ఒలింపిక్స్  గోల్డ్ మెడల్ విజేత.. నీరజ్ చోప్రా మాల్దీవుల్లో సెలవులను ఆనందంగా గడుపుతున్నాడు. ఒలంపిక్ క్రీడల తర్వాత.. నీరజ్ మాల్దీవులకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పుడూ జావెలిన్ ఆట గురించే.. నీరజ్ మాల్దీవుల్లోనూ స్కూబా డైవింగ్ చేస్తూ నీటిలోనే జావెలిన్ విసిరాడు. 23 ఏళ్ల ఈ ఆటగాడికి జావెలిన్ అంటే చాలా ఇష్టం. అదే ఆలోచనతో జావెలిన్ ను నీటి కింద విసిరాడు. ఈ వీడియోను నీరజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.


'అస్మాన్ పార్, జమీన్ పే, యా నీటి అడుగునా... నేను ఎల్లప్పుడూ జావెలిన్ గురించి ఆలోచిస్తాను.. శిక్షణ షురూ హో గై' అంటూ నీరజ్ పోస్టు చేశాడు. ఒలంపిక్స్ క్రీడలు ముగించుకుని.. వచ్చిన తర్వాత నీరజ్ చాలా బిజీబిజీ అయిపోయాడు. టోక్యో నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి వరుసగా పలువురు కేంద్ర మంత్రులను కలవడం, సన్మాన కార్యక్రమాల్లో పాల్గొనడం, తాజాగా ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనడం తర్వాతి రోజు మోదీ ఇచ్చిన విందులో పాల్గొనడం ఇలా వరుస కార్యక్రమాలతో నీరజ్ చోప్రా బిజీగా గడిపాడు. దీంతో అతడికి తగినంత విశ్రాంతి దొరకలేదు. ఈ కారణంగానే అతడు అస్వస్థతకు గురయ్యాడు.  కొంతకాలం రెస్ట్ తీసుకున్నాడు. భవిష్యత్ టోర్నమెంట్ల కోసం ఇప్పటికే శిక్షణ ప్రారంభించాడు నీరజ్. అయితే సెలవుల్లో భాగంగా విరామం కోసం మాల్దీవులకు వెళ్లాడు.






 


టోక్యో ఒలింపిక్స్‌కి వెళ్లే ముందు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నీరజ్ చోప్రాది 16వ ర్యాంకు. ఒలింపిక్స్ ఫైనల్లో అతడు ఈటెను ఏకంగా 87.58మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన, తనకంటే మెరుగైన క్రీడాకారులపై మంచి ప్రదర్శన చేసినందుకుగానూ నీరజ్ చోప్రా పెద్ద సంఖ్యలో పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తం 1315పాయింట్లతో ఏకంగా 14 స్థానాలు ఎగబాకి వరల్డ్ నెంబర్ 2గా నిలిచాడు. జర్మనీకి చెందిన జోహన్నెస్ వెటర్  1396 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పొలాండ్‌కు చెందిన మార్సిన్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్, జర్మనీకి చెందిన జూలియన్ వెబెర్ టాప్ -5లో నిలిచారు.   


ఒలింపిక్స్‌లో ఫైనల్ కోసం నిర్వహించిన అర్హత పోటీల్లో నీరజ్ అద్భుత ప్రదర్శన చేశాడు. దీంతో యావత్తు భారత్ అతడికి ఫైనల్లో పతకం ఖాయం అనుకున్నారు. అనుకున్నట్లుగానే నీరజ్ చోప్రా పతకం సాధించాడు. భారత్ తరఫున వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన రెండో అథ్లెట్‌గా నిలిచాడు.  టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించిన ఘనతతో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం ఆగస్టు 7న ‘జాతీయ జావెలిన్ త్రో డే’గా జరుపుకోవాలని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 


జావెలిన్‌ త్రోలో స్వర్ణంతో సత్తాచాటి అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా సాధించిన విజయం.. టోక్యో ఒలింపిక్స్‌లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పది అద్భుత సందర్భాల్లో ఒకటిగా చోటు దక్కించుకుంది. ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య ఈ జాబితాను ప్రకటించింది. 23 ఏళ్ల నీరజ్‌.. ఫైనల్లో జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరం విసిరి అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి పసిడి అందించిన సంగతి తెలిసిందే. అభినవ్‌ బింద్రా (2008) తర్వాత విశ్వ క్రీడల్లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన భారత క్రీడాకారుడు నీరజ్ చోప్రా.


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి


Also Read: Neeraj Chopra: నీరజ్ చోప్రాపై వరాల జల్లు... ఇప్పటి వరకు ఎవరెవరు ఏమేమి ఇస్తామని ప్రకటించారంటే..