కరోనా కారణంగా ఎంతో నష్టపోవాల్సి వచ్చిందని.. సీఎస్ సమీర్ శర్మ చెప్పారు. ఓ వైపు కరోనాతో పోరాడుతుంటే.. మరో వైపు కొత్త వేరియండ్ ఒమిక్రాన్ వచ్చిందన్నారు. ఈ రెండు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. వీటిని  బాలన్స్  చెయ్యడం వల్ల  ఆర్థిక పరిస్థితిపై ప్రభావం  పడుతోందన్నారు. ఉద్యోగుల జీతాల పై  ఆర్థిక వ్యవస్థ ప్రభావం ఎక్కువగా ఉందన్నారు.
థర్డ్‌వేవ్‌ కారణంగా.. మరింత నష్టం జరిగే పరిస్థితి కనబడుతుందని సమీర్ శర్మ వ్యాఖ్యానించారు. ఏపీలోనే ఉద్యోగుల జీతాల బడ్జెట్‌ ఎక్కువగా ఉందన్నారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు బ్యాలెన్స్‌ చేసుకోవాలన్నారు. కరోనా కష్ట​కాలంలో కూడా ఉద్యోగులకు ఐఆర్‌ ఇచ్చామని సమీర్ శర్మ అన్నారు. 


కరోనా వైరస్ లేకుండా ఉంటే.. రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేదని.. పీఆర్సీ ఆలస్యం అవుతుందనే ఐఆర్‌ ఇచ్చామని సమీర్ శర్మ చెప్పారు. కరోనా కారణంగా రాష్ట్ర రెవెన్యూ రూ.62 వేల కోట్లే ఉందన్నారు. కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆదాయం పడిపోయిందని సమీర్ శర్మ అన్నారు. కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవని సీఎస్ స్పష్టం చేశారు.


గతంలో సీఎం ఏమన్నారంటే.. 
ఉద్యోగులకు వీలైనంత మేలు చేసేందుకు పీఆర్సీ నిర్ణయాలు తీసుకున్నామని గతంలోనే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.  రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ సంక్లిష్ట సమస్యలు, కోవిడ్‌ కారణంగా తలెత్తిన ప్రతికూల పరిస్థితులు వంటి వాటిపై విస్తృతంగా చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నామన్నారు. 14.29 కంటే ఎంత మాత్రం కూడా ఇచ్చే పరిస్థితిలేదనే విషయాన్ని పదేపదే ఆర్థికశాఖ అధికారులు పలుదఫాలుగా చెప్పినా దాదాపుగా తొమ్మిది శాతం ఎక్కువగా ఖరారు చేస్తున్నామని తెలిపారు.  ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఒక భాగం, సంక్షేమం, అభివృద్ధి సంతృప్తికరంగా అందాలంటే.. ఉద్యోగుల సహాయ సహకారాలతోనే సాధ్యమన్నారు.


సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 14.29శాతం మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను, సమస్యలను అన్నికోణాల్లో క్షుణ్నంగా అధ్యయనం చేసి ఒక వాస్తవికమైన ఫిగర్‌ను వారు చెప్పినప్పటికీ....అటు ఉద్యోగుల ఆకాంక్షలను, ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని, ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో ఫిట్‌మెంట్‌ను 23శాతంగా నిర్ణయించామని సీఎం జగన్ గతంలోనే చెప్పారు. అధికారుల కమిటీ చెప్పిన 14.29శాతం కన్నా దాదాపు 9శాతం పెంచి ఫిట్‌మెంట్‌ ఇస్తున్నామని ఉద్యోగులు అర్థం చేసుకోవాలన్నారు.  ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి రూ. 10,247 కోట్లు రాష్ట్ర ప్రభుతానికి అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని, ఈ బాధ్యతను స్వీకరిస్తున్నానని తెలిపారు.  మీ అనుభవాన్ని ఈ రాష్ట్రానికి ఆస్తిగా భావించి, అన్నిరకాలుగా మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో, మీ సేవలన్ని మనం మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలన్న నిర్ణయంతో... రిటైర్‌మెంట్‌ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతున్నామని ఉద్యోగులకు జగన్ తెలిపారు. 1.1.2022 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నామని  ప్రకటించారు.


Also Read: AP PRC : ఏపీ పీఆర్సీ జీతాలు పెరుగుతాయా ? తగ్గుతాయా ? - పెన్షనర్లకు లాభమా ? నష్టమా ? ... ఏ టూ జడ్ ఎనాలసిస్ ఇదిగో..


Also Read: AP Employees : పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకుంటేనే చర్చలు.. ఉద్యమం ఖాయమంటున్న ఏపీ ఉద్యోగులు !