెల్లడించారు. 



Also Read: పవన్ టూర్ ఆపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు... టీడీపీ ప్రభుత్వంలో శ్రమదానం ఎందుకు చేపట్టలేదు.. పవన్ పై సజ్జల, బాలినేని కామెంట్స్


లక్కీ ట్రాకింగ్‌లో స్పెషలిస్ట్..
"లక్కీ అనే పోలీస్ జాగిలం ట్రాకింగ్‌లో స్పెషలిస్ట్. 2011 మార్చి 10న విధుల్లో చేరి, 10 సంవత్సరాల 8 నెలలు పోలీసు శాఖకు తన సేవలు అందించింది. 2013లో నిర్వహించిన రీఫ్రెష్‌మెంట్ కోర్సులో ట్రాకింగ్ విభాగంలో రాష్ట్రంలోనే లక్కీ మొదటి స్థానం సంపాదించింది. హత్యలు, దొంగతనాలు, డెకాయిట్, కిడ్నాప్ కేసులను లక్కీ ఛేదించింది" అని పోలీసులు తెలిపారు. సుమారు 18 హత్య కేసుల్లో లక్కీ ద్వారా నిందితుల్ని గుర్తించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎస్పీ విజయరావుతో పాటు, ఏఎస్పీ వెంకటరత్నం, డాగ్ స్వ్కాడ్ ఇన్ ఛార్జ్ నాగూర్ బాషా తదితరులు పాల్గొన్నారు.


Also Read: మంత్రి మేకపాటి ఇలాకాలో వైసీపీ వర్సెస్ వైసీపీ.. అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు..


Also Read: గుప్త నిధుల పేరుతో మోసం.. చివరకు హత్య.. నెల్లూరులో దారుణం..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి