పీఆర్సీ విషయంలో ఏపీలో జరుగుతున్న రగడ కొత్త మలుపు తిరిగింది. నిన్న మొన్నటి వరకు నిరసనలతో సరిపెట్టిన ఉద్యోగులు ఈరోజు నుంచి ప్రత్యక్ష కార్యాచరణకు దిగారు. ముందుగా ఉపాధ్యాలు ఉద్యమాన్ని లీడ్ తీసుకున్నారు. ఉపాధ్యాయ వర్గాలు ఉద్యమంలో ముందు వరసలో నిలబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ లను చుట్టుముట్టారు ఉపాధ్యాయులు. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య.. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ ముట్టడి కార్యక్రమం జరిగింది. అయితే కలెక్టరేట్ ల ముట్టడికి బయలుదేరిన ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లకి తరలించారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉపాధ్యాయుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు. దీంత కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమపై ప్రభుత్వం దౌర్జన్యం చేయడం సరికాదని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హక్కులకోసం డిమాండ్ చేస్తుంటే అణగదొక్కాలని చూడటం మంచి పద్ధతి కాదని అంటున్నారు.
జీవోల రద్దుకి డిమాండ్..
హెచ్ఆర్ఏ ను తగ్గిస్తూ జారీ చేసిన జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జీవోలు రద్దు చేసే వరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళే ప్రసక్తే లేదని అంటున్నారు నేతలు. డీఏలను కూడా జీతంలో సర్దుబాటు చేయడం ఉద్యోగులను మోసం చేయడమేనంటున్నారు. 10 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని సీఎస్ చెప్పిన లెక్కలన్నీ బోగస్ అని విమర్శించారు. కేంద్ర పే స్కేలును అమలు చేసే హక్కు ప్రభుత్వానికి లేదని, తమ అంగీకారం లేకుండా ప్రభుత్వం నిర్ణయం ఎలా తీసుకుంటుందన్నారు.
ఉద్యమ బాటలో.. ఏపీ ఎన్జీవోలు, ఉపాధ్యాయులు
పీఆర్సీ జీవో కాపీలను ఏపీఎన్జీవో సంఘాలు దగ్దం చేశాయి. జీతాల కోతను అంగీకరించేది లేదంటున్నారు మహిళా ఉద్యోగులు. ఏపీ ఎన్జీవో మహిళా ఉద్యోగులు ఈ రివర్స్ పీఆర్సీ తమకు వద్దు అంటున్నారు. డీఏలను కలుపుకుని జీతం లెక్క పెట్టడం కరెక్ట్ కాదని, ఇంటి అద్దె లు పెరుగుతుంటే ప్రభుత్వం హెచ్ఆర్ఏ తగ్గించటం ఏంటని మండిపడ్డారు. ఉద్యోగులు రోడ్ల మీద గుడిసెలు వేసుకుని ఉండాలని ప్రభుత్వం భావిస్తోందా అని ప్రశ్నిస్తున్నారు. చర్చల సమయంలో హెచ్ఆర్ఏ తగ్గిస్తాం, సీసీఏ రద్దు చేస్తామనే విషయాలు చెప్పలేదంటున్నారు.
ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఈరోజు అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ ల ముట్టడికి పిలుపునిచ్చింది. ఇటు నెల్లూరు జిల్లాలో కూడా ఇప్పటికే ఉద్యోగ సంఘాల నేతలు కలెక్టరేట్ కి చేరుకున్నారు. ఆందోళన మొదలు పెట్టారు. ప్రభుత్వం ఇచ్చిన G.O లను రద్దు చేయాలని కోరుతున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ ఈ నిరసనల్లో పాల్గొని ప్రభుత్వానికి తమ వ్యతిరేకత తెలియజేయాలంటున్నారు నేతలు.
Also Read; సమ్మెలోకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు.. 21న సీఎస్‌కు నోటీసు !
Also Read: కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది.. కొత్త పీఆర్సీతో జీతాలు తగ్గవు
Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.