గుంటూరు నగరంలో గుట్టుగా ఓ అద్దె ఇంట్లో సాగుతున్న వ్యభిచార రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న నిర్వహకురాలు గతంలోనూ ఇలాంటి పనులు చేసి జైలుకు వెళ్లిందని, మళ్లీ అదే పనులు చేస్తుందని పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో జరిపిన సోదాల్లో ఓ నకిలీ పోలీసుతో పాటు, ఇటీవలే బీటెక్ పూర్తి చేసిన యువకుడు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇతను బీటెక్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్దామని అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గుంటూరు వెస్ట్ డీఎస్పీ సుప్రజ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. ముఠాను అరెస్టు చేసిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.
గుంటూరులోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. క్రోసూరు మండలానికి చెందిన ఓ మహిళ గుంటూరులో వ్యభిచారం నిర్వహిస్తోంది. ఈమెపై గతంలో నగరంపాలెం, అరండల్ పేట పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదు కాగా.. జైలుకు కూడా వెళ్లొచ్చింది. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. గుంటూరులోని ఏటీ అగ్రహారం ప్రాంతంలో మళ్లీ ఓ ఇంటిని అద్దెకు తీసుకొని యువతులను పిలిపించి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తోంది. గుంటూరు ఓల్డ్ సిటీ ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి అమ్మాయిలను సరఫరా చేయడంలో ఆ మహిళకు సహకరించాడు. అతని ద్వారా యువతులను రప్పించి మహిళ వ్యభిచారం నిర్వహిస్తోంది. ఓ యాప్ ద్వారా విటులను ఆకర్షించి మహిళ ఈ హైటెక్ వ్యభిచార దందా నడుపుతోంది.
నకిలీ పోలీసు అవతారం
మరోవైపు, గుంటూరులోని భవానీపురానికి చెందిన పుట్టపాకుల నాగరాజు అలియాస్ పండు అనే డ్రైవర్‌ను ఈ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఇతను కొన్నాళ్ల క్రితం ఓ డీఎస్పీ యాత్రలకు వెళుతున్న సమయంలో కొద్ది రోజులు డ్రైవర్‌గా పని చేశాడు. అప్పుడు పోలీసుల మధ్య మాటలు, వాళ్లు ప్రవర్తించే తీరు తెలుసుకున్నాడు. ఈ క్రమంలో ఏటీఅగ్రహారంలోని ఇంట్లో గుట్టుగా వ్యభిచారం జరుగుతుందని తెలుసుకున్న ఈయన నిర్వహకురాలి వద్దకు వెళ్లి తాను పోలీసునని బెదిరించడం మొదలుపెట్టాడు.
నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నానని నమ్మబలికి.. నెలకు రూ.5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే పోలీసు ఉన్నతాధికారులకు గుట్టంతా చెప్పి అరెస్టు చేయిస్తానని బెదిరించాడు. దీంతో నిర్వహకురాలు అతను అడిగినంత డబ్బు ఇస్తోంది. ఈ క్రమంలో అందిన సమాచారంతో నగరంపాలెం పోలీసులు సిబ్బందితో వెళ్లి తనిఖీలు చేయగా.. వ్యభిచార గుట్టు బయటపడింది. వ్యభిచార నిర్వహకురాలితో పాటు ముగ్గురు మహిళలు, ఓ విటుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో డబ్బులు గుంజేందుకు వచ్చిన నకిలీ పోలీసు నాగరాజును కూడా పోలీసులు అరెస్టు చేశారు.
వ్యభిచార గృహంలో ఉన్న ముగ్గురు మహిళలను పోలీసులు పునరావాస కేంద్రానికి తరలించారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విటుడు రేపల్లెకు చెందిన బీటెక్ పూర్తి చేసిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. అతను మరికొద్ది రోజుల్లో పై చదువులకు అమెరికా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. యాప్ ద్వారా యువతులను గుర్తించి గుంటూరుకు వచ్చి వ్యభిచార గృహంలో దొరికిపోయాడు. ఇతను గదిలో ఓ మహిళతో ఉండగా పోలీసులు అరెస్టు చేశారు.