"నెల్లూరు జిల్లాలో థర్డ్ వేవ్ లో ఒక్క మరణం కూడా నమోదు కాకూడదు, జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలి" అంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొవిడ్ సమీక్షలో స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే  ఆయన ఆ మాటిచ్చిన మరుసటి రోజే జిల్లాలో కరోనా మరణం నమోదైంది. మంత్రి ఆశావహ దృక్పథంతో ముందుకెళ్దామని చెప్పారు కానీ, కరోనా తీవ్రతతో ఓ వ్యక్తి చనిపోవడం విచారకరం. 


జిల్లాలో పెరుగుతున్న కేసులు.. 
నెల్లూరు జిల్లాలో 15 రోజుల క్రితం రోజువారీ కేసుల సంఖ్య స్వల్పంగా ఉండేది. రోజుకి 10 నుంచి 20లోపు మాత్రమే కేసులు నమోదయ్యేవి. అయితే ఇటీవల కేసుల సంఖ్య సెంచరీ, డబుల్ సెంచరీ కూడా దాటిపోయింది. తాజాగా 200 నుంచి 300 లోపు రోజువారీ కేసుల సంఖ్య నమోదవుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. జిల్లాలో నైైట్ కర్ఫ్యూని పక్కాగా అమలు చేస్తున్నారు. దాదాపుగా మరణాల సంఖ్య తగ్గుతుంది అనుకున్న టైమ్ లో మళ్లీ నెల్లూరులో కరోనా మరణం కలకలం రేపుతోంది. 


హోం ఐసోలేషన్లో బాధితులు.. 
కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో.. స్వల్ప లక్షణాలున్నా ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్నారు. అయితే వీరందరికీ స్వల్ప లక్షణాలుండటంతో వైద్యులు ఇన్ పేషెంట్లుగా వారిని చేర్చుకోడానికి ఆసక్తి చూపించడంలేదు. కొవిడ్ పరీక్షలు నిర్వహించి హోమ్ ఐసోలేషన్లో ఉండమని చెబుతున్నారు. అదే సమయంలో హోమ్ ఐసోలేషన్ కిట్ల సంఖ్య కూడా తగినంత అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 


ప్రస్తుతం వస్తున్న రోగుల పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఉండడం లేదనీ, ఆక్సిజన్‌ లెవల్స్‌ మెరుగ్గా ఉంటున్నాయనీ, కేవలం జలుబు దగ్గు లక్షణాలు ఉండడంతో కొన్ని రకాల మందులను అందజేస్తున్నట్లు చెబుతున్నారు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిని మాత్రమే ఆసుపత్రిలో చేర్చుకొని అవసరమైన మందులను ఇస్తున్నట్లు తెలిపారు.


సిబ్బంది లేకపోవడంతో.. 
మరోవైపు ఆస్పత్రి సిబ్బందిలో కూడా కొంతమంది స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ వార్డుల్లో పనిచేసే సిబ్బంది కొరత కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా హోం ఐసోలేషన్‌ కిట్ల విభాగం వద్ద సిబ్బంది కనిపించడంలేదనే ఆరోపణ ఉంది. ఫార్మాసిస్ట్ లు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్‌ నర్సులే మందులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దీనికితోడు కిట్లు కూడా సరిగా అందుబాటులో లేవని అంటున్నారు. దీంతో మందులకోసం వచ్చిన రోగులు ఇబ్బంది పడుతున్నారు. కేవలం పారాసిట్మాల్ మాత్రమే ఇస్తున్నారని, విటమిన్ ట్యాబ్లెట్లు ఇవ్వడం లేదని అంటున్నారు. మొత్తమ్మీద గతంలో కంటే ఇప్పుడు కొవిడ్ లక్షణాలు, తీవ్రత తక్కువగా ఉండటంతో కేసులు పెరుగుతున్నా.. దాని ప్రభావం పెద్దగా కనిపించడంలేదు.