ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థుల పాలిట కల్పతరువు. ఎంతోమంది మేధావులను అందించిన విశ్వవిద్యాలయం ఇది. విశాఖ నగరంలోని ఈ యూనివర్సిటీ జిజ్ఞాసను పెంచే ఎన్నో వింతలకు నెలవు. ఈ విద్యాలయంలో వింతలేంటి అంటారా? అయితే యూనివర్సిటీలోని జువాలజీ డిపార్ట్మెంట్ కి వెళ్లాల్సిందే. ఇక్కడి జువాలజీ డిపార్ట్మెంట్ లో ఎవరైనా ఒక్కసారి అడుగుపెడితే ముందుగా వాళ్లను పలుకరించేవి అక్కడున్న తిమింగలాలే ..! అవును మీరు విన్నది కరక్టే. జువాలజీ డిపార్ట్మెంట్ లో గత కొన్ని దశాబ్దాలుగా భద్రపరిచిన రెండు తిమింగలాల శకలాలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి. అవి రెండూ బాలీన్ జాతికి చెందిన తిమింగలాలు కావడం విశేషం. వాటిలో ఒకటి పెద్దది కాగా మరొకటి చిన్న తిమింగల అవశేషాలు.
జువాలజీ డిపార్ట్ మెంట్ లో భారీ తిమింగలాల శకలాలు
ఈ పెద్ద తిమింగలం కళేబరం 1949లో అంటే 73 ఎళ్ల క్రితం బాపట్ల సముద్ర తీరానికి కొట్టుకు రాగా దానిని విద్యార్థుల అవగాహన కోసం ఆంధ్ర యూనివర్సిటీకి తరలించారు. అయితే 80 అడుగుల పొడవున్న ఈ తిమింగలం శరీరాన్ని తరలించలేక ముక్కలుగా చేసి కేవలం తల, వెన్నుముక, పక్కటెముకలు మాత్రం ఆంధ్ర యూనివర్సిటీ వరకూ తేగలిగారు. అనంతరం దాని కపాలాన్ని జాగ్రత్తగా యూనివర్సిటీలోని జువాలజీ డిపార్ట్మెంట్ ముందు భద్రపరిచారు. అలాగే ఆ తిమింగలం వెన్నుముక, ప్రక్కటెముకలను డిపార్ట్మెంట్ ముందు ద్వారంలా అలంకరించారు. ఇదే కాకుండా ఇక్కడ మరో తిమింగల శకలం కూడా ఉంది. అది ఒక బేబీ తిమింగలం శకలాలు. దాని పొడవు 27 అడుగులు. ఈ తిమిగలం 1960లో కాకినాడ సముద్ర తీరానికి కొట్టుకు వచ్చింది. దీన్ని మాత్రం పూర్తి శరీరంతో విశాఖకు తరలించి యూనివర్సిటీలో పెద్ద తిమింగలం శకలాల పక్కనే భద్రపరిచారు. అయితే దీని మొత్తం అస్థిపంజరం పొడవు ఆ పెద్ద తిమింగలం తల కంటే చిన్నగా ఉండడం చూస్తే ఇవి ఎంతటి భారీ జీవులో అర్ధమవుతుంది. అందుకే వీటిని స్టడీ చేయడానికి ఒడిశా, ఛత్తీస్ గడ్ , వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి విద్యార్థులు వస్తూ ఉంటారు.
Also Read: కర్నూలు నగరంలో శుక్రవారం ఆటో ప్రయాణం ఫ్రీ.. ప్రశంసలు అందుకుంటున్న ఖాదర్ ప్రయత్నం
అరుదైన ప్రాణులపై పరిశోధనకు అవకాశం
జువాలజీ డిపార్ట్మెంట్ లో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఉండడం ఎంతో గర్వకారణంగా ఉందని ఆంధ్ర యూనివర్సిటీ జువాలజీ డిపార్ట్మెంట్ విద్యార్థులు చెబుతున్నారు. ఈ తిమింగలాల శకలాలపై పరిశోధన చెయ్యడానికి, తిమింగలాలు వంటి అరుదైన జాతులను పరిరక్షించుకోవాల్సిన అవసరం గురించి అవగాహన కలుగుతుందని ఇక్కడి విద్యార్థులు చెబుతున్నారు. ఇప్పుడంటే వివిధ ఛానెళ్లు, ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచంలోని ఏ జీవజాలం గురించి అయిన పరిశోధన చేస్తున్నారు. కానీ 60-70 ఏళ్ల క్రితం విద్యార్థులకు అది కుదరని పని. ఇక తిమింగలాల వంటి అరుదైన సముద్ర ప్రాణుల గురించి ఇంత దగ్గరగా పరిశీలించడం అంటే అది కలలో మాట. అలాంటి స్థితిలో ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఈ రెండు తిమింగలాల శకలాలు మౌనంగానే ఎంతో విజ్ఞానాన్ని అందించాని అధ్యాపకులు అంటున్నారు.
Also Read: నీకు నా మొగుడే కావాలా..? సచివాలయంలో మహిళల కొట్లాట..