భారతీయ జనతాపార్టీ,  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  మధ్య ఇప్పుడు ఓ కొత్త రకం వార్ నడుస్తోంది. విషయం ఏపీకి చెందిందే అయినా ఎక్కువుగా నేషనల్ మీడియాలోనే హైలెట్ అవుతోంది. అదేంటంటే...మాతో పొత్తు కోసం మీరు ప్రయత్నించారంటే.. కాదు మీరు ప్రయత్నించారని ఇద్దరూ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం. మీతో పొత్తుల కోసం వెంపర్లాడే దీన స్థితిలో మేం లేం అని ఇద్దరూ ఒకే రకమైన స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ఈ పొత్తుల పంచాయతీ ఏమిటి అన్నది ఇతర పార్టీల నేతల్లో చర్చనీయాంశంగా మారింది .


కేబినెట్ పునర్వవ్యవస్థీకరణ పూర్తయిన తరవాత "ఆఫర్ల"పై చర్చలు..!


కేంద్రమంత్రివర్గ విస్తరణ జరిగి చాలారోజులయింది. ఆ విస్తరణ కసరత్తు జరుగుతున్న సమయంలో ఏపీ నుంచి ఎవరికి మంత్రి పదవి వస్తుందా అన్న చర్చలు మీడియాలో జరిగాయి. కొన్నాళ్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరు వినిపించింది. చివరికి వచ్చే సరికి సీఎం రమేష్, జీవీఎల్ నరసింహారావు పేర్లుకూడా వినిపించాయి. కానీ ఎవరికీ పదవులు రాలేదు. కానీ వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా..  బీజేపీ ఎన్డీఏ కూటమిలోకి వైఎస్ఆర్‌సీపీని ఆహ్వానించిందని.. అయితే జగన్ మాత్రం ఆలోచిస్తున్నారని కొన్ని మీడియా సంస్థలు ప్రకటించేవి. అదే తరహాలో మంత్రివర్గ పునర్వవస్థీకరణ పూర్తయిన చాలా రోజుల తర్వాత బీజేపీ మమ్మల్ని మంత్రివర్గంలో చేరమని బతిమాలింది కానీ మేమే తిరస్కరించామని వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఓ ఇంగ్లిష్ పత్రికతో మాట్లాడారు. అంతే అక్కడే నిప్పురాజుకున్నట్లయింది.


బీజేపీ పిలిచిందన్న విజయసాయి... అలాంటి  గతి పట్టలేదన్న బీజేపీ..!


అసలు మంత్రివర్గ పునర్వవస్థీకరణ అయిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడెందుకు విజయసాయిరెడ్డి పొత్తు మాటలు మాట్లాడుతున్నారన్నది ఎక్కువ మందికి అర్థంకాదు కానీ... దానికో రీజన్ ఉందని ఇతరపార్టీల నేతలు అంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం  వైసీపీ  తప్పుల్ని క్షమించే పరిస్థితిలో లేదు. ముఖ్యంగా ఆర్థికపరమైన తప్పుల్ని భరించడం లేదు. మరో వైపు అప్పులకు సహకరించడానికి సిద్ధంగా లేదు . దీంతో బీజేపీపై ఒత్తిడి పెంచడానికి.. కేంద్రం చేస్తున్న అప్పులపై విమర్శలు చేస్తున్నారు. పనిలో పనిగా... తమను బీజేపీ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తోందని.. దానికి కారణం తాము కేబినెట్‌లో చేరకపోవడమేనన్న అభిప్రాయం కూడా కల్పించడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 


ఎన్డీఏలో వైఎస్ఆర్‌సీపీపై చర్చలు నిజంగానే జరిగాయా..?


భారతీయ జనతాపార్టీకి వైసీపీ వ్యూహం అర్థం అయిందేమో కానీ  వ్యూహాత్మకంగా స్పందించింది. అసలు వైసీపీతో పొత్తు .. లేదా కేబినెట్‌లోకి వైసీపీ అనే ప్రస్తావన.. చర్చ అసలు ఎప్పుడూ బీజేపీలో లేదని ఆ పార్టీ ఏపీ వ్యవహారాల సహ ఇంచార్జ్ సునీల్ ధియోధర్ చెబుతున్నారు. విజయసాయిరెడ్డి చెబుతున్న మాటలు శుద్ధ అబద్దమని అంటున్నారు. వైసీపీనే కేంద్రమంత్రి పదవుల కోసం ఆరాటపడిందని కానీ బీజేపీనే దగ్గరకు రానివ్వలేదనితేల్చేస్తున్నారు. ఆయన కూడా ఇంగ్లిష్‌మీడియాతోనే ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు సమయం సందర్భం లేకుండా రెండు పార్టీల నేతలు లేని పొత్తుల గురించి పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరమేంటో ఇతర పార్టీల నేతలకు అర్థం కావడం లేదు. అదే రాజకీయం అంటే... ఎవరికీ అందకుండా వ్యుహారాలతో రాజకీయం చేయడమే నేర్పరితనం. విజయసాయిరెడ్డి, బీజేపీ అదే చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.