ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన సీఎం జగన్ జనవరి నెల నుంచే కొత్త పీఆర్సీ అమలు అంటూ హామీ ఇచ్చారు. దానితో పాటే పెండింగ్ డీఏలు అన్నీ క్లియర్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే, అత్యంత కీలకమైన హెచ్ఆర్ఏపై మాత్రం ఎలాంటి ప్రకటనా చెయ్యలేదు. దానితో హెచ్ఆర్ఏ ఎవరికెంతో తేలకుండా జీతాలు ఎలా ఇస్తారు అన్న అనుమానాలు ఉద్యోగుల్లో మొదలయ్యాయి. వీటిపై స్పష్టత లేకుండా ఈ నెల జీతాల బిల్లులు ఏ ప్రాతిపదికన రెడీ చేస్తారు అన్నదానిపైనా స్పష్టత రాలేదు. దానికితోడు ఉద్యోగుల్లో హెచ్ఆర్ఏ తగ్గిస్తారంటూ జరుగుతున్న ప్రచారం దృష్ట్యా.. దానిపై ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రకటనా వద్దంటూ ఉద్యోగ సంఘ నాయకులే ప్రభుత్వాన్ని కోరారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు కొత్త పీఆర్సీతో ఈ నెల జీతాలు ఫిబ్రవరికి అందేనా అనే అనుమానాలు ఉద్యోగుల్లో ఎక్కువవుతున్నాయి.
హెచ్ఆర్ఏ తగ్గించాలంటున్న ప్రభుత్వ కమిటీలు
ఏపీ విభజన తర్వాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్‌లోనే రాజధానిగా పనిచేసుకోవచ్చు అని కేంద్రం చెప్పినా అప్పటి ప్రభుత్వం అధిక హెచ్ఆర్ఏ, వారంలో ఐదు రోజుల పనీ అంటూ ఉద్యోగులను ఏపీకి రప్పించింది. అప్పటి నుండీ వారికి హెచ్ఆర్ఏ రూపంలో భారీగానే అలవెన్సులు అందుతున్నాయి. అయితే, ప్రస్తుత ప్రభుత్వం నియమించిన సీఎస్ కమిటీ ప్రస్తుతం ఉద్యోగులు అందుకుంటున్న హెచ్‌ఆర్‌ఏను భారీగా తగ్గించాలని సిఫారసు చేసింది. రూ.5 లక్షల నుంచి 50 లక్షల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో హెచ్‌ఆర్‌ఏను 16 శాతంగా నిర్ణయించింది. అయితే ఏపీలో విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి, ఇంకా ఒకట్రెండు నగరాల్లో తప్ప 5 లక్షలపైన జనాభా గల నగరాలు లేవు. అంటే కేవలం 10 శాతం ఉద్యోగులకు మాత్రమే 16 శాతం హెచ్‌ఆర్‌ఏ అందుతుంది.
Also Read: ఎమ్మెల్యే రోజా దత్తత గ్రామం ఎక్కడుంది? ఆ ఊరినే ఎందుకు ఎంపిక చేశారు? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే..
మిగిలినవారికి కమిటీ సిఫార్సుల ప్రకారం అందేది కేవలం 8 శాతమే. అయితే ఉద్యోగుల్లో వీరి శాతమే అధికం. దాదాపు 90 శాతం వరకూ ఉద్యోగులు 8శాతం హెచ్ఆర్ఏ పరిధిలోకి వచ్చేస్తారు. వీరంతా ప్రస్తుతం 12 నుంచి 16 శాతం హెచ్‌ఆర్‌ఏ తీసుకుంటున్నారు. అంటే ప్రభుత్వం ఈ హెచ్ఆర్ఏ ను అమలు చేస్తే వీరు పీఆర్సీ లో 4 శాతం, హెచ్ఆర్ఏ లో మరో 4 శాతం నుండి 8 శాతం కోల్పోతారన్నమాట. ఇక్కడే ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయంపై అనుమానంగా చూస్తున్నారు. అదే సమయంలో హెచ్ఆర్ఏ పై స్పష్టత లేకుండా సీఎం మీటింగ్ నుండి బయటకు వచ్చిన ఉద్యోగ సంఘాల నాయకులపై అసహనంతో రగిలిపోతున్నారు.
ప్రస్తుత హెచ్ఆర్ఏ నే కొనసాగించాలి: ఉద్యోగ సంఘాల నేతలు
పీఆర్సీపై మొదటి నుండి అనుమానంగానే ఉన్న ఉద్యోగులు తమ సంఘాల నేతలు పీఆర్సీ ప్రకటన సమయంలో హెచ్ఆర్ఏ పై ఎలాంటి స్పష్టత తీసుకోకుండా కేవలం రిటర్మెంట్ వయస్సు పెంచినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ రావడంపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల సోషల్ మీడియా గ్రూపుల్లోనే తమ కోపాన్ని వెళ్లగక్కడంతో ఇరుకున పడ్డ సంఘాల నేతలు ప్రభుత్వ పెద్దలతో భేటీ అయ్యారు. ప్రస్తుతానికి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) ఎలాంటి ప్రకటనా చెయ్యొద్దని కోరిన జేఏసీ నేతలు పాత హెచ్ఆర్ఏ నే కొనసాగించాలంటూ మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ మేరకు ఉద్యోగ సంఘాలు తమకు ప్రభుత్వంపై నమ్మకం ఉందనీ, హెచ్ఆర్ఏ తగ్గించాలంటూ ప్రతిపాదించిన కమిటీ సిఫార్సులను ప్రభుత్వం పట్టించుకోదనే నమ్మకం వ్యక్తం చేశాయి.
హెచ్ఆర్ఏ, క్వాంటం ఆఫ్ పెన్షన్ తేలకుండా జీతాల బిల్లులు సాధ్యమేనా..?
ప్రభుత్వం చెబుతున్నట్టుగా కొత్త పీఆర్సీతోనే జనవరి నెల జీతాలు అందుతాయా అన్న అనుమానం ఇప్పడు ప్రభుత్వ ఉద్యోగుల్లో బలపడుతుంది. హెచ్ఆర్ఏ అంశం తేలకుండా జీతాల బిల్లులు రెడీ చేయడం అంత సులువు కాదు. అలాగే పెన్షనర్లకు సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పై కొత్త పీఆర్సీలో మార్పులు చేర్పులు ఎలా ఉంటాయి అన్నదానిపై ప్రభుత్వం ఏమీ క్లారిటీ ఇవ్వలేదు. ఇలా ఉద్యోగులకూ, పెన్షనర్లకూ కొత్త పీఆర్సీతో ముడిపడిన అనేక అంశాలు చాలానే ఉన్నాయి. వీటిలో దీనిపైనా ప్రభుత్వం జీవోలు విడుదల చెయ్యనే లేదు. వీటిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టతా రానేలేదు. ఒకవేళ ప్రభుత్వవర్గాలు చెబుతున్నట్టు 8 శాతం హెచ్ఆర్ఏ కు ఉద్యోగులు ససేమిరా అన్న నేపథ్యంలో పీఆర్సీపై మళ్ళీ ఏవైనా చిక్కుముడులు పడతాయా అన్న అనుమానాలూ లేకపోలేదు. పోనీ ఈ చిక్కుముడులన్నీ త్వరలోనే తొలగిపోయినా వరుస సంక్రాంతి పండుగ, రిపబ్లిక్ డే ఇలా వరుస సెలవులు ఉన్న నేపథ్యంలో కొత్త పీఆర్సీతో జీతాలు నెలాఖరుకల్లా రెడీ అవుతాయా అన్న డౌట్ ఉద్యోగుల్లో ఉంది. పైగా డిసెంబర్ నెల జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆర్ధికంగా ఎంత సతమతమయ్యిందో ఉద్యోగులకు అనుభవమే. ఈ నేపథ్యంలో ఈ నెల జీతాలు కొత్త పీఆర్సీతో అందుకోవడం డౌటే అంటున్నారు విశ్లేషకులు.
Also Read: విశాఖలో అదిరిపోయే టూరిస్ట్ స్పాట్.. పాల సముద్రం లాంటి లుక్‌తో మైమరచిపోవచ్చు! ఈ టైంలో ది బెస్ట్
Also Read: విశాఖ తీరంలో హై టెన్షన్... భగ్గుమన్న రింగ్ వలల వివాదం... బోటు తగలబెట్టిన మత్స్యకారులు