Breaking News Live Telugu Updates: పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 08 Feb 2023 09:33 PM
పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి అమర్నాథ్ భేటీ, పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానం

విశాఖపట్నం: విశాఖలో వచ్చే నెల మూడు, నాలుగు తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి పారిశ్రామిక ప్రముఖులు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశారు. మరింతమంది పారిశ్రామిక దిగ్గజాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరఫున రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆహ్వానాలు అందజేస్తున్నారు. 


ఇందులో భాగంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని ఏపీ మంత్రి అమర్నాథ్ బుధవారం స్వయంగా కలుసుకున్నారు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సదస్సుకు హాజరు కావలసిందిగా అంబానీని ఆహ్వానించారు. అదేవిధంగా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ను, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను మంత్రి అమర్నాథ్ కలుసుకొని పెట్టుబడి సదస్సుకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు అందజేశారు.

ఇలాంటి ప్రధాని మనకు అవసరమా?: ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు

అదానీ సంస్థల కారణంగా ఎల్ ఐసీ, ఎస్బీఐ లాంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలు ‌నష్టపోతున్నా ప్రధానమంత్రి మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారించాలని రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు బహిష్కరించడం, మోదీ ప్రసంగం సమయంలో వాకౌట్ చేయడంతో పాటు పార్లమెంటులో ప్రతి రోజు నిరసన తెలిపారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రాష్ర్టపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై గంటన్నర మాట్లాడిన ప్రధాని మోదీ, ఒక్కసారి కూడా అదానీ విషయం ఎందుకు ప్రస్తావించలేదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. పది లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైనా మాట్లాడని ప్రధాని మనకు అవసరమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు

ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. ఆయనను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త విషయంలో ఆయన పార్టీపై రుసరుసలాడారు. ఎట్టకేలకు ఆయన అభ్యర్థన మన్నించి కొత్త సమన్వయకర్తను నియమించారు

Bhatti Vikramarka: ఆ స్కూళ్లు, కాలేజీలపై చర్యలు ఏవి?

  • తెలంగాణలో ఉన్న నారాయణ, చైతన్య స్కూళ్లు, కాలేజీల పరిస్థితి ఏంటి?

  • ప్లే గ్రౌండ్ ఉండదు, ప్రభుత్వ నిబంధనలు ఏవీ అమలు కావు

  • లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తారు

  • నిబంధనలు పాటించని వారిపై కఠిన నిబంధనలు తీసుకోవాలి - తెలంగాణ అసెంబ్లీలో భట్టి విక్రమార్క

Thirumala Updates: తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి అధికార భాష సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తెలంగాణ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన తెలంగాణ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ. కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, శ్రీనివాసుడి కృపా, కటాక్షాలు భారతదేశంపై ఎల్లవేళలా ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఆంధ్ర కూడా తెలంగాణా రాష్ట్రం లాగా అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే విధంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలని, ఆంధ్రలో బిఆర్ఎస్ పార్టి బలోపేతం చేందే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు.

JC Diwakar Reddy: పాదయాత్రలకు కాలం చెల్లిపోయింది - జేసీ దివాకర్ రెడ్డి

ఏపీకి చెందిన తెలుగు దేశం పార్టీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తెలంగాణ సీఎల్పీకి వచ్చారు. పాదయాత్రలకు కాలం చెల్లిందని, జనాలు పట్టించుకొనే స్థితిలో లేరని ఆయన అభిప్రాయపడ్డారు. నారా లోకేశ్, రేవంత్ రెడ్డితో పాటు ఎవరు పాదయాత్ర చేసినా ఫలితం ఉండబోదని అన్నారు. గతంలో పాదయాత్రలు వేరని, ఇప్పుడు వేరని.. ఇప్పుడు డబ్బుతోనే పాదయాత్రలు ముడిపడి ఉన్నాయని అన్నారు. 

RBI Repo Rate: రెపో రేటును పెంచిన ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022-23 ఆర్థిక సంవత్సరానికి చివరి క్రెడిట్ పాలసీ నిర్ణయాలు ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేడు ఉదయం రెపో రేటును ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హెచ్చు తగ్గులు, ద్రవ్యోల్బణం గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపుతున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది, అయితే ప్రపంచ సవాళ్లు మన ముందు ఉన్నాయి, కాబట్టి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. 2023 ఆర్థిక సంవత్సరానికి భారత జిడిపి 7 శాతంగా అంచనా అని ఆర్‌బిఐ గవర్నర్ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం రేటు 4 శాతం కంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని చెప్పారు.


MPC రెపో రేటును 0.25 శాతం పెంచినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఈరోజు ప్రకటించారు. దీని తర్వాత, దేశంలో రెపో రేటు గతంలో 6.25 శాతంగా ఉన్న 6.50 శాతానికి పెరిగింది. ఎంపీసీలోని ఆరుగురు సభ్యుల్లో 4 మంది దీనికి అనుకూలంగా ఓటు వేశారు.


 

Revanth Reddy Vs BRS: రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు

  • టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు

  • ప్రగతి భవన్ నక్సలైట్లు పేల్చివేసినా నష్టమే ఉండదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై ఆందోళన

  • ములుగు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్

  • రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్

  • రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే యాత్రను అడ్డుకుంటామని హెచ్చరిక

MLA Kotamreddy Sridhar Reddy: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫిర్యాదు

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కోటండ్డి శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాప్ చేసి, తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారని అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అంశంపై విచారణ చేయించాలని అందులో కోరారు. కారకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Hyderabad Real Estate Murder: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

హైదరాబాద్‌లో ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. బోయిన్‌పల్లిలో ఉంటూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న సిద్ధిఖీ అనే వ్యక్తిని ఫయాజుద్దీన్‌ హత్య చేశాడు. సిద్ధిఖీని దారుణంగా నరికి చంపేశాడు. రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలే ఆ హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఫయాజుద్దీన్‌తో పాటు అతని కుమారుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Background

సంక్రాంతి అనంతరం తగ్గుముఖం పట్టిన చలి, తెలంగాణలో కొద్దిగా పెరిగింది. కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది. నేడు మూడు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్ జారీ చేశారు.


కొద్ది రోజులుగా తెలంగాణలో చలి సాధారణంగా ఉండగా, ఇప్పుడు కాస్త పెరిగింది. రాష్ట్రంలో ఉత్తర తెలంగాణలోని 14 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. రెండు రోజుల క్రితం (ఫిబ్రవరి 5) ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన సంగతి తెలిసిందే. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.


ఎల్లో అలర్ట్ ఈ 14 జిల్లాల్లో
ఆదిలాబాద్, కుమ్రుం భీమ్‌, మంచిర్యాల, జయశంకర్ భూపాల్‌పల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు, ఎల్లుండి నుంచి క్రమంగా చలి తగ్గిపోతుందని వెదర్ బులెటిన్ లో వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి వర్ష సూచన లేదు.


ఇక ఆదిలాబాద్ లో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. 34 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత కూడా అక్కడే 13.7 డిగ్రీలు ఆదిలాబాద్‌లో నమోదైంది. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుందని, అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా అధికారులు వేసింది.



ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.


ఇక క్రమంగా ఎండాకాలం
‘‘రాష్ట్రంలో వాతావరణం మళ్లీ మారనుంది. ఇక మెల్లగా చలి కాలం నుంచి ఎండా కాలానికి మారనుంది. సాధారణంగా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో అంతగా ఎండ ఉండదు, కానీ ఈ సారి మాత్రం వేసవి కాలం కాస్త ముందుగా, మరింత జోరుగా మొదలవ్వనుంది. మరో ఐదు రోజుల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా పెరగనుంది. అనంతపురం నుంచి నెల్లూరు మధ్యలో, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉష్ణోగ్రతలు ఒక సారిగా వేడికానుంది. ఇప్పుడే 40 డిగ్రీలు రావు కానీ 37 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో నమోదవ్వనుంది. ముఖ్యంగా విజయవాడ - గుంటూరు ప్రాంతం, అలాగే నంధ్యాల జిల్లాలో రాష్ట్రంలోని మిగిలిన భాగాలకంటే వేడిగా ఉండనుంది. మరోవైపున చలి కూడా ఉంటుంది. రాత్రి వేళల్లో చల్లగా ఉండే వాతావరణం ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.