టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ తరఫున బంగారు పతకం సాధించిన జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రాపై వరాల జల్లు కురిపించారు. దేశంలోని పలు ప్రభుత్వాలు, సంస్థలు డబ్బు, వాహన తదితరాలుగా వరాలు ప్రకటించారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఎవరెవరు నీరజ్‌కి కానుకలు ఏ రూపంలో ఎంత అందించారో ఓ లుక్కేద్దాం.

  


పంజాబ్ ప్రభుత్వం


పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్... నీరజ్ చోప్రా పతకం గెలవగానే రూ.2కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 






ఆనంద్ మహీంద్ర


ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర... నీరజ్ చోప్రా కోసం XUV 700 ఇవ్వనున్నట్లు తెలిపారు. రితేష్ అనే ఓ ట్విటర్‌ యూజర్‌ నీరజ్‌ చోప్రాకు మహీంద్ర కంపెనీ త్వరలో లాంచ్‌ చేయనున్న SUV శ్రేణికి చెందిన XUV 700ని ఇవ్వాలిసిందిగా కోరాడు. దీనికి స్పందించిన ఆనంద్ మహీంద్ర... ”తప్పకుండా ఇస్తానని ప్రకటించాడు. స్వర్ణం సాధించిన అథ్లెట్‌కు XUV 700 బహుమతిగా ఇవ్వడం తనకు ఎంతో గౌరవంగా ఉందని తెలిపారు. 






BCCI


భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన అథ్లెట్లందరరికీ నజరానా ప్రకటించింది. స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకి BCCI కోటి రూపాయల నగదు ఇవ్వనుంది. 






Indigo


ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో (Indigo) ఏడాది పాటు నీరజ్ చోప్రా తమ విమానాల్లో దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించొచ్చని ప్రకటించింది. 






హర్యానా ప్రభుత్వం


హర్యానా ప్రభుత్వం నీరజ్ చోప్రాకి ఏకంగా రూ.6కోట్లు నగదు బహుమతి ప్రకటించింది. అంతేకాదు క్లాస్ - 1 ప్రభుత్వ ఉద్యోగంతో పాటు, 50 శాతం రాయితీతో నివాస స్థలం కూడా ఇవ్వనున్నట్లు చెప్పింది.  


చెన్నై సూపర్ కింగ్స్


నీరజ్ చోప్రాకి IPL ఫ్రాంఛైజీ అయిన చెన్నై సూపర్ కింగ్స్ కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు 8758 నంబర్‌తో చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీని నీరజ్‌కి కానుకగా ఇవ్వనున్నట్లు ఆ జట్టు యాజమాన్యం తెలిపింది.