ఏపీలో చింతామణి నాటక ప్రదర్శనను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నాటకం గురించి బాగా తెలిసినవారు, నాటకం ద్వారా సమాజంలో చైతన్యం వచ్చిందని నమ్మినవారు, నాటకాన్ని ఆడిన వారు, అభిమానించినవారు చాలామంది తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకి చెందిన చాంద్ భాషా.. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర ద్వారా అందరికీ సుపరిచితులు. నాటకం ప్రదర్శనను నిషేధించడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. 


పరస్త్రీ వ్యామోహం పతనానికి నాంది అనే గొప్ప సందేశంతో వచ్చిన చింతామణి నాటకం.. దృశ్య రూపంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాలలో కూడా అద్భుత ఆదరణ చూరగొందని చెబుతున్నారు చాంద్ భాషా. చింతామణి నాటకంలో 130 సార్లకు పైగా సుబ్బిశెట్టి పాత్ర పోషించిన చాంద్ భాషా .. రచయిత రచించిన మూల కథాంశంలో ఎక్కడ వ్యంగ్యంగా అర్ధాలు వచ్చే పదాలు లేవని కొన్ని  ప్రాంతాలలో ప్రదర్శించే సమయంలో అక్కడి ప్రజల శైలిని బట్టి కొన్ని చోట్ల అత్యుత్సాహంతో పాత్రధారులు చెప్పే మాటలు హావభావాలను బట్టి సుబ్బిశెట్టి అనే పాత్ర అలా కనిపించి ఉండవచ్చు అని చెపుతున్నారు. 




ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ నాటకరంగంపై ఆసక్తితో తాను ఆత్మకూరు చెందిన  శ్రీరామ నాట్యమండలి ఆధ్వర్యంలో 130 సార్లు సుబ్బిశెట్టి పాత్ర ను పోషించానని చెబుతున్నారు. ఎప్పుడు ఏ రోజూ ఎక్కడా కూడా ఏ ఒక్క పదం ద్వంద్వార్థం వచ్చేలా చెప్పలేదని అన్నారు. చింతామణి నాటకంలో ఏడెనిమిది పాత్రలున్నాకూడా ప్రజలు సుబ్బిశెట్టి పాత్రనే ఎక్కువగా అభిమానిస్తారని అన్నారు. ఆ పాత్రను ప్రజలు ఎంతో ఉత్సాహంగా సంతోషంగా  వీక్షించేవారని, గౌరవప్రదంగా తమ నటనను ప్రజలు స్వీకరించారని తెలిపారు. 


ప్రతి నాటకంలో కూడా ఒకటి రెండు పాత్రలు ఇటువంటి హాస్యం పండించేలా ఉంటాయని, ఏ ఒక్క కులాన్ని గాని వర్గానికి కానీ నాటకాల్లో తక్కువ చేసి చూపించేలా రూపొందించరని, నటించరని తెలిపారు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ నాటక ప్రదర్శన పై అభ్యంతరం వ్యక్తం చేయలేదని అన్నారు. అభ్యంతరం ఉన్న సన్నివేశాలపై చర్చించి వాటిని తొలగించమని సూచిస్తే బాగుండేదని పూర్తిగా నాటకాన్నే రద్దు చేయడం బాధాకరమని ఆయన తెలిపారు. పాత్రలపై అభ్యంతరం వ్యక్తం చేయాలంటే.. అన్ని నాటకాలతో పాటు సినిమాలు, సీరియల్స్ ఏవీ కూడా  ప్రదర్శనకు నోచుకోలేవని చాంద్ భాషా తెలిపారు. తాము పోషించే ప్రతి పాత్ర తనకు దైవంతో సమానం అని అన్నారాయన. కళాకారులు వారి నటనను ఆస్వాదించాలి కానీ కులాలతో  పోల్చుతూ పూర్తి నాటకాన్నే తప్పు పట్టడం, రద్దు పరచడం  సరి కాదని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కోరారు. నాటక రంగంపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయని, అటువంటి వారికి  పొట్ట కొట్టే విధంగా ఈ నిర్ణయం ఉందని చెప్పారు. 


ఆర్డోవోకి వినతిపత్రం.. 
చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని కోరుతూ.. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన శ్రీరామ నాట్యమండలి అధ్యక్షులు సోమా వెంకటసుబ్బయ్య, ఉపాధ్యక్షుడు షేక్ చాంద్ బాషా, కళాకారుల సంక్షేమ సంఘ కార్యదర్శి షేక్ షుకూర్, ప్రజానాట్యమండలి కళాకారుడు గద్ద ర్ బాబు, శ్రీరామ నాట్యమండలి సభ్యుడు దేవరపాటి చిన్నబాబు, మెజీషియన్ బాషా తదితరులు ఆర్డీవో చైత్రవర్షిణికి వినతిపత్రం అందించారు. కళాకారుల పొట్ట కొట్టొద్దని, చింతామణి నాటకాన్ని ప్రదర్శించేందుకు అనుమతించాలని కోరారు.