Maha Kumbh 2025: 45 రోజుల పాటు సాగే హిందువుల అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవం మహా కుంభమేళా 2025కు సమయం దగ్గర పడుతోంది. జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న ఈ మహా జాతర ఫిబ్రవరి 25వరకు సాగనుంది. ఈ సారి దాదాపు 45 కోట్లకు పైగా భక్తులు వస్తారని భావిస్తున్న నేపథ్యంలో అందుకు కావాల్సిన ఏర్పాట్లను అధికారులు మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం భక్తులకు అనువుగా ఉండేందుకు, సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఓ ప్రత్యేకమైన యాప్ తీసుకొచ్చింది. అదే మహా కుంభమేళా 2025 యాప్ (Maha Kumbh Mela 2025 App).
మహా కుంభమేళాలో జరిగే కార్యక్రమాలు, ఈవెంట్స్ లాంటివి ఎక్కడ జరుగుతున్నాయి, అక్కడికి ఎలా చేరుకోవాలి, వసతి సౌకర్యాలు వంటి భిన్న కేటగిరీలకు సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్‌లో పొందుపరిచారు. భక్తులకు మెరుగైన, సంతృప్తికరమైన అనుభవాన్ని అందించేందుకు ఈ యాప్ రూపొందించగా.. వసతితో పాటు భోజన సౌకర్యాలకు సంబంధించిన వివరాలు కూడా ఇందులో ఉంటాయి. అంతే కాదు మరో ముఖ్య విషయమేమిటంటే.. ఈ ఉత్సవాలకు కోట్లాది మంది తరలిరానున్నారు. కావున వెంట తీసుకువెళ్లే పిల్లలు, పెద్దవారిని మిస్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఈ తరహా సమస్యలను ఫిర్యాదు చేసేందుకు, వెంటనే పరిష్కారం పొందేందుకు అధికారులు ఈ యాప్‌లో ఎస్ఓఎస్ అలర్ట్ ఆప్షన్‌ను కూడా ఇచ్చారు. ఇది మీకు ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది.
SOS అలర్ట్‌ని ఎలా ఉపయోగించాలంటే..
- మహా కుంభమేళా 2025 యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేయాలి.
- యాప్ ఓపెన్ చేసి స్క్రీన్ కింద కనిపించే బార్‌లో, 'SOS'పై క్లిక్ చేయాలి.
- మీకు వెంటనే పోలీసుల సహాయం కావాలంటే, 'పోలీస్ హెల్ప్‌లైన్(Police Helpline)' అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై డయలర్ కనిపిస్తుంది. ఇది మీ డయల్-ప్యాడ్‌లో స్వయం చాలకంగా కనిపించే '112'కి కాల్ చేయమని సూచిస్తుంది.
- స్క్రీన్‌పై ఒక పెద్ద ఎరుపు బటన్‌ను ఉంటుంది. దానిపై SOS అని రాసి ఉంటుంది. మీరు దాన్ని నొక్కితే అది 1920కి డయల్ అవుతుంది. అంటే అది 'కుంభ్ హెల్ప్‌లైన్' నంబర్ అన్నమాట.
- దీని ద్వారా మీరు మిస్ అయిన మీ బంధువులు, స్నేహితుల సమాచారాన్ని పోలీసులుకు అందించవచ్చు. ఫలితంగా సులభంగా కనిపెట్టవచ్చు.
కుంభమేళా అంటే..
కుంభ అంటే సంస్కృతంలో కుండ, కలశం అని అర్థం. రాశుల్లోనూ కుంభ రాశి ఉంటుంది. కుంభ రాశిలోనే కుంభ మేళాను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. మేళా అంటే జన సమూహం, కూటమి, జాతరను సూచిస్తుంది. పవిత్ర నదుల దగ్గర ఇలా కూటమిగా రావడాన్నే కుంభ మేళాగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి.