తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు హాజరయ్యారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి సజ్జల రామకృష్ణ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన ఆయన...మహాత్మాగాంధీ ఒక యుగపురుషుడు అన్నారు. భారతీయుల మదిలో స్ఫూర్తిని రగిల్చారన్నారు. అనంతరం పవన్ పై మాట్లాడారు. కొవిడ్ నిబంధనలు అందరికీ సమానమే అన్న సజ్జల... ప్రజల ఆరోగ్యం కోసమే నిబంధనలు అమలుచేస్తున్నామన్నారు.
Also Read: మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?
టీడీపీ ప్రభుత్వ సమయంలో శ్రమదానం చేయలేదేం?
కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో బలప్రదర్శన సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అక్టోబర్‌లో కొవిడ్ పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారని తెలిపారు. పవన్ టూర్‌ని ఆపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్న సజ్జల... రోడ్ల గుంతలు జనసేన పూడ్చడమేమిటని ప్రశ్నించారు. రోడ్ల మరమ్మతులకు సీఎం జగన్ రూ.2,200 కోట్లు కేటాయించారని సజ్జల తెలిపారు. వర్షాలు తగ్గగానే రోడ్లు మరమ్మతులు చేస్తామని స్పష్టం చేశారు. టెండర్ల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. టీడీపీ హయాంలో రోడ్ల మరమ్మతులకు రూ.800 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఆ బిల్లులు కూడా వైసీపీ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. టీడీపీ ఐదేళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని గుర్తుచేశారు. పవన్ అప్పుడు ఏమయ్యారని సజ్జల ప్రశ్నించారు. టీడీపీ హయాం ఈ శ్రమదానాలు ఎందుకు చేపట్టలేదని మండిపడ్డారు.
Also Read: అమరావతిలో పవన్‌ను కలిసిన అగ్రనిర్మాతలు ! ఒంటరిని చేయలేదని క్లారిటీ ఇచ్చారా?
పవన్ పై బాలినేని తీవ్ర వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి బాలినేని శ్రీనివాస్ విమర్శలు చేశారు. ఇటీవల రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు పవన్ పై విరుచుకుపడ్డారు. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌కు దమ్ము ఉంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్నారు. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. 38 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకే ఒంటరిగా పోటీ చేసే దమ్ములేదన్నారు. ఎన్నికల్లో పొత్తు లేకుండా ఎప్పుడైనా టీడీపీ పోటీ చేసిందా? అని మంత్రి బాలినేని ప్రశ్నించారు.
Also Read: బూతులు తిడితే ఇక తాట తీయడమే .. రాజమండ్రిలో పవన్ మాస్ వార్నింగ్ !