కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు సాయం చేసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న ఆంధ్రప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను వర్చువల్‌గా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.యాభై వేల పరిహారం ఇస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఆ మేరకు రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చింది. నిధులను కూడా కేటాయించింది.
అయితే కొన్ని రాష్ట్రాలు చురుగ్గా కరోనా మృతుల కుటుంబాలను ఆదుకున్నప్పటికీ కొన్ని రాష్ట్రాలు మాత్రం ఆదేశాలు.. దరఖాస్తులతోనే సరి పెట్టాయి. ఇంత వరకూ ఎవరికీ పరిహారం ఇవ్వలేదు. ఈ రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్, బీహార్ ఉన్నాయి. పరిహారం ఇవ్వడం లేదని కొంత మంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పరిహారం ఎందుకు చెల్లించలేదో సరైన కారణం చెప్పలేకపోవడంతో జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.
Also Read: 'టెలిప్రామ్టర్ కూడా మీ అబద్ధాలు తట్టుకోలేకపోయింది..' మోదీపై రాహుల్ సెటైర్
ఏపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన ప్రధాన కార్యదర్శులు కోర్టు ముందు హాజరుకావాలని, పరిహారం ఎందుకు ఇవ్వలేదో వివరణ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. అయితే ధరఖాస్తుల సమయంలోనే అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ఎలా ధరఖాస్తు చేసుకోవాలో కూడా స్పష్టత లేకుండా పోయింది.